ఎర్ర జెండా అడ్డా‌…భువ‌న‌గిరి గ‌డ్డ‌

– కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు
– సీపీఐ(ఎం) అభ్యర్థి జహంగీర్‌ నామినేషన్‌ దాఖలు
నవతెలంగాణ-భువనగిరి
తెలంగాణ సాయుధ విప్లవ రైతాంగ పోరాటం జరిగిన పోరాటాల ఎర్రజెండా అడ్డా భువనగిరి గడ్డ అని, వారసత్వం పుణికిపుచ్చుకున్న భువనగిరి పార్లమెంటు సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండి.జహంగీర్‌ను ప్రజలు గెలిపించాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు పిలుపునిచ్చారు. శుక్రవారం సీపీఐ(ఎం) అభ్యర్థి నామినేషన్‌ అనంతరం భువనగిరి ఏఆర్‌ గార్డెన్లో నిర్వహించిన సభలో ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. అనేక పోరాటాలు నిర్వహించిన సీపీఐ(ఎం) చరిత్రను సీపీఐ(ఎం) పార్టీపై పోటీ చేసిన జహంగీర్‌ చరిత్రను, ఇతర పార్టీల, వ్యక్తుల చరిత్రను తెలుసుకొని అర్హులైన వారికే ఓటు వేయాలని కోరారు. గెలుపునకు మీరందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు .సీపీఐ(ఎం) గెలిస్తే ప్రజల హక్కులుతో పాటూ వారి సమస్యలు పరిష్కారమవుతాయని, పూర్వవైభవం భువనగిరికి వస్తుందని పేర్కొన్నారు.
సీపీఐ(ఎం)ను గెలిపించండి ..మతోన్మాద రాజకీయాలను ఓడించండి :సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండి. జహంగీర్‌
తెలంగాణలో భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గం లో పోటీ చేస్తున్న సీపీఐ(ఎం) సుత్తకోడం నక్షత్రం పై ఓటు వేసి గెలిపించి మతోన్మాదులకు బుద్ధి చెప్పాలని సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండి.జహంగీర్‌ విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం నియోజకవర్గంలో అవకాశవాద రాజకీయాలు, మతోన్మాద రాజకీయాలు ఒకవైపు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే వామపక్ష భావజాలం ఉన్న సీపీఐ(ఎం) మరోవైపు నిలబడి ఎన్నికల బరిలోకి దిగామన్నారు. ప్రజలు గ్రహించి సీపీఐ(ఎం)ను ఆదరించి మతోన్మాదులను తరిమికొట్టాలన్నారు. గ్రామ గ్రామాన కమ్యూనిస్టుల ఎర్రజెండాలు రెపరెపల ఆడాలని కోరారు. 2008లో నుండి ఏర్పడ్డ భువనగిరి నియోజకవర్గంలో కోమటిరెడ్డి బ్రదర్‌లు రెండుమార్లు బూర నర్సయ్య గౌడ్‌ మరోమారు పోటీ చేసి గెలిచారన్నారు. ఈ నియోజకవర్గ అభివద్ధికి దూరమైందని తెలిపారు. ప్రజలకు సేవ చేసే ఈ పదవులను వారు విలాసాలకు వాడుకున్నారని తెలిపారు. బస్వాపురం ప్రాజెక్టు, గంధ మల్ల ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తికాలేదన్నారు .భువనగిరిలో సాగు, తాగునీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. హైదరాబాదు నుండి భువనగిరికి నీరు కొనుకునే పరిస్థితి ఉందన్నారు. ఉపాధి ,పరిశ్రమలు మౌలిక రంగాల్లో అత్యంత వెనుకబడ్డ పార్లమెంటు నియోజకవర్గం అని పేర్కొన్నారు. ఐదు సంవత్సరాల బీఆర్‌ఎస్‌ పాలనలో వైఫల్యం చెందామని బూర నర్సయ్య గౌడ్‌ తెలిపారని వివరించారు. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు బీజేపీని తిరస్కరిస్తున్నారని తెలిపారు. బీజేపీ ఆటలు సాగవని తెలిపారు. కాంగ్రెస్‌, బీజేపీ ప్రజా ఉద్యమాలు వారి పాత్ర ఏందని ప్రశ్నించారు. కేవలం డబ్బులు ఉండడమే వారికి అర్హత అని ఎద్దేవా చేశారు .ప్రజా సమస్యల పరిష్కారం కోసం లాఠీ దెబ్బలు తిన్నామని అనేక పోరాటాలు చేసి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కషి చేసినట్టు తెలిపారు . సీపీఐ(ఎం)కు ఒకసారి అవకాశం ఇవ్వాలని కోరారు. బీబీనగర్‌ మండలంలోని ఎయిమ్స్‌ వైద్యశాలలో 48 విభాగాలు ఉండగా 24 విభాగాలు మాత్రమే పనిచేస్తున్నాయని ఇది బీజేపీ చేతకానితనం కాదా అది ప్రశ్నించారు. సీపీఐ(ఎం)ను గెలిపించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు.
దేశ భవిష్యత్తు ప్రజల భవిష్యత్తు
రాష్ట్రకార్యదర్శివర్గసభ్యులు జూలకంటి రంగారెడ్డి
దేశ భవిష్యత్తు, ప్రజల భవిష్యత్తు ఈ ఎన్నికల్లో ప్రాముఖ్యత దాగి ఉందని ప్రజలు ఓటును సద్వినియోగం చేసుకొని సీపీఐ(ఎం) గెలిపించాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గాసభ్యులు జూలకంటి రంగారెడ్డి విజ్ఞప్తి చేశారు. పోరాటాల చరిత్ర ఉన్న ఈ ప్రాంతం పేదలకు లక్షలాది ఎకరాలు పంపిణీ చేసిందన్నారు. వెట్టిచాకిరి విముక్తి సంఘాల ఏర్పాటు చేసిందన్నారు. కమ్యూనిస్టు పార్టీకి ప్రజలు కలిసి రావాలని కోరారు. కమ్యూనిస్టు పార్టీ ఉన్నతమైన ఆశయాలతో వీర తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుల ఆశయ సాధన కోసం సీపీఐ(ఎం) పనిచేస్తుందన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ పాత్ర ఈ పోరాటాల్లో లేదని పేర్కొన్నారు. కనీసం ప్రజల కోసం చేసే పోరాటాల్లో కూడా వారు లేరని తెలిపారు. మతము కులము ప్రాంతం అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేసేవారని విమర్శించారు. ప్రజలు తలుచుకుంటే ఈ పోరాటాల గడ్డలో పెట్టుబడి దార్ల చేతుల్లో బందీ అయిన పార్టీలకు బుద్ధి చెప్పడం సాధ్యమే నని తెలిపారు. నాటి మొట్టమొదటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ కంటే ఈ ప్రాంతం నుండి పోటీ చేసిన రావి నారాయణరెడ్డి కే అత్యధిక ఓట్లు వచ్చాయని తెలిపారు. ఆ కమ్యూనిస్టు యోధుని బాటలో నడుస్తున్న ఎండి.జహంగీర్‌ను అదే విధంగా ఆదరించి ఓట్లు వేయాలని కోరారు.
రాజ్యాంగాన్ని మారుస్తానంటే ఊరుకునేది లేదు
రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి
రాజ్యాంగం మారుస్తానంటే ప్రజలు ఊరుకునేది లేదని స్పష్టంగా చెబుతున్నారని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి తెలిపారు రాజ్యాంగ పరిరక్షణ కోసం సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండి జహంగీర్‌కు అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. తెలంగాణ పోరాట వారసత్వాన్ని పునికి పంచుకున్న ఎండి.జహంగీర్‌ మూసి కాల్వ పక్షాన యాదాద్రి భువనగిరి జిల్లా సమగ్ర అభివద్ధి కోసం పాదయాత్రలు చేశారన్నారు. ఇండ్లు ఇండ్ల స్థలాలు విద్యుత్‌ చార్జీలు ఇతర సమస్యలు కమ్యూనిస్టులు పోరాట ఫలితంగానే తగ్గాయని సీపీఐ(ఎం) అభ్యర్థి తరపున ప్రచారం చేస్తుంటే ప్రజలు చెబుతూ ఆదరిస్తున్నారని తెలిపారు. సభలో నల్గొండ జిల్లా, సూర్యాపేట, రంగారెడ్డి ,జనగామ, సిద్దిపేట జిల్లాల కార్యదర్శులు ముదిరెడ్డి సుధాకర్‌ రెడ్డి, మల్లు నాగార్జున రెడ్డి, కడిగళ్ల భాస్కర్‌, మోకు కనకారెడ్డి, ఆముదాల మల్లారెడ్డి, పీఎన్‌ఎం రాష్ట్ర అధ్యక్ష,కార్యదర్శులు కట్టనర్సింహ, ఆనంద్‌ పాల్గొన్నారు.

Spread the love