పెద్ద సమయం పట్టదు

అంతా కనిపిస్తూనే వుంటారు అందరూ వినిపిస్తూనే వుంటారు
కానీ.. కలిసివుండటానికీ కలిసిపోవడానికీ అందరినడుమా అడ్డంగా
కళ్ళముందే మొలుస్తున్న గోడలు
ఎవరికి వారు నిర్మించుకుంటున్న దడీలు
భ్రమాలోకపు గడీలు తవ్వి తలకెత్తుకుంటున్న కందకాలు
చుట్టూరా ఖాళీలు కొలతలకందని దూరాలు
ఎవరి లెక్క వారిది ఎవరి కుహరం వాళ్ళది
నేనే.. ఇన్నాళ్లూ ఇన్నేళ్లూ కాళ్ళరిగేలా కలియదిరిగాను
ప్రవాహంలా పరుగులుపెట్టాను ప్రయాణ కాలంలో అనేక దశలు దిశలు
అలసట వొచ్చినప్పుడల్లా ‘అల్లమురబ్బా’ నోట్లో వేసుకుని
పైత్యాన్ని వదిలించుకున్నాను
ఇవ్వాళ ఖాళీల్ని పూరించడానికి మౌనాన్ని శబ్దమయం చేయడానికి
కొత్త పదాల్ని పదబంధాల్నీ నేర్చుకుంటున్నాను
బంధాలకు కొత్త రూపునూ అనుబంధాలకు నవ్యదారుల్నీ రూపొందిస్తున్నాను
మబ్బుల అంతరాయాల్ని తొలగిస్తూ అస్తమయం కానీ జీవితాన్ని అవలోకిస్తూ
మనుషుల సమూహంలోకి మమతల జాతరలోకి
నడక సాగిస్తున్నాను
అస్తమయం తర్వాత సూర్యోదయానికి పెద్ద సమయం పట్టదు
కొంచెం ఓపికుండాలి ఒకింత విశ్వాసముండాలి
ఎంతయినా అందరమూ మనుషులమే కదా!
– వారాల ఆనంద్‌, 9440501281

Spread the love