సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ అధికారుల దాడి

-10 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సబ్ రిజిస్ట్రార్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగి
– ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి వెల్లడి
నవతెలంగాణ – గంగాధర 
గంగాధర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పై శనివారం ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఓ డాక్ మెంట్ రైటర్ వద్ద రూ. 10 వేలు తీసుకుంటూ ఆఫీస్  సోర్సింగ్ ఉద్యోగి కొత్తకొండ శ్రీధర్, ఇంచార్జి సబ్ రిజిస్ట్రార్ సురేష్ బాబును ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ రమణ మూర్తి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన కొక్కుల రాజేశం తన కుమారుడు కొక్కుల అజయ్ కుమార్ కు కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం రేకుర్తి గ్రామ శివారులోని 131 సర్వేనెంబర్ లో గల నాలుగు గుంటల భూమిని గిఫ్ట్ డిడి చేసేందుకుగాను గంగాధర లోని డాక్యుమెంట్ రైటర్ ఆకుల అంజయ్య ను సంప్రదించారు. ఆకుల అంజయ్య సదరు భూమి డాక్యుమెంట్ తీసుకొని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్ళగా ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్ రూ 10 వేలు లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపారు. ఆకుల అంజయ్య ఏసీబీ అధికారులను సంప్రదించగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పై దాడి చేసి ఔట్ సోర్సింగ్ ఉద్యోగి కొత్తకొండ శ్రీధర్ ద్వారా కరీంనగర్ డీఆర్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తూ గంగాధర ఇంచార్జీ సబ్ రిజిస్ట్రార్ గా పనిచేస్తున్న శివారపు సురేష్ బాబు .రూ 10 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకోవడం జరిగిందని ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపారు. నగదును స్వాధీనం చేసుకొని ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్ శివారపు సురేష్ బాబు తో పాటు ఆఫీస్ సబార్డినేటర్ కొత్తకొండ శ్రీధర్ లను అదుపులోకి తీసుకుని ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరు పర్చనున్నట్లు ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి వివరించారు.

Spread the love