గౌరవ వేతన సాధనకై నేటి నుండి రిలే నిరాహార దీక్షలు

నవతెలంగాణ – శాయంపేట: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దారిద్ర రేఖకు దిగువనున్న ప్రజలకు రేషన్ షాపుల ద్వారా సబ్సిడీ బియ్యాన్ని అందజేస్తుంది. రేషన్ బియ్యాన్ని ఆహార భద్రత కార్డు కలిగిన లబ్ధిదారులకు నెల నెల బియ్యాన్ని అందజేస్తున్న రేషన్ డీలర్ల సమస్యలను మాత్రం ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలని, నెలకు 30,000 గౌరవ వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ రేషన్ షాపులు బంద్ చేస్తూ బుధవారం నుండి రిలే నిరాహార దీక్షలు చేపట్టడానికి రేషన్ డీలర్లు సన్నద్ధమవుతున్నారు. శాయంపేట మండలంలోని 24 గ్రామపంచాయతీలలో 30 రేషన్ షాపులు ఉన్నాయి. మండలంలో 15,700 ఆహార భద్రత కార్డులు ఉండగా, 300 అంత్యోదయ కార్డులు ఉన్నాయి. వీరికి నెలనెల రేషన్ బియ్యాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలుపరిచిన ఈ పాస్ విధానం ద్వారా రేషన్ బియ్యాన్ని అందజేస్తున్నారు. కొన్నిసార్లు బయోమెట్రిక్ మిషన్లు సిగ్నల్ రాక లబ్ధిదారులు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ప్రభుత్వం సరఫరా చేసిన ఐరిష్ మిషన్లు పనిచేయడం లేదు. బయోమెట్రిక్, ఐరిష్ మిషన్ల రిపేర్ కోసం టెక్నికల్ పర్సన్ వచ్చే వరకు వేసి చూడాల్సిన పరిస్థితి నెలకొంటుంది. 4 నెలలకు ఒకసారి కమిషన్ విడుదల రేషన్ డీలర్లకు నెలనెలా కమిషన్ చెల్లించాల్సి ఉండగా ప్రభుత్వం నాలుగు నెలలకు ఒకసారి కమిషన్ విడుదల చేస్తుంది. దీంతో రేషన్ డీలర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి నెల రేషన్ షాప్ గది అద్దె 2,000, తూకం వేసే కూలీకి 2,000, బియ్యం దిగుమతి హమాలికి 1,000 రూపాయలు రేషన్ డీలర్ ఖర్చు చేయాల్సి వస్తుంది. డీలర్ కు 80 క్వింటాళ్ల బియ్యం మంజూరైన రేషన్ సరఫరా 60 క్వింటాళ్లు చేస్తే క్వింటాల్కు 70 రూపాయల చొప్పున నెలకు కమిషన్ 4200 ప్రభుత్వం చెల్లిస్తుంది. నెలకు వచ్చిన కమిషన్, అద్దె గది, హమాలి, కూలీ ఖర్చులకే సరిపోవడం లేదని రేషన్ డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పోర్టబిలిటీ సిస్టం ప్రవేశపెట్టడంతో కార్డు కలిగిన లబ్ధిదారులు ఎక్కడైనా బియ్యం తీసుకుంటుఉండడంతో వచ్చిన కోటాలో బియ్యం మిగిలిపోతున్నాయని డీలర్లు తెలపడం గమనార్హం. రేషన్ షాపులను మినీ సూపర్ మార్కెట్ల తీర్చిదిద్దాలి కాంగ్రెస్ హయాంలో రేషన్ షాపుల ద్వారా బియ్యము, పప్పులు, ఉప్పు, చక్కర, గోధుమపిండి, చింతపండు లాంటి తొమ్మిది రకాల నిత్యవసర వస్తువులను సబ్సిడీపై అందజేసేదని, అదే తరహాలో తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రజలు ప్రతినిత్యం వినియోగించే నిత్యవసర వస్తువులను రేషన్ డీలర్ల ద్వారా పంపిణీ చేసి రేషన్ షాపులను మినీ సూపర్ మార్కెట్ గా తీర్చిదిద్దాలని రేషన్ డీలర్లు డిమాండ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం రేషన్ షాపుల ద్వారా ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న రేషన్ బియ్యాన్ని మాత్రమే పంపిణీ చేస్తున్నామని తెలిపారు. రిలే నిరాహార దీక్షల వాల్పోస్టర్ విడుదల రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించాలంటూ రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు గురువారం నుండి చేపట్టనున్న రిలే నిరాహార దీక్ష కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ముద్రించిన వాల్పోస్టర్లను మండల కేంద్రంలో రేషన్ డీలర్లు విడుదల చేశారు. తమ సమస్యలను పరిష్కరించేంతవరకు ఉద్యమాలను ఉదృతం చేస్తామని పిలుపునిచ్చారు. 30 వేల గౌరవ వేతనం చెల్లించాలి : సామల మల్లయ్య, రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ రెడ్డి రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించి నెలకు 30,000 గౌరవతనం చెల్లించాలి. నిత్యవసర సరుకులను ప్రజలకు అందుబాటులోకి తెచ్చి మినీ సూపర్ మార్కెట్లుగా తీర్చిదిద్దాలి. రేషన్ డీలర్లకు హెల్త్ కార్డులు జారి చేయాలి. మరణించిన డీలర్లకు 20 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించడంతోపాటు, కుటుంబ సభ్యులలో ఒకరికి ఎలాంటి నియమ నిబంధన లేకుండా రేషన్ షాపు కేటాయించాలి. ప్రతినెల కమిషన్ విడుదల చేయాలి, దహన సంస్కారాలకు 50,000 సహాయం అందించాలి. హమాలి చార్జీల బాధ్యత ప్రభుత్వమే భరించాలి. ఓపెన్ మార్కెట్కు అనుగుణంగా గన్నీ సంచుల ధర 30 కి పెంచాలి. రేషన్ డీలర్ లలో ఉన్నత విద్యావంతులకు శాఖపరమైన పదోన్నతులు కల్పించాలి. ఈ పాస్ సర్వర్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. గోదాముల వద్ద వే బ్రిడ్జిలు నిర్మించాలి. తరుగుదల కింద రెండు శాతం బియ్యం కూడా అదనంగా కేటాయించాలి. హైదరాబాదులో రేషన్ భవన్ నిర్మాణం కోసం వెయ్యి చదరపు అడుగుల స్థలం కేటాయించి, భవన నిర్మాణానికి నిధులు విడుదల చేయాలి. పై డిమాండ్లను పరిష్కరించకుంటే బుధవారం నుండి రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జేఏసీ పిలుపుమేరకు ధర్నా కార్యక్రమం చేపడుతున్నాం.

Spread the love