‘170’కి పర్మిషన్‌..నిర్మాణం 600 గజాల్లో..

– మున్సిపల్‌ అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్‌
నవతెలంగాణ- బడంగ్‌పేట్‌
మహేశ్వరం నియోజకవర్గం బడంగ్‌పేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో అడ్డూ అదుపు లేకుండా రోజు రోజుకూ విచ్చల విడిగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్లితే..మహేశ్వరం నియోజకవర్గం బడంగ్‌పేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని మల్లాపూర్‌ 14వ డివిజన్‌ పరిధిలో ఉన్న ఓ వ్యక్తి 170 గజాల ఇంటి నిర్మాణానికి అనుమతి తీసుకొని.. 600గజాల స్థలంలో సెల్లారు ఏర్పాటు చేసి భారీ ఎత్తున ఇంటి నిర్మాణ పనులు చేపట్టాడు.
ఈ విషయంపై స్థానికులు ప్రశ్నిస్తే.. తాను కంటెస్టెంట్‌ కార్పొరేటర్‌నని…ప్రభుత్వ అనుమతి లేకుండానే ఇంటి నిర్మాణం చేస్తానని, నన్ను ఎవరూ ఏం చేసుకుంటారో చేసుకోండంటూ స్థానికులకు సమాధానం ఇస్తూ బహుళ అంతస్తుల భవన నిర్మాణ పనులను యథేచ్ఛగా చేస్తున్నాడు. ఈ విషయంపై బడంగ్‌పేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులకు, టౌన్‌ ప్లానింగ్‌ అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ .. చేపట్టిన అక్రమ నిర్మాణాలను వెంటనే మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు కూల్చివేయాలని కోరారు. అంతేకాదు అక్రమ నిర్మాణ, సెల్లార్ల యాజమానులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

నోటీసులిచ్చి కూల్చేస్తున్నాం..
మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో అక్రమ నిర్మాణాలు చేపట్టిన ఇంటి యజమానులకు నోటీసులు ఇస్తున్నాం. నూతనంగా ఇంటి నిర్మాణాలను చేపట్టే యజమానులు తప్పకుండా మున్సిపల్‌ కార్పొరేషన్‌ అనుమతి తీసుకోవాలి. అక్రమ నిర్మాణాలను చేపట్టే ఇంటి యజమానులకు నోటీసులు ఇచ్చి మరి అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నాం.
– బడంగ్‌పేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారి లాలప్ప

Spread the love