ఇండ్లు సాధించేదాక పోరాడండి…

– అండగా ఉంటాం
– జర్నలిస్టుల ఇండ్లస్థలాల కోసం టీడబ్ల్యూజేఎఫ్‌ ఆధ్వర్యం జరిగిన మహాధర్నాలో తమ్మినేని వీరభద్రం
– మ్యానిఫెస్టోలో పెడతాం : షర్మిల

– కాంగ్రెస్‌, టీజేఎస్‌, సీపీఐ, బీయస్పీ మద్దతు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
”మీ తరపున సీఎంతో మాట్లాడుతం… కొట్లాడుతం…ఇండ్ల స్థలాల సమస్య సాధించే వరకు వదిలిపెట్టం. సమస్య పరిష్కారానికి రాజకీయ పార్టీలు, బాహ్యశక్తుల మద్ధతు కొంత వరకు సమస్యను సాధించడంలో తోడ్పడుతుంది. అది మాత్రమే సరిపోదు. జర్నలిస్టులు ఐక్య పోరాటంతోనే సమస్యను సాధించగలరు. రాబోయే కాలంలో ఈ పోరాటాన్ని కొనసాగించాలి. సీపీఐ(ఎం) మీ పక్షాన నిలబడుతుంది. ఇది ఎన్నికల సంవత్సరం. ఊరించడానికి కొంత మందికైనా ఇచ్చే అవకాశముంది….. ” అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ ఫెడరేషన్‌(టీడబ్ల్యూజేఎఫ్‌) ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లోని ధర్నాచౌక్‌ వద్ద మహాధర్నా నిర్వహించారు. సీనియర్‌ ఉపాధ్యక్షులు పిల్లి రాంచందర్‌ అధ్యక్షతన జరిగిన మహాధర్నాను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్య సమన్వయం చేశారు. ఈ ధర్నాకు కాంగ్రెస్‌, సీపీఐ(ఎం), సీపీఐ, వైఎస్సాఆర్టీపీ, టీజేఎస్‌, బీయస్పీ పార్టీలు సంపూర్ణ మద్ధతు తెలిపాయి. ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ సీపీఐ (ఎం) రాష్ట్ర కమిటీ తరపున జర్నలిస్టుల ఇండ్ల స్థలాల డిమాండ్‌కు సంపూర్ణ మద్ధతు ఇస్తున్నట్టు ప్రకటించారు. ప్రపంచ చరిత్రలో అనేక రాజ్యాలు, రాజులు మారారనీ, ప్రతి సందర్భంలో పాలనను విమర్శించడంలో సరిదిద్దడంలో సమా జంలో జర్నలిస్టులు కీలకపాత్ర పోషించారని గుర్తుచేశారు. ఆయుధాలతో హింసావాదం వస్తే, రక్తపాతం లేకుండానే భావవిప్లవాన్ని సాధించింది జర్నలిస్టులేనని అభిప్రాయ పడ్డారు. ప్రభుత్వాలనే మార్చగలిగిన శక్తి కలిగిన జర్నలి స్టులు, అవే ప్రభుత్వాలను ఇండ్ల స్థలాల కోసం అడిగే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవం, సత్యం, ప్రజల్లో ఉన్న అసంతృప్తిని వ్యక్తీకరించేదే జర్నలిజం అని అన్నారు. ఆ రకమైన విలువలను జర్నలిస్టులు పాటించాలని వ్యాఖ్యానించారు. సమాజం, ప్రభుత్వం సక్రమంగా నడవడానికి ప్రయత్ని స్తున్న జర్నలిస్టులకు కూడా కుటుంబాలు ఉంటాయన్న సంగతిని ప్రభుత్వం గుర్తించాలని తమ్మినేని డిమాండ్‌ చేశారు. ఇది వరకే జర్నలిస్టులకు త హామీ ఇచ్చిందనీ, ఊరించిందనీ, నమ్మించిందని, సుప్రీంకోర్టులో కేసు ఇండ్ల స్థలాలిచ్చేందుకు అడ్డంకిగా ఉందనీ, తాము ఏదో చేద్దామనుకుంటే సుప్రీంకోర్టు దుర్మార్గంగా అడ్డుపడిందన్నట్టు నమ్మబలికారని విమర్శిం చారు. కేసు పరిష్కారమైన ప్రభుత్వం స్పందించకపోవడంతో ఇచ్చే సంకల్పం లేదని అర్థమైందని తమ్మినేని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత సీఎం కేసీఆర్‌తో తాము కలిసిన సమయంలో 20 డిమాండ్లను చేశామనీ, అందులో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల డిమాండ్‌ ఉందని తెలిపారు. దానికి సీఎం కేసీఆర్‌ సానుకూలంగా స్పందించారని చెప్పారు. మరో సందర్భంలో ఖమ్మం బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ సభలో సీఎం కేసీఆర్‌కు మౌఖికంగా ఈ విషయాన్ని గుర్తు చేస్తే అదే సానుకూలతను మాటల్లో కనబరిచినా అమలు చేయలేదని విమర్శించారు.
గతంలో ఇచ్చాం…మళ్లీ అధికారంలో వచ్చాక ఇస్తాం…చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి
గతంలో అధికారంలో ఉండగా కాంగ్రెస్‌ పార్టీ జర్నలిస్టులకు ఇండ్ల కోసం స్థలం కేటాయించిందని టీపీసీసీ ఉపాధ్యక్షులు, మీడియా ఇన్‌ఛార్జీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి గుర్తుచేశారు. మళ్లీ అధికారంలోకి వచ్చాక జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలిస్తామనీ, ఈ అంశాన్ని మ్యానిఫెస్టోలో పొందుపరుస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రజలకు, ప్రభుత్వానికి అనుసంధానంగా ఉండే జర్నలిజాన్ని సీఎం కేసీఆర్‌ బతుకనియ్యడం లేదని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై జర్నలిస్టుల పోరాటం కొనసాగించాలనీ, కాంగ్రెస్‌ పార్టీ పోరాటానికి అండగా ఉంటుందని తెలిపారు.
మ్యానిఫెస్టోలో పెడతాం…షర్మిల
జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల డిమాండ్‌ను వైఎస్సాఆర్టీపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెడతామని ఆ పార్టీ అధ్యక్షురాలు షర్మిల హామీ ఇచ్చారు. సాధించుకున్న బంగారు తెలంగాణలో తమ కనీస అవసరాలు తీర్చమని జర్నలిస్టులు ధర్నా చేస్తున్నారంటే, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎంత దౌర్భాగ్యమైందో అర్థమవుతుందని విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి జవహర్‌ లాల్‌ నెహ్రూ హౌజింగ్‌ సొసైటీ పేరుతో 70 ఎకరాలను కేటాయించిన విషయాన్ని గుర్తుచేశారు. జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యుల కోసం వైఎస్సాఆర్‌ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. ఆ తర్వాత అధికారంలో కొనసాగిన కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులతో పాటు సీఎం కేసీఆర్‌ జర్నలిస్టులను పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.జర్న లిస్టులు చేసే ప్రతి పోరాటంలో వైఎస్సాఆర్టీపీ భాగస్వామి అవుతుందని తెలిపారు.
సంఘటిత పోరాటంతోనే సాధ్యం…కోదండరాం
సంఘటిత పోరాటంతోనే జర్నలిస్టులు ఇండ్ల స్థలాలను సాధించుకోగలుగుతారని టీజేఎస్‌ అధ్యక్షులు ప్రొఫెసర్‌ కోదండరాం తెలిపారు. రాష్ట్రంలో భూములు ఉన్నప్పటికీ, జర్నలిస్టులకు మాత్రం ఇవ్వడం లేదని తెలిపారు. తెలంగాణ ఉద్యమం నిలబడిందే జర్నలిస్టుల వల్ల అని గుర్తుచేశారు. గతంలో మాదిరిగా సామాన్యులు భూములను కొనే పరిస్థితి లేదనీ, వాటి రేట్లు పెరిగేలా ప్రాజెక్టుల పేరుతో ప్రచాకం చేశారన్నారు. ఇక ప్రభుత్వం ఇవ్వాల్సిందేనని డిమాండ్‌ చేశారు. అనంతరం సీపీఐ రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యులు బాలమల్లేశ్‌, బీయస్సీ హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షులు రుద్రవరం సునీల్‌, జర్నలిస్టు అధ్యయన వేదిక అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వేణుగోపాల్‌ రెడ్డి, సాధిక్‌, జేసీహెచ్‌ సీఎల్‌ కార్యదర్శి ఎం.ఎస్‌.హాష్మీ తదితరులు మాట్లాడారు.
తీర్మానం
‘అర్హులైన జర్నలిస్టులందరికి ఇండ్ల స్థలాలివ్వాలని’ టీడబ్ల్యూజేఎప్‌ రాష్ట్ర ప్రదానకార్యదర్శి బి. బసవపున్నయ్య ప్రవేశపెట్టిన ఏకవ్యాక్య తీర్మానాన్ని మహాధర్నాలో పాల్గొన్న వందలాది మంది జర్నలిస్టులు చప్పట్ల ద్వారా ఏకగ్రీవంగా ఆమోదించారు. ఇండ్లస్థలాను ప్రభుత్వం మంజూరు చేసేవరకు ఆందోళన కొనసాగిస్తామని బసవపున్నయ్య ప్రకటిం చారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్‌ ఆఫీస్‌ బేరర్లు పి.ఆనందం, గుడిగ రఘు, బి.రాజశేఖర్‌, గండ్ర నవీన్‌, సలీమా, ఇ చంద్రశేఖర్‌, కె.వివేక్‌, బి.విజయకుమార్‌, ఆర్‌.వెంకటేశ్వర్లు, టి.కృష్ణ, పి.భిక్షపతి, నిరంజన్‌, విజయానంద్‌, టి శ్రీనివాస్‌, దామోదర్‌, రామక్రిష్ణ, హెచ్‌యూజే అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.అరుణ్‌ కుమార్‌, బి.జగదీశ్వర్‌, నాయకులు రత్నాకర్‌, రేణయ్య, మాధవరెడ్డి, సర్వేశ్వర్‌రావు, అశోక్‌ జిల్లాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
భారీగా జర్నలిస్టుల హాజరు
ఇండ్ల స్థలాలు కేటాయించాలంటూ ఫెడరేషన్‌ నిర్వహించిన థర్నాకు జర్నలిస్టులు వందలాదిగా హాజరయ్యారు. హైదరాబాద్‌తోపాటు అన్ని జిల్లాల నుంచి వచ్చారు. ఇండ్ల స్థలాలు ఇవ్వాలంటూ నినాదాలు ఇచ్చారు. దీంతో ధర్నా చౌక్‌ ప్రాంతం మార్మోమోగింది. ప్లకార్డులు, జెండాలు, ప్లెక్సీలు ప్రదర్శించారు. జర్నలిస్టుల ధర్నా నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.
అర్హులైన జర్నలిస్టులందరికి ఇండ్ల స్థలాలు…ఆర్‌యస్పీ
అధికారంలోకి వచ్చాక అర్హులైన జర్నలిస్టులందరికి ఇండ్ల స్థలాలిస్తామని బీయస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌ కుమార్‌ హామీ ఇచ్చారు. టీడబ్ల్యూజేఎఫ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాకు ఆయన సంఘీ భావం ప్రకటించారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. 2014 ఎన్నికల మ్యానిఫెస్టోలో రూ.10 కోట్లతో జర్నలిస్టు సంక్షేమ నిధి, జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చి బీఆర్‌ఎస్‌ పార్టీ మరిచి పోయిందని విమర్శించారు. భూపాలపల్లి, ఇతర కొన్ని జిల్లాల్లో జర్నలిస్టుల కోసం కేటాయించిన ఇండ్ల స్థలాలను అధికార పార్టీకి చెందిన నాయకులు కబ్జా చేసేందుకు చేసిన యత్నాలను జర్నలిస్టులు తిప్పికొట్టారని తెలిపారు. హైదరాబాద్‌లో జర్నలిస్ట్‌ భవన్‌ నిర్మిస్తామనీ, అందరికి జర్నలిస్ట్‌ అక్రిడియేషన్‌ కార్డులు, హెల్త్‌ కార్డులు అందజేస్తామని చెప్పి ఇంత వరకు ఎంత మందికి ఇచ్చారో లెక్క జెప్పాలని డిమాండ్‌ చేశారు.

Spread the love