రవితేజ తమ్ముడు రఘు తనయుడు మాధవ్ హీరోగా నటిస్తున్న చిత్రానికి ‘మిస్టర్ ఇడియట్’ అనే టైటిల్ ఖరారు. సిమ్రాన్ శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. జేజేఆర్ ఎంటర్‌టైన్ మెంట్స్ పతాకంపై యలమంచి రాణి సమర్పణలో జె.జె.ఆర్ రవిచంద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘పెళ్లి సందడి’ దర్శకురాలు గౌరీ రోణంకి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆదివారం ఈ సినిమా టైటిల్ పోస్టర్, ప్రీ లుక్‌ను రవితేజ ఆవిష్కరించారు. ‘నా కెరీర్‌లో ‘ఇడియట్’ సినిమాకు ఎంత ప్రాముఖ్యత ఉందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మా రఘు కొడుకు మాధవ్ ‘మిస్టర్ ఇడియట్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నాలాగే తనకు కూడా ఈ మూవీ బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలవాలని కోరుకుంటున్నాను’ అని టీమ్‌కి రవితేజ అభినందనలు తెలియజేశారు. ‘ఈ నెలాఖరు నాటికి షూటింగ్ అంతా పూర్తవుతుంది. డైరెక్టర్ గౌరి సహా ఇతర టెక్నీషియన్స్, నటీనటుల సపోర్ట్‌తో సినిమాను అనుకున్న టైమ్‌కి పూర్తి చేస్తున్నాం. నవంబర్‌లో విడుదల చేస్తాం’ అని నిర్మాత జె.జె.ఆర్. రవిచంద్ అన్నారు. డైరెక్టర్ గౌరి రోణంకి మాట్లాడుతూ, ‘ఇడియట్” మాదిరిగానే ‘మిస్టర్ ఇడియట్’ కూడా హిట్ అవుతుంది’ అని చెప్పారు.