జూన్‌ 14 నుంచి 16 వరకు రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతులు

నవతెలంగాణ-అశ్వారావుపేట
అఖిల భారత కిసాన్‌ సభ అనుబంధ సంఘం తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో జిల్లా కమిటీ నేతృత్వంలో జూన్‌ 14 నుండి 16 వరకు మూడు రోజుల పాటు అశ్వారావుపేటలో వ్యవసాయ రంగంలోతుపాతులు-ప్రభుత్వ విధానాలు రైతులకు రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని, ఈ తరగతులు విజయవంతానికి ప్రతీ ఒక్కరు కృషి చేయాలని ఆ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య సంఘం శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం ఆయన స్థానిక ప్రజా సంఘాల కార్యాలయం సుందరయ్య భవన్‌లో సంఘం ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ దేశంలో వ్యవసాయరంగాన్ని దెబ్బతీసి కార్పొరేట్‌ సంస్థలకు అప్ప జెప్పే చర్యలకు పూనుకుంది అని ఎద్దేవా చేసారు. దీనికోసం వ్యవసాయ సంస్కరణల పేరుతో మూడు నల్ల చట్టాలను తీసుకొచ్చి ఈ చట్టాల వలన భారత రైతాంగం వ్యవసాయం నుండి వేరు చేయబడే పరిస్థితి వచ్చింది వాపోయారు. ఈ దివాలా కోరు విధానాలకు వ్యతిరేకంగా అఖిల భారత కిసాన్‌ సభ (ఏఐకేఎస్‌) నేతృత్వంలో 506 సంఘాల ఆధ్వర్యంలో ఢిల్లీ కేంద్రంగా 13 నెలల పాటు వీరోచితంగా పోరాటాన్ని కొనసాగించిందని, ఈ పోరాటంలో 730 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని విచారం వ్యక్తం చేసారు. బీజేపీ మంత్రులు, ఎంపీలు నోటికి వచ్చినట్టు మాట్లాడి పోరాటాన్ని నీరుగార్చే ప్రయత్నం చేశారని గుర్తు చేసారు. కానీ రైతాంగం ఐక్యంగా జరిపిన ఈ పోరాటానికి కేంద్ర ప్రభుత్వం దాని నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మెడలు వంచి భారత రైతాంగానికి క్షమాపణ కోరాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు. అదేవిధంగా రాష్ట్రంలో రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కేసీఆర్‌ ప్రభుత్వం కూడా రైతులకు ఇచ్చిన హమీలను అమలు చేయడంలో వైఫల్యం చెందిందని అన్నారు. రైతు రుణమాఫీ పేరుతో అనేక సంవత్సరాలుగా కాలయాపన చేస్తూ వస్తుంది అని, ప్రస్తుతం లక్ష రూపాయలు వరకు రుణాలు రద్దు అని ప్రకటించినప్పటికీ 50,000లోపు రుణాలు కూడా రద్దు కాలేదన్నారు. పోడు సాగుదారులకి పట్టా హక్కు ఇస్తామని చెప్పి గత ఎన్నికల ముందు వాగ్దానం చేసిన ప్రభుత్వం నేటికీ అమలు చేయడం లేదని, పైగా ఫారెస్ట్‌, పోలీస్‌ అధికారాన్ని ఉపయోగించి పోడు సాగుదారుల పై విపరీతమైన నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారు అని తెలిపారు. అకాల వర్షాలకి, ప్రకృతి వైపరీత్యాలకు నష్టపోయిన పంటలకు ఎకరానికి రూ.10వేలు ఇస్తామని ప్రకటించి రెండు నెలలు అవుతున్న నేటికీ నష్టపరిహారాన్ని అందించనటువంటి స్థితి ఉందన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రధానంగా ధాన్యం, పత్తి, పామాయిల్‌, జమాయిలు, మిర్చి వంటి పంటలు ఎక్కువ సంఖ్యలో పండిస్తున్నారు, జిల్లా భౌగోళిక పరిస్థితులను బట్టి రైతాంగాన్ని ఎప్పటికప్పుడు అవగాహన చేసి పంటల దిగుబడికి సహకరించాల్సిన ప్రభుత్వ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు.
ఈ శిక్షణా తరగతులకు ఏఐకేఎస్‌ జాతీయ కార్యదర్శి విజ్జు క్రిష్ణన్‌తో పాటు, సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు సాగర్‌, పోతినేని సుదర్శన్‌ రావు, రైతులు సమస్యలు సుదీర్ఘ పోరాటాలు నిర్వహిస్తున్న జూలకంటి రంగారెడ్డి, నంద్యాల నర్సింహా రెడ్డి, సారంపల్లి మల్లారెడ్డిలు హాజరు అవుతారని తెలిపారు. ఈ సమావేశంలో సంతపురి చెన్నారావు, తగరం జగన్నాధంలు పాల్గొన్నారు.

Spread the love