జీవో 21ని గెజిట్‌ చేయాలి

– దశలవారీ ఆందోళనలు : తెలంగాణ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ సెక్యూరిటీ గార్డ్స్‌ యూనియన్‌ రాష్ట్ర కమిటీ పిలుపు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సెక్యూరిటీ సర్వీసెస్‌ జీవో నెంబర్‌ 21ని గెజిట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ దశలవారిగా ఆందోళనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలంగాణ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ సెక్యూరిటీ గార్డ్స్‌ యూనియన్‌ రాష్ట్ర కమిటీ తెలిపింది. ఈ ఆందోళనలకు సెక్యూరిటీ గార్డులు పెద్ద సంఖ్యలో కదిలిరావాలని పిలుపునిచ్చింది. కార్మిక శాఖ సెక్యూరిటీ సర్వీసెస్‌కు సంబంధించిన జీవో నెంబర్‌ 21 విడుదల చేసి రెండేండ్లు అవుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు గెజిట్‌ ప్రకటన చేయకుండా తాత్సరం చేస్తున్నదని రాష్ట్ర కమిటీ అభిప్రాయపడింది. సోమవారం సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల సాంబయ్య అధ్యక్షతన రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. యూనియన్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షులు వంగూరు రాములు మాట్లాడుతూ యాజమాన్యాల ఒత్తిళ్లకు తలొగ్గే ప్రభుత్వం గెజిట్‌ చేయడం లేదని అన్నారు. దీనివల్ల రాష్ట్రంలో వేలాది మంది సెక్యూరిగార్డులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. పై డిమాండ్‌ సాధన కోసం దశలవారి ఆందోళనల్లో భాగంగా జూన్‌ 1 నుండి 5వ తేదీ వరకు సంతకాల సేకరణ, మార్కెట్‌ కమిటీల కార్యదర్శులు, చైర్మెన్లకు వినతి పత్రాలు, జూన్‌ 10వ తేదీ జిల్లా అధికారులకు, జూన్‌ 12న జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే జూన్‌ 4వ వారంలో ఛలో హైదరాబాద్‌ ఆందోళనా కార్యక్రమాన్ని నిర్వహించాలని పేర్కొన్నారు. దేశంలో మహిళలు, శ్రామిక మహిళల హక్కులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఘాతం కలిగిస్తున్నాయని విమర్శించారు.
రాష్ట్ర కమిటీ సమావేశం అనంతరం సెక్యూరిటీ గార్డుల సమస్యలతో కూడిన వినతిపత్రాలను మంత్రులు కేటీఆర్‌, టీ హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, చామకూర మల్లారెడ్డి, ఎస్‌ నిరంజన్‌రెడ్డికి డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలోని వారి పేషీల్లో అందజేశారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాటల సోమన్న, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సారిక రాము, కోశాధికారి టి.జనార్ధన్‌, రాష్ట్ర నాయకులు గొంగిడి లక్ష్మణ్‌, ఎస్‌. కుమారస్వామి, వై.రామాంజయ్య, ఎస్‌.రమేష్‌, ఎం.యాకయ్య, ఎం.భాస్కర్‌, షేక్‌ సోయాబుద్దీన్‌, ఎమ్‌డీ యాకూబ్‌అలీ, బి. వెంకటేష్‌, ఎస్‌.యాకయ్య, పి.వెంకన్న, వెంకటేశ్వర్లు, బి.రమేష్‌, పి. శ్రీనివాస్‌, ఉపెందర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love