యూపీలో దారుణం

– దళిత బాలికపై సామూహిక లైంగికదాడి
–  పరారీలో నిందితులు
లక్నో : బీజేపీ పాలిత రాష్ట్రం యూపీలో బాలికలకు రక్షణ కరువవుతున్నది. యోగి పాలనలో వారిపై లైంగికదాడులు, లైంగిక వేధింపులు నిత్యకృత్యమవుతున్నాయి. మహిళలకు భద్రత కల్పించటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతుండటం కారణంగానే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని సామాజిక కార్యకర్తలు, మహిళా సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. తాజాగా యూపీలోని ఒక గ్రామంలో ఒక దళిత బాలికపై సామూహిక లైంగికదాడి జరిగింది. ఈనెల 2న చోటు చేసుకున్న ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇది రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు దారి తీస్తున్నది.
పోలీసులు, బాధితురాలి కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. 17 ఏండ్ల దళిత బాలికపై ఇద్దరు దుండగులు సామూహికంగా దారుణానికి ఒడిగట్టారు. ఈనెల 2న బరియా పోలీసు స్టేషన్‌ పరిధిలోని ఒక గ్రామంలో చోటు చేసుకున్నది. నిందితులు శాలిక్‌ సింగ్‌ (20), దీపక్‌ యాదవ్‌ (22)లను అదే గ్రామానికి చెందినవారిగా ఎస్‌హెచ్‌ఓ ధరమ్‌వీర్‌ సింగ్‌ గుర్తించారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఐపీసీ, పోక్సో, ఎస్సీ, ఎస్టీ చట్టాల కింద సంబంధిత సెక్షన్ల కింద నిందితులపై కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. నిందితులు పరారీలో ఉన్నారనీ, వారిని పట్టుకోవడానికి గాలింపు చర్యలు సాగుతున్నాయని చెప్పారు.

Spread the love