గ్రేటర్‌ హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు వర్షాలు

నవతెలంగాణ – హైదరాబాద్
గ్రేటర్‌ ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలకు చేరుకున్నాయి. దీంతో ఉదయం 8 గంటల నుంచే ఎండ తీవ్రత ఉంటోంది. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. వాయువ్య దిశ నుంచి తెలంగాణ వైపునకు వీస్తున్న కిందిస్థాయి గాలుల ప్రభావంతో గ్రేటర్‌లో ఎండలు దంచికొడుతున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో 41 డిగ్రీల సెల్సియస్‌, కనిష్ఠం 26.5 డిగ్రీల సెల్సియస్‌, గాలిలో తేమ 25 శాతంగా నమోదైనట్లు వెల్లడించారు. రాగల మరో మూడు రోజులు ఉష్ణోగ్రతలు 42కు చేరే అవకాశం ఉందన్నారు. ఇదిలా ఉండగా తూర్పు మధ్యప్రదేశ్‌ నుంచి విదర్భ మీదుగా తెలంగాణ వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావంతో ఈనెల 20 నుంచి రెండు రోజుల పాటు గ్రేటర్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలు ఉన్నాయని వివరించారు.

Spread the love