సంగీత దర్శకుడు రాజ్‌కు ఘన నివాళి

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో హిట్‌ సాంగ్స్‌కి సంగీతాన్ని అందించిన ప్రముఖ సంగీత దర్శకులు రాజ్‌(63) ఇటీవల గుండెపోటుతో మరణించిన సంగతి విదితమే. రాజ్‌ మృతికి సంతాపంగా తెలుగు టెలివిజన్‌ అండ్‌ డిజిటల్‌ మీడియా మ్యూజిషియన్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శనివారం తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌లో సంతాప సభ ఏర్పాటు చేశారు.
నటుడు శివాజీ రాజా మాట్లాడుతూ, ‘నాకు రాజుగారు దూరపు చుట్టం. ఆర్టిస్ట్‌ అవుదామని అనుకుంటు న్నప్పుడు నేను మొదటిసారి వెళ్ళింది ఈయన ఇంటికే. రాజులు చాలామంది ఉంటారు కానీ అందులో మంచి రాజులు కొంత మందే ఉంటారు. అలాంటి వారిలో ఈ రాజుగారు ఒకరు’ అని అన్నారు. సురేష్‌ కొండేటి మాట్లాడుతూ,’చిన్నప్పట్నుంచి రాజ్‌గారి పాటలు వింటూ పెరిగాను. నేను హైదరాబాద్‌కు వచ్చిన దగ్గర్నుంచి ఆయన్ని ఫాలో అవుతూ ఉండేవాడిని. ‘సిసింద్రీ’ షూటింగ్‌ సమయంలో ఆయన్ని కలిసే అవకాశం దొరికింది.
నేను రిలీజ్‌ చేసిన ‘ప్రేమించాలి’ సినిమాలో రాజ్‌ గారి కుమార్తె శ్వేతతో పాటలు పాడించాను. రాజ్‌ గారి మరో అమ్మాయి దివ్య కూడా చిరంజీవి ‘ఖైదీ నెంబర్‌ 150′ సినిమాకి డైరెక్షన్‌ డిపార్ట్మెంట్లో పని చేశారు. గొప్ప సంగీత దర్శకుడు రాజ్‌ మరణం మనకే కాదు సినీ పరిశ్రమ మొత్తానికి తీరని లోటు’ అని తెలిపారు. ఇంత ఘనంగా నాన్నగారి సంతాప సభను ఏర్పాటు చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని రాజ్‌ కుమార్తెలు భావోద్వేగానికి గురయ్యారు.

Spread the love