50 వ రోజుకు చేరిన రిలే నిరాహార దీక్ష

– మద్దతు ప్రకటించిన సీపీఎం నేతలు
నవతెలంగాణ – గంగాధర: గర్శకుర్తి గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరుతూ మండల సాధన సమితి ఆధ్వర్యంలో ఆ గ్రామస్తులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష నేటితో 50 వ రోజుకు చేరింది. తమ గ్రామ ప్రజల చిరకాల వాంఛగా ఉన్న మండలం ఏర్పాటును తక్షణమే ప్రభుత్వం నెరవేర్చాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ గర్శకుర్తిని మండల కేంద్రంగా చేస్తామని హామీనిచ్చిన నేటికి అమలుకు నోచడం లేదని గ్రామస్తులు, మండల సాధన సమితి నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్, నాయకులు ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలని మండల సాధన సమితి నాయకులు డిమాండ్ చేశారు. గర్శకుర్తిని మండల కేంద్రంగా ఏర్పాటు చేస్తే చుట్టు పక్కన గల 10 గ్రామాల ప్రజలకు సౌలభ్యంగా ఉంటుందన్నారు. మండల కేంద్రంగా గుర్తించే వరకు చేపట్టిన రిలే నిరాహార దీక్ష ఆపేది లేదంటూ గ్రామస్తులు, మండల సాధన సమితి నాయకులు ప్రతిన బూనారు. 50 రోజులుగా కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని సిరిసిల్ల సీపీఎం రాష్ట్ర నాయకుడు మిట్టపల్లి రాజమల్లు, జన విజ్ఞాన వేదిక స్టేట్ సెక్రటరీ, హిందూ ఉత్సవ కమిటీ నాయకుడు పత్తిపాక సురేష్, శ్రీ గౌతమి మ్యాక్స్ ప్రెసిడెంట్ గౌడ శ్రీనివాస్, గౌతమి మాక్స్ ప్రెసిడెంట్ బోడ శ్రీనివాస్ సందర్శించి మద్ధతు ప్రకటించారు. మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని గర్శకర్తితోపాటు పలు గ్రామాల ప్రజలు గత 50 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్న ప్రభుత్వం, పాలకులు పట్టించుకోకపోవడం వింతగా ఉందని సిరిసిల్ల సీపీఎం రాష్ట్ర నాయకుడు మిట్టపల్లి రాజమల్లు, జన విజ్ఞాన వేదిక స్టేట్ సెక్రటరి పత్తిపాక సురేష్ మండి పడ్డారు. రిలే నిరాహార దీక్ష చేపట్టిన గ్రామ ప్రజలను, మండల సాధన సమితి నాయకులను వారు శాలువాతో సన్మానించారు. 50వ రోజు చేపట్టిన రిలే నిరాహార దీక్షలో మాజీ సర్పంచ్ మహేశుని ఈశ్వరయ్య, మండల సాధన సమితి నాయకుడు పొత్తూరు సురేష్ గ్రామస్తులు పాల్గొన్నారు.

Spread the love