నేటి నుంచి పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు

నవతెలంగాణ – హైదరాబాద్: నేటి నుంచి పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 22 వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈరోజు ఉదయం 10 గంటలకు పార్లమెంటరీ పార్టీ నేతలు సమావేశం కానున్నారు. ఈ భేటీలో సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై నేతలు చర్చించనున్నారు. ఈ సమావేశాల్లో 3 భారతీయ నేరన్యాయ బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో పాటు ఎన్నికల కమిషనర్ల నియామకాల బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉందని టాక్. మరోవైపు సభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు సోమవారం ఉదయం ఇండియా కూటమి నేతలు సమావేశం కానున్నారు. మొయిత్రా అంశంతో పాటు.. ద్రవ్యోల్బణం, మణిపుర్‌ హింస, కేంద్ర దర్యాప్తు సంస్థలు దుర్వినియోగమవుతున్న తీరుపై ప్రభుత్వాన్ని విపక్షాలు నిలదీసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా జరిగిన సార్వత్రిక సెమీఫైన్​లో మూడు రాష్ట్రాల్లో విజయకేతనం ఎగురవేసిన బీజేపీ ఈ పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో కాంగ్రెస్‌ నేతృత్వంలోని విపక్షాలను ఇరుకున పెట్టే వ్యూహాలతో రెడీగా ఉంది. లోక్‌సభలో ప్రశ్నలు అడగడానికి డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ మహువా మొయిత్రా అంశం ఈ సమావేశాల్లో తీవ్ర అలజడిని రేపే అవకాశం ఉంది.

Spread the love