బీటీపీఎస్‌లో కాంట్రాక్ట్‌ కార్మికుల నిరవధిక సమ్మె

– సంఘీభావం తెలిపిన రాజకీయ పార్టీలు
నవతెలంగాణ-మణుగూరు
భద్రాద్రి పవర్‌ ప్లాంట్‌ కాంట్రాక్ట్‌ కార్మికులు తమ న్యాయమైన సమస్యల పరిష్కరించాలని సోమవారం నిరవధిక సమ్మెకు నిర్వహించారు. కాంట్రాక్ట్‌ కార్మికులు నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షలకు సీపీఐ(ఎం), సీపీఐ, బీజేపీ, వివిధ ప్రజాసంఘాల నాయకులు, స్వచ్ఛంద సేవా సంస్థలు మద్దతు తెలిపాయి. సీపీఐ(ఎం), సీఐటీయూ కాంట్రాక్ట్‌ కార్మికుల పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర నాయకులు నెల్లూరి నాగేశ్వరరావు ప్లాంట్‌ నిర్మాణంలో భాగస్వాములైన కార్మికుల పట్ల యాజమాన్యం నిర్లక్ష్యం వహించడం సరికాదన్నారు. భూములను పోగొట్టుకొని బీటీపీఎస్‌ నిర్మాణానికి సహకరించిన వారిపట్ల యాజమాన్యం చిన్నచూపు చూడడం ఏమిటని ప్రశ్నించారు. పని భద్రత (కొనసాగించుట) కల్పించాలి డిమాండ్‌ చేశారు. 12 గంటల పని విధానాన్ని రద్దు చేయాలని, 8 గంటల పని విధానం అమలు చేయాలన్నారు. పీఎఫ్‌, ఈఎస్‌ఐ అమలయ్యే విధముగా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర జీవో ప్రకారం వేతనాలు చెల్లించాలని, పే స్లిప్స్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. జాయినింగ్‌ ఆఫర్‌ లేటర్స్‌ కూడా ఇవ్వాలన్నారు. ఈపీఎఫ్‌ బుక్స్‌ ఇప్పించాలని, జెన్కోని డిమాండ్‌ చేశారు. ప్రతి నెల 5వ తారీఖు లోపు బ్యాంకు నందు జీతాలు జమ చేయాలన్నారు. ప్రతి సంవత్సరము యూనిఫామ్‌, షూస్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. జెన్కో కాంటాక్ట్‌ కార్మికులుగా గుర్తించాలన్నారు. సమస్యలు పరిష్కారానికి క్రియాశీలక ఉద్యమాలు నిర్వహిస్తామని కార్మికుల అండగా ఉండమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి వర్గ సభ్యులు సత్రపల్లి సాంబశివరావు, సిఐటియు మండల కన్వీనర్‌ ఉపతల నరసింహారావు, కార్మికులు పాల్గొన్నారు.

Spread the love