హాస్టల్‌ వర్కర్ల బకాయి వేతనాలు చెల్లించాలి

–  పీఓకు సీఐటీయూ వినతి
నవతెలంగాణ-భద్రాచలం
గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో నిర్వహించ బడుతున్న పోస్ట్‌ మెట్రిక్‌ హాస్టల్‌లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్‌ కార్మికులకు రావలసిన 21 నెలల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని, అదేవిధంగా మూడున్నర నెలల డైలీ వేజ్‌ వర్కర్ల బకాయి వేతనాలు చెల్లించాలని కోరుతూ తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలు హాస్టల్‌ డైలీ వేజ్‌, ఔట్సోర్సింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ సిఐటియు డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఐటిడిఏ కార్యాలయంలో సోమవారం పిఓకు వినతి పత్రం అందజేశారు. 21 నెలలుగా కార్మికులు వేతనాలు లేకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఏడు నెలల వేతనాలకు సంబంధించి బడ్జెట్‌ వచ్చి రెండు నెలలు గడిచినా వేతనాలు చెల్లింపులో అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారని పీఓకి వివరించారు. స్పందించిన ఐటీడీఏ పీవో సంబంధిత సెక్షన్‌ అధికారులను పిలిచి తక్షణం వేతనాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. డైలీ వేజ్‌ వర్కర్లుగా పని చేస్తూ మరణించిన కార్మికుల వారసులకు డైలీ వేజ్‌ వర్కర్‌గా గాని లేదంటే ఐటిడిఏ పర్యవేక్షణలో నడుస్తున్న గురుకులాలు, ఏకలవ్య పాఠశాలల్లో వర్కర్లుగా నియమించాలని సిఐటియు కోరింది. 1993కి ముందు నుంచి డైలీ వేజ్‌ వర్కర్లుగా పనిచేస్తున్న 23 మంది కార్మికుల సమగ్రమైన వివరాలను కమిషనర్‌ కార్యాలయానికి పంపించి వారి ఉద్యోగాలు పర్మినెంట్‌ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని పిఓను సిఐటియు కోరింది. విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈసారైనా కార్మికులందరికీ యూనిఫాంలో అందజేయాలని పిఒను కోరారు. సమస్యల పరిష్కారం కోసం కమిషనర్‌కు లేక పెడతామని కమిషనర్‌ ఆదేశాల అనుసారం సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పిఓ హామీ ఇచ్చినట్లు సిఐటియు నేతలు తెలిపారు. సమస్యల పరిష్కారం చేయకపోతే పోరాటాలు ఉధృతం చేస్తామని ఐటీడీఏ కార్యాలయం ముందు నిరవధిక ధర్నా చేస్తామని సిఐటియు జిల్లా అధ్యక్షులు కే.బ్రహ్మచారి తెలిపారు. వినతి పత్రం అందజేసిన వారిలో సిఐటియు జిల్లా అధ్యక్షులు కే.బ్రహ్మచారి, యూనియన్‌ జిల్లా నాయకులు రామ, జలంధర్‌, సీఐటీయూ పట్టణ నాయకులు ఉన్నారు.

Spread the love