పంద్రాగస్ట్ లోగా రుణమాఫీ చేస్తా : సీఎం రేవంత్ రెడ్డి

నవతెలంగాణ-హైదరాబాద్ : తాను జోగులాంబ అమ్మవారి సాక్షిగా మాట ఇస్తున్నానని… పంద్రాగస్ట్ లోగా తాను రుణమాఫీ చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. మంగళవారం నాగర్ కర్నూలులోని బిజినేపల్లిలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా ఆపేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. పాలమూరు ప్రజలందరం ఏకమై జిల్లాను అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. పాలమూరు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులన్నింటిని తాము తప్పకుండా పూర్తి చేస్తామన్నారు. పాలమూరును బంగారం నేలగా మార్చుకునే అవకాశం మనకు వచ్చందన్నారు. అగస్ట్ 15వ తేదీలోపు రుణమాఫీ చేయకుంటే రాజీనామా చేస్తారా? అని అంటున్నారని… కానీ తప్పకుండా రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. దేశానికే ఆదర్శవంతమైన నాయకులను పాలమూరు గడ్డ ఇచ్చిందన్నారు. డెబ్బై ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రి అయ్యే అవకాశం పాలమూరు బిడ్డకు దక్కిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో పాలమూరు గడ్డకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. గతంలో కరీంనగర్‌లో ఓటమి భయంతోనే కేసీఆర్ పాలమూరు నుంచి ఎంపీగా పోటీ చేశారని వ్యాఖ్యానించారు. పాలమూరు ప్రజలు కేసీఆర్‍‌ను పార్లమెంటుకు పంపించారని… కానీ ఆయన మాత్రం అన్యాయమే చేశారని మండిపడ్డారు.

Spread the love