టర్కీ అధ్యక్షుడిగా ఎర్డోగన్‌ తిరిగి ఎన్నిక

కెమాల్‌ కిలిక్‌ దరోగ్లును ఓడించి తయ్యిప్‌ ఎర్డోగన్‌ మూడవసారి టర్కీ అధ్యక్షుడిగా ఎన్నికై నట్లు టర్కీ సుప్రీమ్‌ ఎలెక్షన్‌ కౌన్సిల్‌ సోమవారం నాడు ప్రకటించింది. ఈ ఎన్నికల్లో ఎర్డోగన్‌కు 52.14 శాతం ఓట్లురాగా, కిలిక్‌ దరోగ్లుకు 47.86 శాతం ఓట్లు వచ్చాయని సుప్రీమ్‌ ఎలెక్షన్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ అహమ్మద్‌ యెనీర్‌ ఒక పత్రికా సమావేశంలో చెప్పాడు. ఎలెక్షన్‌ కౌన్సిల్‌ విడుదల చేసిన సమాచారం ప్రకారం ఎర్డోగన్‌ తన ప్రత్యర్థిని 22 లక్షల ఓట్ల ఆధిక్యంతో గెలిచాడు.
”ఈరోజు ఎవరూ ఓడిపోలేదు. మన 8.5 కోట్ల పౌరులలో ప్రతి ఒక్కరూ గెలిచారు. ఎన్నికల ప్రచారంలో పేర్కొనబడిన తగవులను, తగాదా లను పక్కనపెట్టి, మన జాతి కన్నకలల కోసం, లక్ష్యాల కోసం ఐక్యమవ్వా ల్సిన సమయం ఇది” అని రాజధాని అంకారాలోని అధ్యక్ష భవనం బయట చేసిన తన విజయానంతర ఉపన్యాసంలో ఎర్డోగన్‌ విజ్ఞప్తి చేశాడు.
ఆదివారం రాత్రి ఎన్నికలు ముగిసిన తరువాత కొన్ని గంటల్లోనే ఎర్డోగన్‌ తన ప్రత్యర్థి, కిలిక్‌ దరోగ్లు కంటే చాలా ముందున్నట్టు అందరికీ అర్థమైందని టర్కీ అనడోలు వార్తా సంస్థ పేర్కొంది. 98 శాతం ఓట్ల లెక్కింపు జరిగేటప్పటికే తాను గెలుపొందినట్టు, అందుకు దేశంలోని ప్రతి ఒక్కరికీ తాను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని ఎర్డోగన్‌ తన ఇస్టాంబుల్‌ నివాసం బయట ప్రకటించాడు. ఈ ఎన్నికలకు ముందు మే14న జరిగిన మొదటి రౌండు ఎన్నికల్లో ఎర్డోగన్‌ ఆధిక్యంలో వున్నప్పటికీ ఆయనకు అధ్యక్షుడుగా గెలవటానికి కావలసిన 50 శాతం ఓట్లు పడలేదు. పర్య వసానంగా రెండవ రౌండు ఎన్నిక అనివార్యం అయింది. మూడవ అభ్యర్థి, సినాన్‌ ఒగాన్‌ను తొలగించి ఆదివారంనాడు రెండవ రౌండు ఎన్నికను నిర్వహించారు.
ఎర్డోగన్‌ 11 సంవత్సరాలపాటు టర్కీ ప్రధానిగా పనిచేసిన తరువాత 2014 నుంచి అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. ఆయన పాలనలో టర్కీ యూరోపియన్‌ యూనియన్‌లో చేరకుండా దూరంగా జరిగింది. ఉక్రెయిన్‌ తో సహా ప్రాంతీయ ఘర్షణలను పరిష్కరించే శాంతికాముకుడి పాత్రను ఎర్డోగన్‌ పోషిస్తున్నాడు. ఆయన నాయకత్వంలోని టర్కీకి రష్యా, చైనాలతో మంచి వాణిజ్య, దౌత్య సంబంధాలున్నాయి. ఆయన ప్రత్యర్థి కిలిక్‌ దరోగ్లు ఎర్డోగన్‌ కంటే ఉదారవాది. నాటో కూటమి దేశాలతో దెబ్బతిన్న టర్కీ సంబంధాలను మెరుగుపర్చాలని, యూరోపియన్‌ యూనియన్‌లో చేరేం దుకు చర్చలను తిరిగి మొదలెట్టాలని ఈయన ఆశించాడు. కిలిక్‌ దరోగ్లు తన ఓటమిని హుందాగా అంగీకరిస్తూ తన ఓటమికి విచారిస్తున్నాననీ, ”నిజమైన ప్రజాస్వామ్యం”కోసం తన పోరాటం కొనసాగుందనీ ప్రకటించాడు.
నాటో దేశాలలో ఎర్డోగన్‌ నాయకత్వంలోని టర్కీ ఒక్కటే రష్యాపై ఆంక్షలను విధించలేదు. ఉక్రెయిన్‌ యుద్ధం మొదలయ్యాక రష్యా, టర్కీ దేశాలమధ్య సంబంధాలు మరింతగా బలోపేతమయ్యాయి. తన విదేశాంగ విధానం సమతుల్యంగా ఉందని, టర్కీని ఒక ప్రాంతీయ ఇందన వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చేయదలిచానని, ఇంధన ఉత్పత్తిదారులైన రష్యా, అజర్‌ బైజన్‌ వంటి తూర్పు దేశాలకు, వినియోగదారులైన పశ్చిమ దేశాలకు మధ్య టర్కీ సంధానకర్త పాత్రను పోషిస్తుందని ఎర్డోగన్‌ అన్నాడు.

Spread the love