శివ కార్తికేయన్ కథానాయకుడిగా, ‘మండేలా’ ఫేమ్ మడోన్ అశ్విన్ దర్శకత్వం వస్తున్న ఫాంటసీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మహావీరుడు’. అదితి శంకర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శాంతి టాకీస్ పతాకంపై అరుణ్ విశ్వ నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ, పంపిణీ సంస్థ ఏషియన్ సినిమాస్ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా ఈనెల 14న విడుదల చేస్తోంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్‌లో హీరో అడివి శేష్, డైరెక్టర్ శేఖర్ కమ్ముల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
హీరో శివ కార్తికేయన్ మాట్లాడుతూ, ‘మహావీరుడు ఫాంటసీ జోనర్. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది. దర్శకుడు అశ్విన్ బ్రిలియంట్‌గా తీశారు. ఈ సినిమాలో చాలా మంచి సర్‌ప్రైజ్ ఉంది. అందరూ థియేటర్‌కి వెళ్లి సినిమా చూడండి. కచ్చితంగా ఎంజారు చేస్తారు’ అని అన్నారు.
హీరో అడివి శేష్ మాట్లాడుతూ, ‘శివకార్తికేయన్‌తో కలిసి పని చేయాలని ఉంది. అశ్విన్ మొదటి సినిమా ‘మండేలా’ చూసినప్పుడు ఆయనతో వర్క్ చేస్తే బావుండని అనుకున్నాను. ఆయన దగ్గరికి ‘క్షణం’ రీమేక్ వెళ్ళిందని తెలిసి ఆనందంగా ఉంది’ అని తెలిపారు.
‘దర్శకుడు అశ్విన్ ‘మండేలా’ సినిమా చూశాను. చాలా ముఖ్యమైన సినిమా అది. ‘మహావీరుడు’ కూడా అంతే ప్రత్యేకంగా ఉంటుందని భావిస్తున్నాను. ఈ చిత్ర ట్రైలర్ విజువల్స్ గొప్పగా ఉన్నాయి. సరిత గారి సినిమాలు చూస్తూ పెరిగాం. ఆమెతో వేదిక పంచుకోవడం ఆనందంగా ఉంది’ అని దర్శకుడు శేఖర్ కమ్ముల చెప్పారు. దర్శకుడు మడోన్ అశ్విన్ మాట్లాడుతూ, ‘ఇందులో శివకార్తికేయన్ అద్భుతమైన నటన, యాక్షన్ యాంగిల్ చూస్తారు. అదితి శంకర్ ఎనర్జిటిక్‌గా చేసింది. సునీల్ వలనే ఈ సినిమా ఇంత గ్రాండ్‌గా విడుదల అవుతోంది’ అని అన్నారు.