తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు రేపే నోటిఫికేషన్

న‌వ‌తెలంగాణ – హైద‌రాబాద్ : ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికలకు రేపు నోటిఫికేషన్ విడుదల కానుంది. దేశంలో సార్వత్రిక ఎన్నికలు ఈసారి 7 దశల్లో జరగనుండగా… తెలుగు రాష్ట్రాల్లో నాలుగో దశలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఏపీలో లోక్ సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగాల్సి ఉండగా… తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు రేపు (ఏప్రిల్ 18) నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. నోటిఫికేషన్ వచ్చిన క్షణం నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 18 నుంచి 25వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. ఈ నెల 26న అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన చేపడతారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 29 వరకు గడువు ఉంటుంది. అనంతరం మే 13న ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు… తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తారు. అన్ని విడతల పోలింగ్ పూర్తయ్యాక జూన్ 4న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపడతారు. నాలుగో దశలో… ఏపీ, తెలంగాణ రాష్ట్రాలే కాకుండా మరో 7 రాష్ట్రాల్లోనూ, కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్ లోనూ ఎన్నికలు జరగనున్నాయి. ఈ విడతలో మొత్తం 96 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. నాలుగో విడతలో ఏపీ (25), తెలంగాణ (17), మహారాష్ట్ర (11), బీహార్ (5), మధ్యప్రదేశ్ (8), ఉత్తరప్రదేశ్ (13), ఒడిశా (5), పశ్చిమ బెంగాల్ (8), ఝార్ఖండ్ (3), జమ్ము కశ్మీర్ (1) లో ఎన్నికలు చేపడతారు.

Spread the love