– ప్రతిపక్షాలపై మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు
– స్టీల్‌బ్రిడ్జిను ప్రారంభించిన మంత్రి
– అంతర్జాతీయ ప్రమాణాలతో ఇందిరాపార్క్, ట్యాంక్‌బండ్ అభివృద్ధి
నవతెలంగాణ-సిటీబ్యూరో.. అంబర్‌పేట, అడిక్ మేట్
ఇప్పటిదాకా చూసింది ట్రైలర్ మాత్రమే.. 2023లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం హ్యాట్రిక్ విజయం సాధించి ప్రతిపక్ష పార్టీలకు సినిమా చూపిస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌లో రూ.450 కోట్లతో ఇందిరాపార్క్ నుంచి వీఎస్టీ చౌరస్తా వరకు నిర్మించిన స్టీల్ బ్రిడ్జి (నాయిని నరసింహారెడ్డి ఫ్లై ఓవర్)ని పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు శనివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. పనిచేసే, పనికొచ్చే ముఖ్యమంత్రి కేసీఆర్ అని, హ్యాట్రిక్ విజయం సాధించేలా ఆశీర్వదించండని ప్రజలను కోరారు. ఆర్టీసీ క్రాస్ రోడ్డులో సినిమా చూడటం కాదు ప్రతిపక్షాల కోసం సినిమా చూపెట్టండి అని విజ్ఞప్తి చేశారు. 2023లో బీఆర్‌ఎస్ హ్యాట్రిక్ విజయం సాధించి ప్రతిపక్షాలకు సినిమా చూపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ విశ్వనగరంగా ఎదగాలంటే కుల, మతాలకు అతీతంగా అభివృద్ధి సాగాలని, అందుకోసం బీఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో నూతన సచివాలయం, అమరవీరుల స్థూపం, అంబేద్కర్ విగ్రహం, స్టీల్ బ్రిడ్జి వంటి అనేక కార్యక్రమాలతో సెంట్రల్ హైదరాబాద్ నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ఇలాంటి సందర్భంలో మతాల మధ్య చిచ్చుపెట్టే వాళ్లు, చిల్లర పార్టీల వారి మోసాలకు గురైతే మరో వందేండ్లు ఈ నగరం వెనక్కి పోతుందన్నారు. ఈ ప్రాంతంతో ఆత్మీయ సంబంధాలు ఉన్న దివంగత నాయిని నర్సింహారెడ్డి అనుబంధాన్ని, ఆయన ఇక్కడి ప్రజలకు, కార్మికులకు చేసిన సేవలను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు నాయిని నర్సింహారెడ్డి స్టీల్ బ్రిడ్జిగా నామకరణం చేశామని చెప్పారు. ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు.తెలంగాణ వచ్చాక సిగల్ ఫ్రీ హైదరాబాద్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌ఆర్‌డీపీ కార్యక్రమం ప్రారంభించి రోడ్డు రవాణా సౌకర్యాలను అభివృద్ధి చేసుకుంటున్నామన్నారు. ఇప్పటిదాకా 36 పనులను పూర్తి చేశామని తెలిపారు. పది సంవత్సరాల్లో రాష్ట్రం మత కల్లోలాలు, గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉన్నదన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఇందిరాపార్కును అద్భుతంగా తీర్చిదిద్దే బాధ్యత తమదని, లోయర్ ట్యాంక్ బండ్, అప్పర్ ట్యాంక్ బండ్‌ను టూరిస్ట్ ప్రాంతంగా మారుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, మాగంటి గోపీనాథ్, బేతి సుభాష్ రెడ్డి, ఎమ్మెల్సీ సురభి వానిదేవి, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, బీఆర్‌ఎస్ ఎంఎంఎన్ శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్ శ్రీనివాస్‌రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర నాయకులు ముఠా జైసింహ, నాయిని నర్సింహారెడ్డి కుటుంబ సభ్యులు, జీహెచ్‌ఎంసీ అధికారులు పాల్గొన్నారు.