దేశానికి కావాల్సింది… ప్రశ్నలే!

What the country needs... are questions!కేంద్రమంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ రాజస్థాన్‌లోని బర్మర్‌లో నిర్వహించిన ర్యాలీలో చెలరేగిపోయాడు. ‘సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడే వారి నాలుక కోసేయాలి. కండ్లు పీకేయాలని’ అన్నాడు. సనాతనకు వ్యతిరేకంగా మాట్లాడే వారికి దేశాన్ని పాలించే అర్హత లేదని కూడా చెప్పుకొచ్చారు. ఎందుకింత విద్వేషపు అలజడులు రేకెత్తిస్తున్నారు? ఎందుకింత ప్రజల భావోద్వేగాలతో ఆడుకుంటున్నారు? ఎందుకిలా ఉన్మాద చర్యలను ప్రేరేపిస్తున్నారు? తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ సనాతనపై చేసిన వ్యాఖ్యలకు సమాధానం చెప్పలేని బీజేపీ-ఆరెస్సెస్‌ పరివారం ‘చంపేస్తాం..నరికేస్తాం’ అంటూ ఊగిపోతోంది. హింసను ప్రోత్సహిస్తోంది. దేశాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. భిన్నాభిప్రాయాలు చెప్పగలిగేదే ప్రజాస్వామ్యం. దాన్ని అమలు చేయాల్సింది కేంద్రంలో ఉన్న అధికారపక్షం. కానీ మాట్లాడే స్వేచ్ఛే లేదంటే మరి రాజ్యాంగంలో పొందుపరిచిన భావ ప్రకటనా హక్కు ఉన్నట్టా…లేనట్టా? సనాతన ధర్మం చర్చ అలా ఉంచితే ఇక్కడ ‘పరివారం’ వ్యవహరిస్తున్న తీరు గమనించాల్సిన అంశం. ప్రశ్నించే ప్రతి ఒక్కరినీ ఇలా బెదిరింపులకు గురిచేయడం, హింసను ప్రేరేపించే విధంగా మాట్లాడటం వారు చెప్పే ఆధ్యాత్మికత కూడా అంగీకరించదు కదా..! ఇది రాక్షసత్వమే తప్ప మరోటి కాదు. అయితే ఉదయనిధి స్టాలిన్‌ తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నాడు. ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఎక్కడ సదస్సు, సభలు జరిగినా తనదైన శైలిలో బీజేపీపై ప్రశ్నలు సంధిస్తూనే ఉన్నాడు. ఇలాంటి వ్యక్తులే కావాలి నేడు దేశానికి. ఆయన ధైర్యంగా మాట్లాడటమే కాదు నిలబడ్డాడు. ఆయనకు విశాల ప్రజామోదం కూడా లభిస్తోంది. అయితే దీన్ని సహించలేని శక్తులు చేస్తున్న రాద్దాంతమే విస్మయాన్ని కలిగిస్తోంది.
అయోధ్యకు చెందిన ఓ స్వామీజీ ఉదయనిధి తలపై రూ.10కోట్ల రివార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. అతని తలనరికి తన చేతిలో పెట్టాలని, ఆ పని ఎవరూ చేయడానికి ముందుకు రాకపోతే..తానే చేస్తానంటూ బెదిరిం చాడు. వెంటనే స్పందించిన స్టాలిన్‌ ‘మీ ప్రాంతంలో కులవివక్ష, అంటరానితనం లేకుండా చేస్తే నేనే రూ.20 కోట్లు ఇస్తానని’ సవాల్‌ విసిరాడు. దీన్ని బట్టి దేశంలో కులం స్థానాన్ని అర్థం చేసుకోవచ్చు. అక్రమ మైనింగ్‌ కోసం ఒక జాతి నిర్మూలనకే పథకం వేసిన నాయకులు సనాతనను నిర్మూలించాలనగానే ఎక్కడలేని విద్వేషాన్ని వెళ్గగక్కుతున్నారు. ఎక్కడపడితే అక్కడ విషాన్ని చిమ్ముతున్నారు. మూడునెలలుగా మతం మంటల్లో కాలిపోతున్న మణిపూర్‌పై ఒక్కరంటే ఒక్కరూ కూడా స్పందించలేదు. అంతెందుకు ప్రధానే నోరువిప్పలేదు. బాధితుల్ని ఓదార్చేందుకు రాష్ట్రాన్ని సందర్శించారా? శాంతి, భద్రతలను పర్యవేక్షించారా? కానీ ఉదయనిధి వ్యాఖ్యలపై ఏకంగా కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో ఊటంకించి సనాతన గురించి ఎవరు మాట్లాడినా సహించ కూడదనే సందేశాన్ని ఇచ్చారు. అంటే వీరి అధికారమంతా సనాతన పెంచిపోషించమేనన్నమాట. ప్రజల బాగోగులకంటే కూడా కుల, మతాల్నే రక్షించాలన్న మాట. వీరి విభజనవాదానికి అవి రక్షణ కవచాలన్నమాట.
అయితే సనాతన పేరుతో చేస్తున్న రాద్దాంతం, విధ్వంసాన్ని ఉదయనిధి ఖండిస్తూనే ఉన్నాడు. ఉదయనిధే కాదు, ప్రతి పౌరుడూ ఖండించాలి. మోడీ పాలనలో దేశం తిరోగమనంలోకి వెళ్తోంది. ధరాభారం జనాన్ని అవస్థలు పెడుతోంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం ఆందోళనకు గురిచేస్తోంది. విభజన రాజకీయం కంటిమీద కునుకే లేకుండా చేస్తోంది. ప్రయివేటీకరణ, ఉత్పాదకత, ప్రభుత్వరంగ సంస్థల నిర్వీర్యం, అభద్రతా భావం ఇలా సమాజాన్ని పట్టిపీడించే సమస్యలు ఇప్పుడు కోకొల్లలు. వీటి నుంచి దృష్టిమరలించడానికి ఎత్తుకున్న రాగం ‘భారత్‌’, పాడుతున్న పాట ‘జమిలి’. సనాతన అంటేనే ఆధిపత్యమని అర్థమైన తర్వాత దాన్నుంచి ఎలా బయటపడాలన్న అంశంపై నేడు చర్చ అవసరం. అందుకు ఉదయనిధి స్టాలిన్‌లు ఊరికొకరు కావాలి. ధైర్యంగా మాట్లాడాలి. అవసరమైన ప్రతిచోటా పోరాడాలి. పరివారం ప్రేరేపిస్తున్న హిందూత్వను అడ్డుకుని దేశాన్ని లౌకికతత్వంవైపు నడిపించాలి.’ప్రశ్నిస్తే శత్రువుగా మిగిలిపోతావేమో… అయినా పర్వాలేదు కానీ బానిసగా మాత్రం జీవించకు’ అన్న స్ఫూర్తే ఇప్పుడు దేశానికి రక్ష.

Spread the love