ఘనంగా విక్టరీ మధుసూదనరావు శత జయంతి వేడుకలు

తెలుగు సినిమా స్వర్ణ యుగానికి మెరుగులు దిద్దిన మహోన్నతమైన దర్శకుల్లో వీరమాచినేని మధుసూదనరావు అలియాస్‌ విక్టరీ మధసూదనరావు ఒకరు. ఆయన శత జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. సందర్భంగా మధుసూదన రావు కుమార్తె వాణి మాట్లాడుతూ,’నాన్న సినిమానే శ్వాసించారు.. సినిమానే జీవితంగా భావించి పయనించారు’ అని తెలిపారు. ‘మధుసూదనరావు దర్శకత్వంలో నేను నటించడం నిజంగా నా అదష్టం. ఇక్కడ లోకల్‌ టాలెంట్‌ను ప్రోత్సహించటానికి ‘మధు ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌’ను స్థాపించి ఎందరో కళాకారులను పరిశ్రమకు అందించారు’ అని మురళీమోహన్‌ అన్నారు. దర్శకులు ఎ.కోదండరామిరెడ్డి మాట్లాడుతూ,’నేను ఈరోజు మూడు పూటలా అన్నం తింటున్నాను అంటే అది మధుసూదనరావు దయే. నా చేతి రాత చూసి, నా తలరాత మార్చేశారు’ అని చెప్పారు. ‘తెలుగు సినిమా ఉన్నంతకాలం గుర్తుంచుకోదగ్గ పేర్లలో మధుసూదనరావు పేరు కూడా ఉంటుంది’ అని దర్శకుడు బి.గోపాల్‌ అన్నారు. దర్శకుడు ఎస్‌.వి. కష్ణారెడ్డి మాట్లాడుతూ, ‘మధు సూదనరావు సినిమాల్లో సెంటి మెంట్‌, మానవతా విలువలు, సమాజం పట్ల బాధ్యత కనిపి స్తాయి’ అని తెలిపారు. ‘మధుసూదన రావు కమ్యునిస్ట్‌ భావజాలం ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇన్ని కుటుంబ కథా చిత్రాలకు దర్శకత్వం వహించి సూపర్‌ హిట్‌లు ఇచ్చా రంటే చాలా గర్వ పడాల్సిన విషయం’ అని వి. విజయేంద్ర ప్రసాద్‌ చెప్పారు. తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ, ‘ఓ వైపు కుటుంబ కథా చిత్రాలను తీస్తూనే.. మరోవైపు సమాజాన్ని మేల్కొలిపే అభ్యుదయ చిత్రాలను కూడా తీసి విజయం సాధించారు. తన సినిమాల ద్వారా ప్రజలను చైతన్య వంతులను చేసి, భవిష్యత్‌ తరాలకూ ఆదర్శంగా నిలిచి, విక్టరీని ఇంటిపేరుగా పొందగలిగారు’ అని అన్నారు.

Spread the love