ఎక్కడ ఫీజుల నియంత్రణ చట్టం?

ప్రయివేట్‌, కార్పొరేట్‌ స్కూల్స్‌లో ఫీజుల మోత మోగుతోంది. ఇది ప్రతియేటా విద్యార్థుల తల్లిదండ్రులకు భారమవుతోంది. ప్రయివేట్‌, కార్పొరేట్‌, ఇంటర్నేషనల్‌ పేరుతో నడిపిస్తున్న స్కూల్స్‌ ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఇటు విద్యాశాఖాధికారులుగానీ, అటు ప్రభుత్వంగానీ ఆ స్కూల్స్‌పై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం విడ్డూరంగా ఉంది. ప్రభుత్వ నిబంధనలు ఈ స్కూల్స్‌లో క్షేత్రస్థాయిలో అమలు కాకపోవడం దారుణం. ఫీజులను కట్టడి చేస్తామంటూ సంవత్సరాల నుంచి చెబుతున్న మాటలను ఆచరణలో మాత్రం పెట్టడం లేదు. ప్రొ. తిరుపతిరావు కమిటీ అంటూ కొన్ని రోజులు, మంత్రుల కమిటీ అంటూ కొన్ని రోజులు ప్రభుత్వ పెద్దలు కాలయాపన చేశారు. చివరికి ఈ రెండు కమిటీలు ఇచ్చిన సిఫారసులను పక్కన పెట్టేశారు. దీంతో ఫీజులు మళ్లీ ఎంత పెంచుతారో అంటూ తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో పైచిలుకు కార్పొరేట్‌, ప్రయివేట్‌ స్కూల్స్‌ ఉండగా, వీటిలో దాదాపుగా… లక్షల మంది చదువుతున్నారు. ఫలితంగా ప్రయివేట్‌, కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో అడ్మిషన్ల కోసం వెళ్లిన తల్లిదండ్రులకు ఫీజులు చూస్తే దిమ్మ తిరుగుతుంది. రాష్ట్రంలో కొన్ని పాఠశాలకు పర్మిషన్‌ లేకపోయినా అద్దె భవనాలు చూపిస్తూ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న అడ్మిషన్ల పేరుతో డబ్బులు దండుకుంటున్నాయి యజమాన్యాలు. గత సంవత్సరం ఫీజు కంటే 20నుంచి 30శాతం వరకు ఫీజులు పెంచు తున్నాయి. స్కూల్స్‌ స్థాయిని, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఫీజులు పెంపకం నడుస్తుంది. కార్పొరేట్‌ స్కూల్స్‌ బ్రాంచీల పేరుతో రాష్ట్రంలో నిర్మానుష్యంగా ఉండే ప్రాంతాల్లో స్కూల్స్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రాంతాల్లో అడిగే నాథుడులేడనే ఉద్దేశాలతో విద్యాలయాలు నడిపిస్తున్నారు. విద్యార్థుల తల్లితండ్రులను పరోక్షంగా భయాందోళన గురిచేస్తున్నారు. రాష్ట్రంలో నారాయణ, శ్రీ చైతన్య, భాష్యం, సెయింట్‌ జోసెఫ్‌ పబ్లిక్‌, కృష్ణవేణి టాలెంట్‌, శాంతినికేతన్‌, నాగార్జున స్కూల్స్‌ వివిధ ప్రాంతాలలో బ్రాంచిల పేరుతో విద్యా వ్యాపారం సాగిస్తున్నారు. ఆఖరికి పపుస్తకాలు, బూట్లు, టై, బెల్ట్‌ వరకు ఇష్టం వచ్చినట్లు రేటు పెట్టి అమ్ముతున్నారు. నిజానికి ప్రభుత్వ సూచనల మేరకు స్కూల్‌ పరిధిలో ఇవి అమ్మరాదు అని నిబంధన ఉన్న పట్టించుకోకుండా వీటిని అమ్ముతున్నారు. పూర్తిస్థాయిలో భవనాలు ఉండవు, క్రీడా స్థలాలు ఉండవు, ఇరుకైన తరగతి గదులు, మౌలిక సదుపాయాలు ఉండవు. ఫైర్‌ సేఫ్టీ ఉండవు అయినప్పటికీ ఈ స్కూలుకు రెన్యువల్‌కు దరఖాస్తు పెట్టుకుంటే విద్యాశాఖ అధికారులు అనుమతులిచ్చేస్తున్నారు. స్కూల్‌ ఫీజుల పెంపును నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓ చట్టం చేయాలని నిర్ణయం తీసుకుంది. జనవరిలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో మంత్రులతో ఫీజు నియంత్రణకు విధివిధానాలు ఏర్పాటు చేసేందుకు ఉప సంఘాన్ని నియమించారు. ఈ కమిటీ కూడా ప్రతి ప్రయివేట్‌, కార్పొరేట్‌ స్కూల్లో ఫీజుల వసూళ్లపై సమగ్ర విచారణ చేసి తల్లిదండ్రులకు భారం కాకుండా ఉండే ఫీజులు రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసులు చేసింది. వీటిపై ప్రత్యేక చట్టం చేసేందుకు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టాలి. కానీ ఇప్పటివరకు ఆ ప్రయత్నం జరగలేదు. అటువైపు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు, అడుగులు కూడా పడకపోవడం గమనార్హం. ప్రత్యేక చట్టం చేయాలని విద్యార్థి సంఘాలు, పేరెంట్స్‌ అసోసియేషన్‌ నిరసనలు వ్యక్తం చేస్తున్న గాని ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరం. వాస్తవానికి ఏ విద్యా సంస్థనైనా ట్రస్ట్‌ పేరిట నడపాలి. దానికి ఒక గవర్నమెంట్‌ బాడీ ఏర్పాటు చేయాలి. అయితే కార్పొరేట్‌ పాఠశాలలో నామమాత్రంగా గవర్నమెంట్‌ బాడీ చూపిస్తున్నా, అధికారం మొత్తం యాజమాన్యం చేతుల్లో పెట్టుకుంటుంది. కొన్ని స్కూల్స్‌ ఒకేసారి మొత్తం ఫీజు కట్టాలని నిబంధనలను అమలు చేస్తున్నాయి. లేదంటే అడ్మిషన్లు ఇవ్వడం లేదు. అందుకే వెంటనే రాష్ట్రంలోని అన్ని ప్రయివేట్‌, కార్పొరేట్‌ పాఠశాలలో ఫీజు నియంత్రణ ఉండేటట్టు విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు, తల్లితండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు.

– సభావట్‌ కళ్యాణ్‌
9014322572

Spread the love