ఈ వైఖరి తగదు

ఈ వైఖరి తగదు– న్యాయమూర్తుల నియామకం, బదిలీలపై కేంద్రానికి సుప్రీం సూచన
– తప్పుడు సంకేతాలు వెళతాయని హెచ్చరిక
న్యూఢిల్లీ : హైకోర్టుల న్యాయమూర్తుల నియామకం, బదిలీల విషయంలో కొలీజియం చేసిన సిఫార్సులను ఆమోదించేటప్పుడు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఏదో యథాలాపంగా న్యాయమూర్తులను ఎంపిక చేసి, నియమించడం వల్ల తప్పుడు సంకేతాలు వెళతాయని ఈ వైఖరి తగదు హెచ్చరించింది. హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించేందుకు సుప్రీంకోర్టు కొలీజియం కొందరి పేర్లు సిఫార్సు చేసిందని, అయితే ప్రభుత్వం ఎనిమిది పేర్లకు ఇంకా ఆమోదం తెలపలేదని న్యాయమూర్తులు సంజరు కిషన్‌ కౌల్‌, సుధాన్షు దులియాలతో కూడిన బెంచ్‌ తెలిపింది. నియమితులైన వారి కంటే వీరిలో కొందరు సీనియర్‌ న్యాయమూర్తులని గుర్తు చేసింది. గతంలో పంపిన ఐదుగురి పేర్లను మరోసారి పంపినప్పటికీ కేంద్రం వాటికి ఆమోదం తెలపకపోవడాన్ని ప్రస్తావించింది.
‘పంజాబ్‌లో ఇద్దరు అత్యంత సీనియర్‌ న్యాయమూర్తులను నియమించలేదు. కొన్ని ఎంపిక చేసిన నియామకాలు జరిపేటప్పుడు ఈ సమస్య తలెత్తుతుంది. వారు సీనియారిటీ కోల్పోతారు. అలాంటప్పుడు వారు జడ్జీలుగా నియమితులయ్యేందుకు ఎందుకు సిద్ధపడతారు?’ అని కొలీజియంలో సభ్యుడు కూడా అయిన జస్టిస్‌ కౌల్‌ ప్రశ్నించారు. ‘నాకు తెలిసిన సమాచారం మేరకు ఐదుగురు జడ్జీలను బదిలీ చేశారు. మిగిలిన వారిని చేయలేదు. వారిలో నలుగురు గుజరాత్‌కు చెందిన వారు’ అని అన్నారు. న్యాయమూర్తుల నియామకంలో జాప్యం జరుగుతున్నందున ప్రభుత్వంపై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టాలంటూ బెంగళూరు న్యాయవాదుల సంఘం దాఖలు చేసిన పిటిషన్‌పై బెంచ్‌ విచారణ జరుపుతోంది. అసెంబ్లీ ఎన్నికల కారణంగానే జాప్యం జరుగుతోంది తప్ప ప్రభుత్వ అలసత్వమేమీ లేదని అటార్నీ జనరల్‌ ఆర్‌.వెంకటరమణి తెలిపారు. దీనిపై న్యాయమూర్తి కౌల్‌ స్పందిస్తూ కొలీజియం సిఫార్సుల్లో సగం కూడా ఆమోదం పొందలేదని చెప్పారు. ఎనిమిది మంది సీనియర్లకు నియామక ఉత్తర్వులు ఇవ్వలేదని, ఇలా చేయడం ద్వారా తప్పుడు సంకేతాలు పంపినట్లు అవుతుందని తెలిపారు. ఈ కేసుపై తదుపరి విచారణ డిసెంబర్‌ ఐదవ తేదీన జరుగుతుంది.

Spread the love