సరిహద్దుల్లో గంజాయి ఘాట్‌

– మన్నెంలో మాటేసిన స్మగ్లర్లు
దండకారణ్యమంతా గంజాయి ఘాటే…! సరిహద్దులన్నీ గంజాయి దారులే…! మన్యం అంతా స్మగ్లర్ల అడ్డాలే…! కొందరి అధికారులు అండదండలు పుష్కలం…! గంజాయి ఏజెన్సీ గడప దాటిందా ఇక కోటీశ్వరులే..! నిత్యం సినీ పక్కాలో ‘పుష్ప’ చిత్ర సీనులే…! ఇదీ మూడు రాష్ట్రాల కూడలిలో నిత్యం జరిగే గంజాయి స్మగ్లర్ల ఘరానా దందా.
– గంజాయి రవాణాకు రెక్కలు
– సరిహద్దుల్లో కొరవడిన నిఘా
– గమ్యం దాటిందా కోటీశ్వరులే..
నవతెలంగాణ-భద్రాచలం
తెలంగాణ రాష్ట్రం చివరి అంచు భద్రాచలం పుణ్యక్షేత్రం. పట్టణానికి అడుగు అవతలపెట్టామా… ఆంధ్ర, చత్తీస్గడ్‌, ఒరిస్సా రాష్ట్రాల పరిధిలోకి వెళ్లిపోతాం. భద్రాచలం మన్యానికి ఆనుకొని ఈ మూడు రాష్ట్రాల దండకారణ్యం ఉంది. ఇక్కడ పెద్ద ఎత్తున గంజాయి సాగుఅవుతోంది. అటవీ ప్రాంతం కావడంతో గంజాయి సాగుకు అనుకూల వాతావరణ ఉంది. అక్కడి ప్రభుత్వాలు అంతగా పట్టించు కోకపోవడంతో నిషేధిత గంజాయి సాగు జోరుగానే ఉంది. అటవిమాటున అక్రమం రాజ్యమేలుతోంది. ఒరిస్సాలోని చిత్రకొండ, కల్లూరు, బలిమెల, పెళ్లి బారు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని గుత్తేడు, డొంకరాయి, సీలేరు, కొండరాజుపేట, ఛత్తీస్గడ్‌ రాష్ట్రంలోని పలు అటవీ ప్రాంతాలలో గంజాయి పెద్ద ఎత్తులో సాగుతోంది.
మన్యంలో మాటేసిన స్మగ్లర్లు…
ఛత్తీస్గడ్‌, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్‌ అటవీ ప్రాంతాల్లో సాగవుతున్న గంజాయిని అక్కడి నుంచి తరలించి సొమ్ములు చేసుకునేందుకు గంజాయి స్మగ్లర్లు భారీగానే ఏజెన్సీలో మొహరిస్తున్నారు. నిత్యం ఇదే కార్యకలాపాల్లో వారి మునిగి తేలుతున్నారు. దొరికితే దొంగ లేదంటే దొర అన్నచందంగా స్మగ్లర్ల ఆగడాలు కొనసాగుతున్నాయి. చత్తీస్గడ్‌, ఆంధ్ర ప్రదేశ్‌, ఒరిస్సా తదితర రాష్ట్రాల్లో చెక్‌ పోస్ట్‌లు ఉన్నప్పటికీ అవి ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యాయి. అక్కడి తనికీ అధికారుల అండదండలతోనే గంజాయి ఆయా మార్గాల గుండా పెద్ద పెద్ద పట్టణాలకు తరలిపోతోందని ఆరోపణలు ఉన్నాయి. రకరకాల మార్గాలను ఎంపిక చేసుకొని స్మగ్లర్లు చాకచక్యంగా గంజాయిని తమ తమ గమ్యస్థానాలకు చేర్చి కోట్లకు పడగలెత్తారు. తెలంగాణ భద్రాచలం వద్ద చెక్‌ పోస్ట్‌లు ఉన్నా అడప దడపా గంజాయి రవాణాకు చెక్‌ పెడుతున్నప్పటికీ ఇంకా పెద్ద ఎత్తున గంజాయి భద్రాచలం దాటి వెళుతోందని తెలుస్తోంది. భద్రాచలంలో సోమవారం భారీగా గంజాయి పట్టుబడింది. రూ.1 కోటి విలువైన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి భద్రాచలం ఏఎస్పి పరితోష్‌ పంకజ్‌ తెలిపిన వివరాలు వెల్లడించిన విషయాలు విధితమే. అక్రమ గంజాయి రవాణాకు పాల్పడుతున్న స్మగ్లర్లు భద్రాచలం, చింతూరు, కుంట, రాజమండ్రి, ఒరిస్సా తదితర ప్రాంతాల్లోని లాడ్జిల్లో మకాం పెట్టి తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు వినికిడి. ముందస్తుగా రెక్కీ నిర్వహించి తదుపరి వ్యూహాత్మకంగా స్మగ్లింగ్‌ పాల్పడుతున్నట్లు సమాచారం. భద్రాచలంలో సోమవారం పట్టుబడిన గంజాయిని పరిశీలిస్తే..స్మగ్లర్లు స్మగ్లింగ్‌లో రకరకాల మార్గాలను ఎంచుకుంటున్నట్లు అవగతం అవుతోంది. ట్రాక్టర్‌ ట్రాలీలో ప్రత్యేక చాంబర్‌ కట్టి అందులో గంజాయి ప్యాకెట్లు దాచి, పైకి కాన రాకుండా స్మగ్లింగ్‌ చేస్తూ పట్టుబడిన సంఘటన ఆశ్చర్యాన్ని కలిగించింది. గతంలో కూడా అనేక రూపాల్లో గంజాయిని తరలిస్తుండగా పట్టుబడిన సంఘటనలు ఉన్నాయి.
గమ్యానికి చేరితే కోటీశ్వరులే…
ఈజీ మనీకి అలవాటు పడిన కొందరు గంజాయి స్మగ్లర్లు ఇదే తమ జీవన వృత్తిగా మార్చుకొని అటవీ గ్రామాల్లో సంచరిస్తున్నారు. తమకున్న పరిచయాలతో ఒప్పందాలు కుదుర్చుకొని చాకచక్యంగా గంజాయిని సరిహద్దులు దాటి స్తున్నారు. కొందరు స్మగ్లర్లు అక్రమ గంజాయి రవాణాతో కోట్లకు పడగలెత్తారని తెలుస్తోంది. దొరికితే దొంగ లేదంటే దొర అన్న చందంగా వీరు తమ కార్యకలాపాలను యదే చ్చగా కొనసాగిస్తున్నారు.
మన్యం నుంచి గంజాయిని వరంగల్‌, హైదరాబాద్‌, విశాఖపట్నం, మహారాష్ట్ర, అదిలా బాద్‌ తదితర పట్టణాలకు తరలించి గంజాయి దందా సాగిస్తున్నారు. ఇక రాబోయేది వర్షాకాలం కావడంతో అడవులు ఆకుపచ్చగా మారనున్న నేపథ్యంలో ఇక గంజాయి రవాణాకు అనుకూల వాతావరణం ఉంటుందని గంజాయి స్మగ్లర్లు ఇక మరింత రెచ్చిపోయే అవకాశం ఉందని తెలుస్తోంది. గంజాయి స్మగ్లర్ల ఆగడాలకు మూడు రాష్ట్రాల పోలీసులు ఎలా చెక్‌ పెడతారో వేచి చూడాల్సిందే.

Spread the love