మాట్లాడాలని వుంది

గాయం తాలూకు జ్ఞాపకాలు బలమైనవి, కొన్ని దూది పింజల్లా ఎగిరిపోతూ వుంటాయి, మరీ కొన్ని బలంగా నాటుకు పోతాయి, ఎంతలా అంటే గాయాన్ని కూడా ప్రేమించెంతలా…

నాలో ఉన్న నిన్ను దూరం అయ్యావు అని చెప్పాలంటే మనసుకు బాధగా ఉంది.. ప్రతీ ఉషస్సు నీ జ్ఞాపకాలతో మొదలవుతుంది, ఆ వెనకే కన్నీటి బొట్టు, నేల రాలదు, కానీ నన్ను తడుపుతోంది, కన్నీటి చారికలతో నా నవ్వు కప్పబడుతోంది !! ఏంటో, మనసుకి ఎంత సర్దిచెప్పుకున్నా మాట వినదే!! నీ ధ్యాసతో మొదలయ్యే నా ప్రయాణం, మెట్రో అనౌన్స్మెంట్‌ వచ్చేంత వరకు దృష్టి మరలదు, దారిలో కనిపించే ప్రతి దృశ్యంలో నీ నవ్వును చూసుకుంటున్న !! ఎదురుగా ఉండే మనుషుల్లో నీ రూపాన్ని వెతుక్కుంటున్న !! నువైతె బావుండని ఎన్ని సార్లు అనుకున్నానో !! నువు కావనే నిజాన్ని అబద్దం అయితే ఎంత బావుండు అనుకున్నానో !! పక్కన్నే ఉన్నట్టు, మాటల ఊట ఉబికివచ్చినట్టు, నవ్వుల సడులు సంగీతం అయినట్టు అనిపిస్తుంది, అప్పుడే నే ఉనికిలో ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఒక్క క్షణంలో అంతా అబద్దం అనే మాట నా హృదయాన్ని తూట్లుగా పొడుస్తుంటుంది, జారే చుక్క నా చెంపను తడిపినపుడే మళ్ళీ సృహలోకి వస్తాను..
రోజు ఒక్కడ్నే ప్రయాణం చేస్తాను భౌతికంగా, నే వెళ్ళే ప్రతీ చోటున ప్రతి క్షణాన నువు ఉన్నావు, నాతో కలిసి ప్రయాణం చేస్తావు.. 222A లో మన ప్రయాణం గుర్తొచ్చినప్పుడల్లా నాకు ఆ ప్రయాణమే చివరది అయితే బావుండు అనిపిస్తూ వుంటుంది, నువు లేని ఇప్పటి నా ప్రయాణం జీవం లేని మనిషిలా మారుస్తోంది, చుక్కలు పొడవని ఆకాశమల్లే తోస్తోంది !! నా భుజం మీద తలవాల్చి, రెండు చేతులు ఒక్కటయ్యిన వేళ జీవితాంతం అలానే సాగుతాం అనుకున్న !! మన మధ్యన చేరని గాలి, వేల లేఖలు నా మోముపై రాసిన నీ కురులు, వేగంలో మార్పు చెందిన హృదయపు సవ్వడులు ఇప్పటికీ అంతే సహజంగా తడిగా నా గుండెను తడుపుతున్నాయి..
మెట్రో దిగి ఆఫీస్‌కి వెళ్ళే దారి పొడవునా నాతో నడుస్తావు. ఆ మెట్రో స్టేషన్‌ చుట్టూ మనం అల్లుకున్న జ్ఞాపకాలు ఎన్నో !! నీకు గుర్తుందా చెరో కప్‌ కాఫీ తాగుతుంటే ఆ మెట్రో స్టేషన్‌ మనల్ని తొంగి తొంగి చూసింది !! మనల్ని చూసే ప్రేమించడం నేర్చుకుంది, మార్చుకున్న కాఫీనీ చూసే ప్రియురాలి పెదవుల తడి రుచిని ఆస్వాదించింది, ఇవ్వాళా ఆ మెట్రో స్టేషన్‌ నాకంటే విషాదంగా కనిపిస్తుంది !! ఏమైందని అడిగే లోపే నా కన్నీటిని తుడిచివేస్తుంది !! నాతో పాటు అది కూడా నీ ప్రేమకై వేచిచూస్తోంది !! ఏదైనా హౌర్డింగ్‌ లో నీ పేరు కనపడితే తనివితీరా చూస్తాను, నడిచే పాదాన్ని ఆపినట్టు, కాలాన్ని కూడా కొన్ని క్షణాలు హోల్డ్‌ చేస్తాను.. డెస్క్‌లో కూర్చున్న నాకు నీ పేరును టైప్‌ చేస్తే గాని డిస్‌ప్లే వెలగదు. ఆ తర్వాతే నా పని మొదలవుతుంది.. ఏంటో రోజంతా నువు గుర్తుకు రాకుండా ముగియదు అనే మాట అబద్దంగా చెప్పలేను..
నా ప్రేమను ఎన్ని కవితల్లో రాసుకున్నానో !! నా బాధను ఎంతగా అదుముకున్నానో !! ఒక్కసారి నీ పలకరింపకై ఎంతగా వేచియున్నానో !!..
”వేకువ జామునే నిశీధి కమ్ముకొస్తుంటుంది
జ్ఞాపకాల కొలిమిలో ఎర్రగా కములుతుంటే
ప్రేమకి రూపంగా భావిస్తున్న, దూరాన్ని ప్రేమిస్తున్న
నీ పెదవులు పంచిన తడితో జీవం పోసుకుంటున్న”
నాపై నీ ప్రేమ అనంతమైనది !! మరీ ఎలా అన్నావో మరిచి పో అని, అది గుర్తొచ్చినప్పుడల్లా గుండెల్లో బరాలు పెట్టీ పేల్చినట్టు అనిపిస్తుంటుంది.. రిక్టర్‌ స్కేల్‌ లాంటి ఓ పరికరాన్ని కనిపెడితే బావుండు, మరిచి పో అన్న మాటకి నా గుండె ఎన్ని బీటలు బారిందో !!..
చేతిలో చేయి వేసి జీవితాంతం ఇలానే ఉంటా అన్నావ్‌ కదా !! మరిచిపోయావా !?! ఒక్కసారైనా గుర్తుకురాన !!? ఇది రాస్తుంటేనే దుఃఖం ఆగట్లేదు !! ఎందుకు నాకు ఇన్ని ”బ్లాక్‌” డేస్‌ ఇస్తున్నావు.. నీకు గుర్తుందా నేనిచ్చిన గులాబీని తలలో పెట్టుకుంటు ఒక్క నవ్వు విసిరావు, ఆ నవ్వు ఇంకా అలానే నాతో ఉంది. నిను చేరని గులాబి పూవుల రెక్కలు రాలినట్టు ఆ నవ్వును రాల్చకు, నీ మాటలు కావాలి, నీ నవ్వు కావాలి, నీ ప్రేమ కావాలి, నీతో మళ్ళీ ప్రయాణం చేయాలి, జాతరలో నాకోసం తెచ్చిన కీ చైన్‌ తీసుకోవాలి, నీ నుదటన ఒక ముద్దు పెట్టాలి, నీతో జీవితం కావాలి.. చాలా మిస్‌ అవుతున్నాను. దూరం ఎప్పటికీ దూరం కాదు అన్నావ్‌ గా, ఇప్పుడు నిజంగా దూరాన్ని పెంచుతున్నావు. మనం నడచిన దారిని ముగిసింది. మూసివేస్తున్న అనే బోర్డ్‌ తగిలించకు, చిక్కి తల్లి ఐ లవ్‌ యూ మా, మిస్సింగ్‌ యూ ఏ లాట్‌.. మాట్లాడాలని వుంది..
– మహేష్‌ వేల్పుల
9951879504

Spread the love