ఆహారోత్పత్తుల పేరుతో తప్పుడు ఔషధాల తయారీ

ఆహారోత్పత్తుల పేరుతో తప్పుడు ఔషధాల తయారీ– డీసీఏ దాడుల్లో వెల్లడి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఆహారోత్పత్తుల పేరుతో తప్పుడు ఔషధాలను తయారు చేసి అమ్ముతున్న తయారీ దారులపై డ్రగ్‌ కంట్రోల్‌ అథారిటీ అధికారులు దాడులు నిర్వహించారు. మేడ్చల్‌ -మల్కాజిగిరి జిల్లాలోని ఎమినెంట్‌ రెమిడీస్‌, కెన్‌ క్యూర్‌ ఫార్మాస్యూటికల్స్‌ లో చట్టవిరుద్ధంగా వీటిని తయారు చేస్తున్నట్టు గుర్తించారు. వీరిపై కేసులు నమోదు చేసి విచారిస్తున్నట్టు అధికారులు తెలిపారు. అదే విధంగా మూత్రపిండాల్లో రాళ్లను కరిగించే ఔషధమంటూ తప్పు దారి పట్టిస్తూ అమ్ముతున్న పథార్‌ చటడీ (స్టోన్‌ క్రాకర్‌) ఆయుర్వేద ఔషధాన్ని అదే జిల్లా కేపీహెచ్‌ బీలోని ఒక మెడికల్‌ షాప్‌ నుంచి స్వాధీనం చేసుకున్నారు. దీన్ని రాజస్థాన్‌ కు చెందిన రాజ్‌ పుటానా అగ్రికో తయారు చేస్తున్నది.
నకిలీ క్లినిక్‌ లపై దాడులు
రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేట గ్రామంలో వైద్యం చేసేందుకు అవసరమైన అర్హత లేని జి. శ్రీనివాసులు నడుపుతున్న శ్రీరాం ఫస్ట్‌ ఎయిడ్‌ సెంటర్‌ పై దాడి చేసి 28 రకాల ఔషధాలను స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా హైదరాబాద్‌ జిల్లా ముషీరాబాద్‌, గాంధీనగర్‌ , పద్మశాలీ కాలనీలో యునానీ మెడికల్‌ ప్రాక్టీషనర్‌ డాక్టర్‌ అహ్మద్‌ షాహిద్‌ వారీస్‌ వద్ద నిల్వ ఉన్న అల్లోపతిక్‌ ఔషధాలను గుర్తించారు. అతడి వద్దనున్న 21 రకాల ఔషధాలను సీజ్‌ చేశారు. లైసెన్స్‌ లేకుండా డ్రగ్స్‌ అమ్మడం, అర్హత లేకుండా వైద్యునిగా ప్రాక్టీస్‌ చేయడం చట్టరీత్యా నేరమని అధికారులు ఈ సందర్భంగా తెలిపారు.

Spread the love