ఐపీఎల్ టికెట్ల జారీ తీరును ఎండగడుతూ రేపు నిరసన కార్యక్రమం: ఏఐవైఎఫ్, డీవైఎఫ్ఐ,పీవైఎల్

– ఐపీఎల్ టికెట్ల జారీలో పారదర్శకత లేకుండా వ్యవహరించిన హెచ్ సీఏ బోర్డ్, సన్ రైజర్స్ ఫ్రాంచైజీ యాజమాన్యాల తీరును ఎండగడుతూ రేపు(25/4/2024) నిరసన కార్యక్రమం
– తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఐపీఎల్ టికెట్ల బ్లాక్ మార్కెట్ అంశంపై పూర్తి నివేదికను ప్రకటించాలి
– ఏఐవైఎఫ్-డీవైఎఫ్ఐ – పీవైఎల్ యువజన సంఘాల డిమాండ్
నవతెలంగాణ – హైదరాబాద్: ఐపీఎల్ టికెట్ల జారీలో పారదర్శకత లేకుండా వ్యవహరించిన హెచ్ సీఏ బోర్డ్, సన్ రైజర్స్ ఫ్రాంచైజీ యాజమాన్యాల తీరును ఎండగడుతూ రేపు నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు, తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఐపీఎల్ టికెట్ల బ్లాక్ మార్కెట్ అంశంపై అరకొర ప్రకటనలు కాకుండా పూర్తి నివేదికను ప్రజలకు ప్రకటించాలని డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (DYFI),ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ (AIYF), ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ (PYL) తెలంగాణ రాష్ట్ర యువజన సంఘాల ఐక్య కార్యాచరణ సమితి నేతలు ప్రకటించారు.ఈ సందర్భంగా యువజన సంఘాల నేతలు బాగ్ లింగంపల్లి లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా డీ వై ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండీ. జావీద్…ఏ ఐ వై ఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నెర్లకంటి శ్రీకాంత్ ,ప్రధాన కార్యదర్శి కె. ధర్మేంద్ర…. పీవైఎల్ రాష్ట్ర అధ్యక్షుడు కెఎస్. ప్రదీప్ లు సంయుక్తంగా మాట్లాడుతూ.. ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ నెల 25 సన్ రైజర్స్ హైదరాబాద్- రాయల్ ఛాలెంజర్స్ జట్ల మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరగాల్సి ఉందని, ఈ మ్యాచ్ కు సంబంధించిన టికెట్లను గత శుక్రవారం విక్రయానికి పెట్టారని, అయితే టికెట్లను పేటిఎంలో అమ్మకానికి పెట్టిన క్షణాల్లోనే టికెట్లను అమ్ముడు పోయాయంటూ బోర్డ్ ప్రకటించారని. దాదాపు 36 వేలకు పైగా టికెట్లను అమ్మకానికి పెట్టిన అరగంట గంటలోపే ఏవిధంగా అమ్ముడుపోతాయో హెచ్ సీఏ, సన్ రైజర్స్ యాజమాన్యాలు రాష్ట్ర ప్రజలకు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.అదే విధంగా ఈ విషయం పై ఇప్పటికే అనేక విధాలుగా యువజన సంఘాల ఆధ్వర్యంలో పోరాటాలు చేసినా, హెచ్ సీఏ బోర్డ్ ఇప్పటివరకు ఎటువంటి సమాధానం చెప్పలేదని, కాసులకు కక్కుర్తి పడి క్రీడాభిమానులకు వినోదాన్ని దూరం చేస్తున్న చర్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్ల వారు అన్నారు. తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ అధికార యంత్రాంగం ఐపీఎల్ టికెట్ల బ్లాక్ మార్కెట్ అంశంపై స్పందించిందని, ఒప్పందం మేరకే టికెట్లు జారీ చేశామని చెప్పిన స్పోర్ట్స్ అథారిటీ అధికారులు, టికెట్ల సమస్యపై,స్టేడియం నిర్వహణపై పూర్తి స్థాయి నివేదికను ప్రకటించాలని డిమాండ్ చేశారు. హెచ్ సీఏ బోర్డ్, సన్ రైజర్స్ యాజమాన్యాల వికృత వ్యాపార క్రీడలో క్రీడా అభిమానులు నష్ట పోవాల్సిన అవసరం ఏమున్నదని, తక్షణమే బోర్డ్ టికెట్లకు సంబంధించిన వివరాలను పబ్లిక్ డొమైన్ లో పొందుపరచాలని, జవాబుదారీతనంగా ఉండాలని లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా క్రీడా వ్యాపారంపై పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు హస్మి, పీవైఎల్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు,కార్యదర్శి రవి కుమార్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Spread the love