అక్రమ కేసులు పెడుతున్నారంటూ డీజీపీని కలిసిన బీఆర్ఎస్ నాయకులు

న‌వ‌తెలంగాణ – హైద‌రాబాద్:  బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ బీఆర్ఎస్ నాయకులు డీజీపీ రవి గుప్తాను కలిశారు. డీజీని కలిసిన వారిలో గట్టు రామచంద్రరావు, బాల్క సుమన్, శంభీపూర్ రాజు, గెల్లు శ్రీనివాస్ యాదవ్ తదితరులు ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల కాలంలోనే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ప్రవర్తిస్తోందని వారు పేర్కొన్నారు. పోలీసుల్ని అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్‌ను ఇబ్బందులకు గురిచేసే కార్యక్రమాలను ప్ర‌భుత్వం ప్రోత్సహిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధానాలను, పనితీరు ప్రశ్నించిన వారిపై అసహనంతో ఊగిపోతోందని, సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పోస్టులు పెడితే పోలీసులు అత్యుత్సాహంతో కేసులు న‌మోదు చేస్తున్నారన్నారు. బైండోవ‌ర్లు, కేసులు, ఫోన్లలో బెదిరింపులకు దిగుతూ బీఆర్ఎస్ కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారన్నారు. పోలీసు అధికారులు కూడా ప్రభుత్వానికి వంతపాడుతూ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ తమ పార్టీ వారిపై జులుం ప్రదర్శిస్తున్నారన్నారు.

Spread the love