నవతెలంగాణ బెంగళూరు: లైంగిక దాడి కేసులో నిందితుడు 40 అడుగుల ఎత్తైన జైలు గోడ దూకి తప్పించుకున్నాడు. అయితే ఆ మరుసటి రోజే పోలీసులు ఆ నిందితుడును పట్టుకున్నారు. అయితే ఆ ఖైదీ గోడ దూకి జైలు నుంచి తప్పించుకున్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. లైంగిక దాడి ఆరోపణల కింద నమోదైన కేసులో 23 ఏండ్ల వసంత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. రిమాండ్ నిమిత్తం అతడ్ని దావణగెరె సబ్ జైలులో ఉంచారు. అయితే రిమాండ్ ఖైదీగా ఉన్న వసంత్ ఆ జైలు నుంచి తప్పించుకున్నాడు. శుక్రవారం జైలు చుట్టూ ఉన్న 40 అడుగుల ఎత్తైన గోడ నుంచి మరోవైపు దూకాడు. ఈ నేపథ్యంలో స్వల్పంగా గాయపడిన అతడు అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. కాగా, ఈ విషయం తెలుసుకున్న జైలు సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. నిందితుడు వసంత్ జైలు నుంచి తప్పించుకున్న విషయాన్ని పోలీసులకు చెప్పారు. దీంతో అతడి కోసం వెతికిన పోలీస్ బృందాలు వసంత్‌ను శనివారం అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఆ ఖైదీ గోడ దూకి జైలు నుంచి తప్పించుకున్న సంఘటన ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.