నవీపేట్ మేకల సంతలో ఆంధ్ర గొర్రెల పెంపకం దారులపై దాడులు

– అధిక ధరలకు కొంటున్నారని ఆరే కటికే వ్యాపారస్తుల దౌర్జన్యం..
– గొర్రెలు లాక్కొని వేధించిన వైనం..
– పోలీసులకు ఫిర్యాదు
– ఆకలితో అలమటించి జీవాల మృతి
నవతెలంగాణ – నవీపేట్

అధిక ధరలకు గొర్రె పొట్టేళ్లను కొనుగోలు చేస్తున్నారని నిజామాబాద్ జిల్లా ఆరే కటికే వ్యాపారస్తులు ఆంధ్ర గొర్రెల పెంపకం దారులపై దౌర్జన్యం చేశారు. మండల కేంద్రంలో శనివారం మేకల సంతకు ఆంధ్ర ప్రాంతం నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం నుండి వచ్చిన 15 మంది గొర్రెల పెంపకం దారులపై కటికే సంఘం సభ్యులు దాడి చేసి సుమారు 45 గొర్రె పొట్టేళ్లను దౌర్జన్యంగా ఎత్తుకెళ్లారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం గొల్ల కురుమలకు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గొర్రెల పథకంలో ఆంధ్రా ప్రాంతం నుండి ఎక్కువ శాతం గొర్రెలు తెలంగాణకు రావడంతో అక్కడ గొర్రెలు, గొర్రె పొట్టేళ్ల సంఖ్య తగ్గడంతో గొర్రెల పెంపకం దారులు తెలంగాణలోని నవీపేట్, బాన్సువాడ, ఇచ్చోడ తదితర మేకల సంతలకు వచ్చి కొనుగోలు చేస్తున్నామని ఎక్కడ కూడా తమకు అభ్యంతరం లేదని కానీ నవీపేట్ మేకల సంతలో తమపై దౌర్జన్యంగా దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని గొర్రెల పెంపకం దారుడు రమేష్ వాపోయారు. ఉదయాన్నే పోలీసులకు సమాచారం ఇవ్వగా కొందరి సహకారంతో 29 గొర్రె పొట్టేళ్లను తిరిగి ఇచ్చిన 16 ఇవ్వకపోవడంతో బాసర మార్గంలోని మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ వద్ద సాయంత్రం వరకు వేచి చూడడం ఇచ్చిన జీవాలను బలవంతంగా వాహనాల్లో పడేయడం, ఆహారం లేకపోవడంతో ఒక గొర్రె పొట్టేలు మృతిచెందగా మరికొన్ని అస్వస్థతకు గురయ్యాయని తాము తీవ్రంగా నష్టపోయామని దుర్గయ్య వాపోయారు. ఈ విషయమై కార్యదర్శి రవీందర్ నాయక్ దృష్టికి తీసుకెళ్లగా పోలీసులకు సమాచారం చెప్పడంతో ఫిర్యాదు చేశామని వెంటనే దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకొని తమకు రక్షణ కల్పిస్తేనే మేకల సంతకు వస్తామని దుర్గయ్య వాపోయారు. మేకల సంతలో ఇటువంటి అరాచకాలు తరచూ జరుగుతుండడంతో క్రయవిక్రయదారులకు రక్షణ లేకుండా పోతుందని కాబట్టి సంతలో పోలీసుల రక్షణతో పాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు.

Spread the love