అడ‌వి నుండి మా ఇంటికి

From the forest to our home2021లో నుపుర్‌ పోహార్కర్‌ ప్రారంభించిన పిరుల్‌ హస్తకళలు ఉత్తరాఖాండ్‌లోని మహిళల జీవితాలను మార్చివేశాయి. వారికి జీవనోపాధిని కల్పిస్తున్నాయి. పైన్‌ సూదుల నుండి కళాఖండాలను తయారుచేసి తమ సమయాన్ని సద్వినియోగం  చేసుకోవడంతో పాటు మంచి ఆదాయాన్ని పొందుతూ సగర్వంగా జీవిస్తున్నారు. ఇంతకీ ఆ పిరుల్‌ హస్తకళల కథేంటో మనమూ తెలుసుకుందాం…
ఉత్తరాఖండ్‌లోని ఖేతిఖాన్‌ గ్రామంలోని కొన్ని ప్రాంతాల్లోని ప్రజల జీవితం నెమ్మదిగా కదులుతుంది. అలాంటిది మంజు కోసం ప్రతి రోజూ కొన్ని పనులు ఎదురు చూస్తుంటాయి. తన ఇంటి పనిని పూర్తి చేసిన తర్వాత రోటీ బాక్స్‌లు, ట్రేలు, పెన్‌ స్టాండ్‌లు మొదలైనవాటిని తయారు చేయడానికి కూర్చుంటుంది. వాటన్నింటినీ ఆమె వారానికి రెండు మూడు సార్లు అడవికి వెళ్ళి సేకరించే పైన్‌ సూదుల ద్వారా తయారు చేస్తుంది. వీటినే PIRUL హస్తకళలు అంటారు. వీటి ద్వారా ఆమె నెలకు సుమారు రూ.7,000 సంపాదిస్తుంది.
పైన్‌ సూదులతో…
‘ఈ ఉత్పత్తుల ద్వారా నేను దాదాపు రూ. 15,000 సంపాదించిన రోజులు ఉన్నాయి. ఈ ఆదాయం నా పిల్లల చదువుకు తోడ్పడుతుంది. అలాగే ఇంటి అద్దె సమయానికి కట్టగలుగుతున్నాను’అని ఆమె చెబుతుంది. 2021లో నుపుర్‌ పోహార్కర్‌ స్థాపించిన పిరుల్‌ హ్యాండీక్రాఫ్ట్స్‌లో పనిచేస్తున్న 100 మంది మహిళల్లో మంజు కూడా ఉన్నారు. ఇది పైన్‌ సూదుల నుండి కళాఖండాలను తయారు చేస్తుంది. ఉత్తరాఖండ్‌ స్థానిక మాండలికంలో ‘పిరుల్‌’ అంటే ఉత్పత్తులను తయారు చేయడానికి పైన్‌ సూదులను ఉపయోగించడం. ఇప్పటి వరకు ఈ స్టార్టప్‌ సుమారు 8,000 ఉత్పత్తులను విక్రయించింది. ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లలో పైన్‌ చెట్లు సమృద్ధిగా ఉన్నాయి. ఈ చెట్ల నుండి రెసిన్‌ అధికంగా ఉండే అత్యంత మండే సూదులు అటవి నేలపై పడిపోతాయి. తర్వాత ఇవి నెమ్మదిగా కుళ్ళిపోయి నీటి ఉపరితల ప్రవాహాన్ని పెంచడానికి, భూగర్భజల పట్టికను తగ్గించడానికి సమకరిస్తాయి. ‘పిరుల్‌ హ్యాండీక్రాఫ్ట్స్‌లో మేము పైన్‌ వ్యర్థాలను వివిధ ఉత్పత్తుల్లోకి మార్చడమే కాకుండా జీవనోపాధి అవకాశాలను అందించడం ద్వారా మహిళలకు సాధికారత కల్పించడానికి ప్రయత్నిస్తాము’ అని నుపుర్‌ చెప్పారు.
సమస్యను పరిష్కరించడానికి
సమాజానికి సేవ చేస్తున్న తండ్రిని చూస్తూ పెరిగిన నుపుర్‌ వెటర్నరీ డిగ్రీని పూర్తి చేసిన తర్వాత సోషల్‌ డెవలప్‌మెంట్‌ సెక్టార్‌లో చేరాలనే ఆమె ‘అంతర్గత పిలుపు’ని అనుసరించింది. ఎస్‌బీఐ ఫౌండేషన్‌ వారి వైఎస్‌ఎఫ్‌ ఫెలోషిప్‌ ప్రోగ్రామ్‌ గురించి తెలుసుకుని అందులో చేరింది. త్వరలో ఉత్తరాఖండ్‌లోని ఖేతిఖాన్‌లో స్థిరమైన జీవనోపాధి, అభివృద్ధి కోసం బీఏఐఎఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌తో కలిసి పనిచేయడం ప్రారంభించింది. ప్రతిచోటా పైన్‌ అడవులతో కంటికి కనిపించేంత వరకు పైన్‌ సూదుల కారణంగా అడవిలో మంటలు వ్యాపించాయి. అది పశువుల గడ్డిని కాల్చివేసేది. పైన్‌ వ్యర్థాల వల్ల సంభవించే అడవి మంటల సమస్యను పరిష్కరించడానికి ఏం చేయాలనే ఆలోచన ఆమెకు వచ్చింది. ఇంతలో వ్యవసాయం, పశువుల పెంపకం, ఇంటి పనుల బాధ్యత పూర్తిగా మహిళల భుజాలపై పడటం గమనించింది. పురుషులేమో మెరుగైన ఆదాయ అవకాశాల కోసం వలస వస్తున్నారు. అయితే పంటల విధానంలో మార్పు, అస్థిర వర్షపాతం, అడవి పందుల బెడద వల్ల మహిళలకు వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయం అంతంత మాత్రంగానే ఉంది.
మహిళలను ఒప్పించేందుకు
ఉత్తరాఖండ్‌లో తన ఫెలోఫిష్‌ సమయంలో ఓ ఏడాది పాటు పైన్‌ సూదులతో ఉత్పత్తులను తయారు చేయడానికి మహిళలను ఒప్పించేందుకు ప్రయత్నించింది. మొదట చాలా మంది ఆమెను పట్టించుకోలేదు. ‘చాలా మంది పైన్‌ సూదులను తీయడానికి సిగ్గుపడ్డారు. ఎందుకంటే వారు దానిని వ్యర్థంగా భావించారు’ ఆమె గుర్తుచేసుకుంది. ఒక దృఢ నిశ్చయంతో నుపుర్‌ గ్రామాన్ని సందర్శించింది. ఆమె స్వయంగా తయారు చేసిన ఉత్పత్తులను ప్రదర్శిస్తూ మహిళలతో వ్యక్తిగత సంబంధాలను ఏర్పరచుకోవడానికి ప్రయత్నించింది. చివరికి యువతులు ఈ ఆలోచనపై ఆసక్తి కనబరిచారు. రెండు నెలల్లో PIRUL హస్తకళలు ఆర్డర్‌లను పొందడం ప్రారంభించాయి. 2021లో నలుగురు మహిళలతో ప్రారంభమైన ఈ స్టార్టప్‌లో నుపుర్‌ చెల్లెలు శర్వరి కూడా చేరారు. అదే ఏడాది పైన్‌ సూదులతో రాఖీలను తయారు చేయడం ప్రారంభించారు. ఇది ప్రజాదరణ పొందింది. ఇది ఫార్మా కంపెనీ Virbac యానిమల్‌ హెల్త్‌ నుండి 5,000 టీ కోస్టర్‌ సెట్‌ల కోసం కార్పొరేట్‌ ఆర్డర్‌ను కూడా అందుకుంది.
పరిమిత రవాణా వల్ల
PIRUL హస్తకళలు నేపాల్‌ సరిహద్దు, అల్మోరా జిల్లా సమీపంలోని ఖేతిఖాన్‌, ఇతర మారుమూల గ్రామాలకు చెందిన మహిళలతో కలిసి పనిచేస్తాయి. ఇది మహిళలకు దారాలు వంటి ఉపకరణాలను పంపిణీ చేస్తుంది. మహిళలు అడవి నుండి పైన్‌ సూదులను సేకరిస్తారు. ‘పరిమిత రవాణా వల్ల ఉపకరణాలను అందించడానికి, తుది ఉత్పత్తులను సేకరించడానికి ఈ మారుమూల గ్రామాలకు ప్రయాణించడం ఒక ముఖ్యమైన సవాలు. దీని వల్ల సమయం, డబ్బు కాస్త ఎక్కువ ఖర్చు అవుతుంది’ఆమె జతచేస్తుంది.
మరెన్నో గ్రామాలలో…
ఖేతీఖాన్‌ గ్రామానికి చెందిన కిరణ్‌ గత రెండేండ్లుగా ఆ సంస్థలో పనిచేస్తుంది. ఇంతకుముందు గృహిణిగా ఉన్న ఆమె ఇప్పుడు నెలకు రూ.7,000 నుంచి రూ.8000 వరకు సంపాదిస్తోంది. ‘నేను నా ఇంటి పనులు చేసుకుని ఈ పనిలో కూర్చుంటాను. మంచి ఆదాయాన్ని సంపాదిస్తూ నా సమయం వృధా కాకుండా చూసుకుంటున్నాను. అడవి నుండి మా ఇంటికి ఆదాయాన్ని తెచ్చుకుం టున్నాను’ ఆమె చెప్పింది. ‘మేము మా మార్కెటింగ్‌ ప్రయత్నాలను మెరుగుపరచడానికి, మా సంస్థను పెంచడానికి సహయోగ్‌ గ్రాంట్‌ను ఉపయోగి స్తాము. ఉత్తరాఖండ్‌లోని కొండల్లోని మరెన్నో గ్రామాలలో మా వ్యాపార నమూనాను ప్రతిబింబిం చడం, జీవనోపాధి అవకాశాలతో స్థానికులకు సాధికారత కల్పించడం ద్వారా ఇది మరింత ప్రభావం చూపుతుంది’ అని నుపుర్‌ చెప్పింది.
అవకాశాలను ప్రోత్సహించడం
PIRUL  హస్తకళలు అనేక ఇతర ఉత్పత్తులతోపాటు ప్లాంటర్‌లు, చెవిపోగులు, సర్వింగ్‌ ట్రేలు, స్టోర్‌ బాక్స్‌లను అందిస్తోంది. దీని గృహాలంకరణ ఉత్పత్తులు రూ.1,000 నుండి రూ.3,000 మధ్య, జీవనశైలి ఉత్పత్తులు రూ.1,500 నుండి రూ.1,800 మధ్య ఉంటాయి. అయితే ఫ్యాషన్‌ వస్తువులు రూ.250 నుండి ప్రారంభమవుతాయి. స్టార్టప్‌ ఇప్పటి వరకు 20,000 కిలోల పైన్‌ వ్యర్థాలను అప్‌సైకిల్‌ చేసింది. ఇది ప్రధానంగా ఇన్‌స్టాగ్రామ్‌, ఎగ్జిబిషన్‌ల ద్వారా ఢిల్లీ, హైదరాబాద్‌, బెంగళూరు, ముంబైతో పాటు మరికొన్ని ప్రధాన నగరాల్లో 12 ఆఫ్‌లైన్‌ స్టోర్‌లలో ఉత్పత్తులను విక్రయిస్తుంది. స్థానిక ప్రభుత్వ సంస్థలు, కార్పొరేట్ల నుండి బల్క్‌ ఆర్డర్‌లను కూడా పొందుతుంది.

సమాజం కోసం పని చేయాలని
నాగ్‌పూర్‌కు చెందిన నుపుర్‌ పోహార్కర్‌కు సమాజం కోసం పని చేయాలనే కోరిక బలంగా ఉండేది. తండ్రి డాక్టర్‌ అజరు వెటర్నరీ డాక్టర్‌. నక్సల్స్‌ కార్యకలాపాలతో కొట్టుమిట్టాడుతున్న మహారాష్ట్రలోని ఓ మారుమూల గ్రామానికి తన తండ్రి బదిలీ అయినప్పుడు అక్కడి పరిస్థితులు ఆమెను కలచివేశాయి. కరెంటు, తాగునీటికి అక్కడి ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడేవారని ఆమె గుర్తుచేసుకుంది. గ్రామస్తులను చైతన్యవంతం చేసి, వారికి పశువుల పెంపకంలో శిక్షణ ఇప్పించి, వారికి ప్రభుత్వ రాయితీలు ఇప్పించే బాధ్యతను అజరు తీసుకున్నారు. ప్రస్తుతం అతను నాగ్‌పూర్‌లో జంతు సంరక్షణ కోసం ఓ సంస్థ నడుపుతున్నాడు.

Spread the love