ఈ త‌రాన్ని క‌విత్వంగా మాట్లా‌డ‌నివ్వండి…

”యువ కవులూ మీకు నచ్చినట్లు రాయండి.. మీకు నచ్చిన శైలిలో రాయండి. ఈ దారే సరైనదని నమ్మించి వంతెన కింద రక్తపుటేర్లు పారించారు. కవిత్వంలో అన్నింటికీ అనుమతి ఉంది. అయితే ఒక్క షరతు… మీరు రాసేది తెల్ల కాగితం కన్నా మెరుగ్గా ఉండాలి” అంటాడు నికనోర్‌ పర్రా అనే కవి.
ఇవ్వాళ అసలు కవిత్వం లేదు. ఇప్పుడు రాసేది కవిత్వమే కాదని వినిపిస్తున్న కాలంలో ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా ఈ తరం కవిత్వాన్ని పరిచయం చెయ్యాలనుకున్నాను. పైన నికనోర్‌ పర్రా అనే కవి అన్నట్లు ఈ తరం హదయానికి నచ్చినట్టు రాస్తుంది. వాస్తవ ప్రపంచాన్ని కళాత్మకంగా కవిత్వం చేస్తుంది. మూలాలను వెతుకుతుంది. కాలానికి అనుగుణంగా ప్రత్యేక కవిత్వ భాషను ఏర్పాటు చేసుకుంటుంది. బాధలతో, గాయాలతో, నొప్పితో రాయాల్సిన వాక్యాన్ని స్కాన్‌ చేస్తూ రాస్తుంది. కవితా వాక్యాలతో దశాలను చూపిస్తుంది. గుండెను మెలిపెడుతుంది. మెలిక తిప్పుతుంది. ఎంతో కొంత మనుషులను గడ్డ కట్టినప్పుడల్లా కరుగతీస్తుంది. ఆలోచింపజేస్తుంది. కవిత్వం ఇలానే రాయాలనే నియమాన్ని దాటుకుంటూ రాస్తుంది. రాసే ప్రతీ దానికి తమదైన పరిమళాన్ని వెంటేసుకొస్తుంది. దేశంలో.. దేహంలో జరిగే కదలికలను పసికట్టి రాస్తోంది. నిలబడాల్సిన చోట నిలబడుతూనే రాస్తుంది. కలలను రాస్తుంది. కళాత్మకమైన నినాదాన్ని వినిపిస్తుంది. భిన్నమైన శైలిలో, సొంత గొంతుతో ఎవరికి తీసిపోని విధంగా కవిత్వం కవిత్వంగా బయటకొస్తుంది. అయితే పూర్తిగా కాకున్నా ఇంకా నేర్చుకోవాల్సి ఉందేమో, ఇంకాస్త మెరుగులు దిద్దుకోవాల్సి ఉందేమో అలా అని అందరిని అదే కాల్వలోకి నెట్టడానికి వీలులేదు. స్పష్టతతోనే కవిత్వం నడుస్తుంది. ముందైతే రాయనివ్వండి. ఈ తరాన్ని సొంత గొంతుతో మాట్లాడనివ్వండి. భావాలను వ్యక్తపరచనివ్వండి. ఆ రక్తాన్ని ఒకే చోట గడ్డకట్టకుండా ప్రసరింపజేయనివ్వండి.
శ్రీశ్రీ కవిత్వం ఒక మార్క్‌ వేసుకొని రాస్తునప్పుడు కవిత్వమంటే ఇట్లాగే ఉండాలని అనుకొని అలాగే రాసిన వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత చాలా పరిణామాలు కవిత్వంలో వచ్చాయి. చాలా వాదాలు కవిత్వాన్ని బలంగా నిలబెట్టాయి. భావ కవిత్వం, దిగంబర కవిత్వం విమర్శలు ఎదుర్కొన్న దాని పని అది చేసుకుంటూ పోయింది. అభ్యుదయం, స్త్రీవాదం, దళిత వాదం, మైనారిటీ వాదం, బీసీ వాదం ఇలా ఏ వాదం ఎట్లాంటి విమర్శలు ఎదుర్కొన్న వాటి పని అవి సమర్ధవంతంగా చేసుకుంటూనే వొచ్చాయి.
వచన కవిత్వ ఆద్యుడు కుందుర్తి ఆంజనేయులు దగ్గర నుండి మా కన్న ముందున్న తరం దాకా కవిత్వానికి వాళ్ళు చేసిన సజన, రాసినవి కవిత్వం ఆయా కాలానికి అవసరం. ఆయా కాలంతో పాటుగా నడిచారు. కవిత్వం కాలంతో పాటుగానే నడుస్తుంది.
ఏ కాలానికి ఆ కాలం ఒక కొత్త తరాన్ని తయారు చేసుకుంటుంది. అట్లా ఈ తరం కూడా కవులను కన్నది. కవిత్వాన్ని కంటుంది. ఈ నేల మీద కవిత్వ నదులు పారుతుంటాయి. అడ్డుకట్టలకు ఆగిపోయే నదులు కావవి. ఎగిరిదుమికి పరుగులుపెడుతుంటాయి.
ఆ కోణంలో ఈ తరం ఈ వాదాన్ని ఎత్తుకుంది అని గమనించినప్పుడు ఒకే మాటల చెప్పడానికి వీలుకానిది. చాలా వరకు స్పాంటేనియస్‌ స్పందిస్తుంది ఆ స్పందన నిరసన రూపంలో వుంటుంది. ధిక్కారరూపంలో వుంటుంది. బాధగా వుంటుంది. మూలాలలోంచి మాట్లాడుతునట్టుగా వుంటుంది. ఒక ప్రత్యేకమైనదిగా కాకుండా అవసరమైన గొంతుగా కవిత్వం వస్తుందని చెప్పుకోవచ్చు. సంఘటనాత్మకంగా ప్రతిస్పందిస్తుంది అని రాసుకోవచ్చును. సమాజంతో చర్య పొందుతూ రసాయానాత్మకంగా వస్తుందని చెప్పవచ్చు.
ఇప్పటి తరాన్ని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సి ఉన్నప్పటికీ ఆ విస్తతి పెద్దది కాబట్టి ఇక్కడ కవిత్వ పుస్తకాలను వెలువరిచిన కవులను మాత్రమే కొంత పరిచయం చేస్తున్నాను. నిజానికి రాస్తున్న వాళ్ళు కవితా పుస్తకాలను ప్రచురించకుండా చాలా మంది ఉండి ఉండొచ్చు. ముద్రించిన వాళ్ళలో పేజీల పరిమితికి, సమయభావం వలన అందుబాటులో ఉన్న కొందరిని మాత్రమే పరిచయం చేయాల్సి వస్తుంది.
మా తరం విద్యార్థులుగా తమ చదువు తాము చదువుతూ, తమ పనులు తాము చేసుకుంటూ సిరియస్‌ గా కవిత్వం రాస్తూ పుస్తకాలు ప్రచురించిన వాళ్ళలో దొంతం చరణ్‌ -మట్టికనుగుడ్ల పాట, ఊహ చేద్దాం రండీ, గూండ్ల వెంకటనారాయణ – ఇయ్యాల ఊళ్ళో, కాపాలదారుల పాటలు, ఉదరు కిరణ్‌ – నేల నుడికారం, అమత రాజు – పిలుపు, సభావట్‌ హాథిరామ్‌ – నల్లింకు పెన్ను, తెగిపడ్డ నాలుక – మధు సార్వభౌమ లాంటి వాళ్ళు ఉన్నారు. ఈ మధ్య కాలంలో చాలా కవిత్వం ప్రచురణకు నోచుకోవడం సంతోషదాయకం.
దొంతం చరణ్‌ ఇప్పటికే రెండు పుస్తకాలను ప్రచురించాడు. మట్టి కనుగుడ్ల పాటతో కవిత్వంలో ఒక నూతనత్వానికి తెర తీశాడు. ఊహా చేద్దాం రండీ అంటూ రెండవ కవిత్వ పుస్తకాన్ని వెలువరించాడు. చరణ్‌ ప్రత్యేక చూపున్న కవి. దేశంలో జరిగే సంఘటలకు ప్రతిస్పందనగా కవిత్వమౌతున్నాడు. ధిక్కార స్వభావంతో అన్యాయాన్ని ఖండిస్తున్నాడు. వాస్తవాన్ని కళాత్మకంగా రాయాలని పరితపిస్తుంటాడు.
”చెమటచుక్కలు భూగోళమంత ప్రేమతో నిండి వుంటాయని
మట్టి పెళ్లకు తెలిసినంత స్పష్టంగా
పొలంలోని నీరుకి తెలిసినంత లోతుగా
చెమటపైన దాడిచేసే ఉచ్చకేం తెలుసు
రైతుల మీద ఉచ్చ పోసే వర్గానికి
అన్నం ముద్దల్లో చందమామలెలా కనిపిస్తాయి.
అమాయకులు కాదు అనే కవితలో ఆదివాసీ మనిషి మీద మూత్రం పోసిన సంఘటలకు స్పందిస్తూ రాసిన కవితలోనిది ఇది.
***
గూండ్ల వెంకట నారాయణ ఇయ్యాల ఊళ్ళో, కాపలాదారుల పాటలు రెండు కవిత్వ పుస్తకాలను వెలువరించారు. నారాయణ మూలాలను విడవని వ్యక్తి. ఊరు జ్ఞాపకాలను కవిత్వంలోకి పట్టుకొచ్చిన కవి. కాపాల దారుల పాటలు పుస్తకంలో తడకలకు అలికిన మట్టిలో శ్రమజీవుల మాటలుంటాయి అని గుర్తుచేయ్యడం. తల్లికాలి కడియంలా చంద్రుడిని చూపెట్టడం, పంటల్లో పాలను పిండి జున్నును తినడం వంటివి అనుభూతులను, జీవితాన్ని స్వచ్చంగా రాస్తున్నాడు.
***
అమత రాజు ”పిలుపు” పేరుతో కవిత్వంలోకి వొచ్చాడు. అమ్మను, అలిశెట్టిని, అంబెడ్కర్‌ ని వంటి మహానీయులను తలుచుకుంటూ సమాజంలో జరుగుతున్న చర్యలకు స్పందిస్తూ స్పాంటేనియస్‌ కవిత్వం రాస్తున్నాడు. కవిత్వంతో హెచ్చరిక చేస్తున్నాడు.
”కరోనా…నువ్వు మా ముక్కుల్లో చేరక ముందే మా డొక్కల్లో ఆకలి వైరసుంది
మా బ్రతుకుల్లో కులమత వైరసుంది. అని ఈ సమాజంలో తిరుగుతున్న వైరస్ల గురించి మాట్లాడుతున్నాడు. ఏదైతే ఆశిస్తున్నాడో ఆ పిలుపును రాగం తీస్తున్నాడు.
***
సభావట్‌ హాథిరామ్‌ ”నల్లింకు పెన్ను” పుస్తకాన్ని ప్రచురించాడు. డిగ్రీ చదువుతూ కవిత్వం రాస్తున్నాడు.
”వస్తున్నాయి… వస్తున్నాయి
రాజకీయపు కత్తెరలు మరింత పదునెక్కుతూ వస్తున్నాయి
ఎజెండాల జెండాలు
మానవత కేతనాన్ని కత్తిరిస్తూ
ఓట్లకై కోట్లు ఆశలు చూపుతూ
కుల, మత గోడలను నిర్మిస్తూ
మానవునికి వాస్తవానికి గల బంధాన్ని కత్తిరిస్తూ వస్తున్నాయి” అంటూ జీవిత మూలాలను, బాధలను, చైతన్యవంతమైన దారులకోసం కవిత్వ కలలు కంటున్న కవి.
***
ఉదరు కిరణ్‌ ” నేల నుడికారం ” ఒక కొత్తధనపు వాసన వేసే కవిత్వం. సాదాసీదాగా మొదలై కొంత నడక సాగాక మెరుపులా మెరిసి, భాస్వరంలా మండే వాక్యాలు ఉదరు ప్రతి కవితలో కనిపిస్తాయి అని రివెరా ముందు మాటలో అన్నారు. అట్లా తనదైన నడకతో నడుస్తున్న కవి ఉదరు కిరణ్‌.
ఒకానొక సందర్భంలో ”ఈ నేలంతా కలల వనమై మళ్ళీ మొలకెత్తుతుంది ఎర్రని మల్లెల తావిగా వికసిస్తుంది మొండి కొడవళ్లు తమకు తాము పదును పెట్టుకుంటాయి ఆకాశమంతా తారల వనమై వెలుగుతుంది ” అంటాడు.
***
మధు సార్వభౌమ నేనొక చీకటిని కాలం మోసం చేసిన కారుమబ్బుని కట్టుకథలు పన్నిన కుట్రకు బలైన నిజచరితను” అంటాడు. ‘ఆర్యులు సష్టించిన కారుచిచ్చులో కాలిపోయిన రక్తమాంసాల ద్రావిడ చరిత్రను నేను’ అంటాడు. ఆర్యులు యుద్ధకాముకులు. ద్రావిడులు శాంతిప్రియులు. ఈ కవి చరిత్రను గుర్తు చేస్తాడు. కొత్త శక్తిని నిద్రలేపుతున్నాడు.
‘క్షమించరాని నేరం’ కవితలో విస్మరించబడిన చరిత్రను తెలుపుతాడు. ”వాన నీటికి తడిస్తే వచ్చే మట్టి వాసనలా స్పష్టంగా తెలుస్తుంది మా ధ్వంసం కాబడిన చరిత్ర” అంటాడు. చరిత్రను ఆవాహన చేసుకున్న కవి యితడు.
ఈ తరంలో స్త్రీలు రాస్తున్నారు. పూర్తిగా స్త్రీ వాదాన్ని కాకుండా అనేక విషయాలపైన స్పందిస్తున్నారు. కొత్త సూర్యుడిని కలగంటున్నారు. కొత్త ఆకాశాన్ని రాస్తున్నారు. సమాజంలో జరిగే అఘాయిత్యాలకు ప్రతిస్పందనగా అక్షారాలను బిగిస్తున్నారు. అమానవీయ సంఘటలకు కన్నీళ్ళవైపు నిలబడుతున్నారు. చేయాల్సిన సంతకాలను అక్షరాలతో చేస్తున్నారు. వీళ్ళలో శ్రీనిధి విప్లవ శ్రీ – రాలిన చుక్కలు, సుంక ధరణి – అరుణిమలు, సాత్విక ద్యాగలి – నీలి స్వప్నాలు, స్వేచ్ఛా బిందువులు, భాను తేజ శ్రీ- మీ మదిలో నేను స్వేచ్ఛగా ఎగరాలని వంటి పుస్తకాలు ప్రచురింపబడ్డాయి. ఇంకా రావాల్సినవి ఉన్నాయి.
ఏది ఏమైనా ఇవాళ్టి తరం కవిత్వం రాస్తుంది. వాస్తవాన్ని రాస్తుంది. కొత్త కవిత్వ రైలును పాత ప్లాట్‌ ఫారం మీదకు తీసుకురాకండి. వెళ్ళనివ్వండి గుండెల మించి..పసునూరి శ్రీధర్‌ బాబు అన్నట్లు దాని నడకను నడవనివ్వండి. రాయనివ్వండి. ఋతువులకు అనుకూలంగా ఆకు రాలుతూ చిగురిస్తూనే బావుంటుంది. కింద రాలుతున్న ఆకునే చూసి ఆనంద పడకండి. చిగురిస్తున్న ఆకులను ప్రేమించండి. చదవండి. అనుభూతి పొందండి. కవిత్వపు వాతావరణ పొరలో జీవించనివ్వండి.
– పేర్ల రాము, 96425 70294

కవిత్వమంటే వసంతం రాక మానదని చెప్పే ఒక ఆశావాదం. దాడికి ప్రతిదాడి. సజనాత్మక ప్రతిఘటన. మనల్ని మనం మానవీకరించుకోవటానికి పనికొచ్చే కళాత్మకమైన పనిముట్టు.
– దొంతం చరణ్‌
కవిత్వమంటే ఆలోచనలకు, అక్షరాలకు మధ్య జరిగే సంధి. భావోద్వేగాలకు, భావార్థాలకు మధ్య జరిగే పొత్తు. సున్నితమైన ఊహలను కవిత్వం చేయాలనుకుంటాను. బతుకు చట్రంలో వెంటాడే అనేక విషయాలను కవిత్వంలోకి తీసుకురావాలనుకుంటాను. ఇవాళ్టి కాలానికి రాయాల్సిన కవిత్వం చాలా వుంది.
– సుంక ధరణి
కవిత్వమంటే ఒక్కో కవికీ/ కవయిత్రికి ఒక్కో రకమైన నిర్వచనం వుండి వుంటది. అది సమాజం పట్ల వాళ్ళ దక్పథాలను, వాళ్ళ ఆలోచనల్ని ప్రతిబింబిస్తూ వుంటది.
అందరిలాగే కవిత్వమంటే నాకూ ఓ నిర్వచనం వుంది. ”మతం, మార్కెట్‌ రెండూ ఒక్కటై విశాల ప్రజా సముహంపై దాడి చేస్తున్నప్పుడు మనుషులని సామాజికంగా, వ్యక్తిగతంగా కాపాడేది. మనిషిగా నిలబెట్టేది. అవసరమైన ప్రతీ చోట మనిషిని చైతన్యవంతంగా తీర్చి దిద్దేది.” మార్పు కోసం మాత్రమే కాదు మీలో మనిషితనం కాపాడుకోవడం కోసం ప్రతీ ఒక్కరూ కవిత్వం రాయండి.
– అమృత రాజు
కవిత్వం నాకు మానసిక ఆత్మకథ లాంటిది. అందులో ప్రజల ఏడుపు, పోరాటం, శ్రమ, సౌందర్యం కలిసి ఉంటాయి. కాబట్టి అది సామూహిక ఆత్మకథ అవుతుంది. ఆ సామూహిక ఆత్మకథను చెప్పటం కోసం నేను కవిత్వం రాస్తాను.
– గూండ్ల వెంకట నారాయణ

Spread the love