పిల్లల ఆరోగ్యానికి పౌష్టికాహారం దోహదం

 – అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్
నవతెలంగాణ-గంగాధర : గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు పౌష్టికాహారం దోహదం పడుతుందని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు. స్వచ్ఛ్ సర్వేక్షన్ గ్రామీణ్, పోషణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గంగాధర మండలం గట్టుభూత్కూర్ గ్రామాన్ని అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ సందర్శించి సభలో మాట్లాడారు. పిల్లల పెంపకం పట్ల తల్లులు శ్రద్ద చూపాలని అన్నారు. పిల్లల ఎదుగుదల, ఆరోగ్య పరిరక్షణకు సరైన పౌష్టికాహారం అందించాలని సూచించారు. అంగన్ వాడి టీచర్లు, వైద్య సిబ్బంది అందించే సలహాలు, సూచనలు మహిళలు పాటించాలన్నారు. సభకు ముందు గ్రామంలోని బీసి కాలనిలో గల అంగన్ వాడి బోరు వద్ద కమ్యూనిటీ ఇంకుడు గుంత నిర్మాణాన్ని ప్రారంభించారు. అనంతరం కోతుల వనం, స్మశాన వాటిక, సెగ్రగేషన్ షెడ్, నర్సరీని పరిశీలించి గ్రామంలో చెత్త సేకరణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో నిర్మించిన ఇంకుడు గుంతలను పరిశీలించి గ్రామ పాలక వర్గాన్ని అభినందించారు గ్రామంలో ప్రతి రోజు ఇదే విధంగా పారిశుధ్య పనులు కొనసాగించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ కంకణాల విజేందర్ రెడ్డి, మండల పరిషత్ ఉపాధ్యక్ష్యుడు కంకణాల రాజగోపాల్ రెడ్డి, డీఆర్డీఓ శ్రీలత, డీపీఓ వీర బుచ్చయ్య, డీడబ్ల్యూవో సంధ్యారాణి, ఎంపీడీవో రాజీవ్ మల్హోత్రా, ఎంపీఓ జనార్దన్ రెడ్డి, ఎస్బీఎం వేణు, ఉప సర్పంచ్ కాసారపు శైలజ శ్రీకాంత్, వార్డు సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Spread the love