తెలంగాణ ఘనకీర్తి చాటిచెబుదాం..

– దశాబ్ది ఉత్సవాలకు రూ.105 కోట్లు..
– కలెక్టర్ల సమావేశంలో సీఎం కేసీఆర్‌ దిశా నిర్దేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.105 కోట్లను కేటాయించింది. సంబంధిత నిధులను వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఆర్థికశాఖను ఆదేశించారు. గురువారం హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో సీఎం అధ్యక్షతన కలెక్టర్ల సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్‌తోపాటు మంత్రులు, ఉన్నతాధికారులు, 33 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. దశాబ్ది ఉత్సవాల కార్యచరణ, ఏర్పాట్లపై ఈ సందర్భంగా కేసీఆర్‌ దిశా నిర్దేశం చేశారు.
పోరాటాలు, త్యాగాలతో, ప్రజాస్వామ్య పంథాలో సాధించుకున్న స్వరాష్ట్రంలో పదేండ్ల ప్రగతి ప్రస్థానాన్ని ప్రజలకు వివరించాలని ఈ సందర్భంగా ఆయన కలెక్టర్లకు సూచించారు. హరితహారం సాధించిన విజయాలను వివరించారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వరి నాట్లను ఇప్పుడు అనుసరిస్తున్న ధోరణిలో కాకుండా ముందస్తుగా సకాలంలో వేసుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాల గురించి తెలిపారు. గిరిజనులకు పోడు పట్టాల పంపిణీ గురించి ప్రకటన చేశారు. తెలంగాణ ఏర్పడే నాటికి ఉన్న పరిస్థితులను, ఇప్పటి గుణాత్మక అభివృద్ధితో పోల్చి ఆయన వివరించారు. మూడు వారాల పాటు నిర్వహించే రోజువారీ కార్యక్రమాల షెడ్యూల్‌ను, దాని ప్రాధాన్యతను కలెక్టర్లకు విడమరిచి చెప్పారు. జూన్‌ 2 నుంచి 22 వరకు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఏ రోజున ఏ కార్యక్రమాన్ని చేపట్టాలో వివరించారు. మంత్రులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆయన ఆదేశించారు. ఆ ఉత్సవాలను జిల్లాల వారీగా వీడియో రికార్డు చేసి భద్రపరచాలని ఆదేశించారు. అదే సందర్భంలో నియోజక వర్గాలు, జిల్లాల వారీగా సాధించిన అభివద్ధిని తెలిపే, పదేండ్ల ప్రగతి నివేదిక పుస్తకాలను ముద్రించి పంపిణీ చేయాలని సూచించారు. ఇప్పటికే నిర్ణయించిన మేరకు ఆయా రంగాల్లో సాధించిన అభివద్ధిపై డాక్యుమెంటరీలను రూపొందిస్తున్న దృష్ట్యా వాటిని ఉత్సవాల సందర్భంగా ప్రదర్శించాలని ఆదేశించారు.
పోటీ పరీక్షల విజేతలకు అభినందనలు..
తెలంగాణ విద్యార్థులు నీట్‌, ఐఏఎస్‌లాంటి పోటీ పరీక్షల్లో దేశంలోనే ముందు వరసలో ర్యాంకులు సాధిస్తూ రాష్ట్ర కీర్తిని చాటుతుండడం పట్ల సీఎం హర్షం వక్తం చేశారు. ఆయా విద్యార్థులను అభినందించారు. నారాయణపేట ఎస్పీ వెంకటేశ్వర్లు కూతురు ఉమా హారతి సివిల్‌ సర్వీసెస్‌లో జాతీయ స్థాయిలో మూడో ర్యాంకును సాధించిన నేపథ్యంలో సమావేశం అభినందనలు తెలిపింది.
రైతులను చైతన్యం చేయండి…
యాసంగి నాట్లు ఆలస్యం కావడం వల్ల రాష్ట్రంలో కోతలు కూడా లేటవుతున్నాయని సీఎం ఈ సందర్భంగా తెలిపారు. మార్చి 31 లోపే జరగాల్సిన కోతలు మే నెల దాటినా కొనసాగుతున్నాయని తెలిపారు. దాంతో ఎండాకాలంలో వచ్చే అకాల వర్షాలు, వడగండ్ల వానలతో వరి పంటలు నష్టపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బాధలు తప్పాలంటే నవంబర్‌ 15 నుంచి 20 లోపే యాసంగి వరినాట్లు వేసుకోవాలనీ, అందుకనుగుణంగా వానకాలం వరినాటును కూడా ముందుకు జరుపుకోవాలని సూచించారు. రోహిణీ కార్తె ప్రారంభంలోనే వానాకాలం వరినాట్లు మొదలు పెట్టాలని తెలిపారు. మే 25 నుంచి 25 జూన్‌ వరకు వానాకాలం వరినాట్ల ప్రక్రియ పూర్తి కావాలనీ, ఈ దిశగా జిల్లా కలెక్టర్లు వ్యవసాయ శాఖ సహకారంతో రాష్ట్ర రైతాంగాన్ని చైతన్యం చేయాలని కోరారు.
సఫాయన్నకు సలాం…
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పారిశుధ్య కార్మికులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని సీఎం ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. దశాబ్ది వేడుకల నేపథ్యంలో ‘సఫాయన్నా.. నీకు సలామన్నా…’ అనే నినాదంతో ప్రభుత్వం వారిని గౌరవిస్తుందని తెలిపారు. ఉత్తమ సఫాయి కార్మికులను గుర్తించి, మహిళా, పురుష విభాగాల్లో అవార్డులను అందజేస్తామని వెల్లడించారు. వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.
సమావేశంలో తీసుకున్న ప్రధాన నిర్ణయాలు…
– జూన్‌ 24 నుంచి 30 వరకు గిరిజనులకు పోడు పట్టాల పంపిణీ
– బీసీ, ఎంబీసీ కులాల వారికి ఆర్థిక సాయం :నియోజకవర్గానికి మూడు వేల మందికి చొప్పున గృహ లక్ష్మి పథకం అమలు
– ప్రతీ నియోజకవర్గానికి 1,100 మంది లబ్ధిదారులకు దళిత బంధు అమలు
– గొర్రెల పంపిణీని ప్రారంభించి, దశలవారీగా అమలు చేయాలి

Spread the love