వచ్చే నెలలో యూనివర్సిటీ రీ- రిలీజ్‌

స్నేహ చిత్ర పిక్చర్స్‌ బ్యానర్‌ పై ఆర్‌.నారాయణమూర్తి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘యూనివర్సిటీ’. ప్రేక్షకుల అభిప్రా యాన్ని, సూచనలను గౌరవిస్తూ ఈచిత్రాన్ని వచ్చే నెలలో రీ-రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆర్‌.నారాయణమూర్తి మాట్లాడుతూ,’నేను తీసిన ‘యూనివర్సిటీ’ సినిమా జూన్‌ 9న రిలీజ్‌ అయ్యింది. అప్పుడు ఎండలు, వడగాల్పుల వలన సినిమా చూడ్డానికి ప్రేక్షకులు బయటకు రాలేదు. దీంతో నా సినిమా నలిగిపోయింది. చూసిన కొద్దిమంది చాలా బాగా తీశావ్‌. విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలు, వాళ్ళ తల్లిదండ్రుల కష్టాలు, కన్నీళ్లు ఆవేదనలు, ఆవేశాలతోపాటు పేపర్ల లీకేజ్‌లు ఎందుకు?, ఎలా జరుగుతున్నాయి అనే వాటిని చాలా బాగా చూపించావు. పాటలూ బాగున్నాయి. వాతావరణం చల్ల బడ్డాక ఇంత మంచి చిత్రాన్ని రిలీజ్‌ చేస్తే ప్రజలకు మరింత చేరువవుతుంది అని చెప్పారు. అందుకే మళ్ళీ ఈ చిత్రాన్ని వచ్చే నెలలో రిలీజ్‌ చేస్తున్నాను. సహకరిస్తున్న డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్స్‌కు ధన్యవాదాలు’ అని తెలిపారు.

Spread the love