ఒక్కోసారి నువ్వొద్దనుకున్నా…

ఒక్కోసారి నువ్వొద్దనుకున్నా
యుద్ధం నీ వెనకే వస్తుంది
సిద్ధంగా లేనన్నా
నిన్ను ముగ్గులోకి దింపేస్తుంది
శాంతి వచనం నీ గొంతు దాటక ముందే
భ్రాంతి తెరల్ని చీల్చేస్తుంది
నువ్వు నాటిన పొత్తులన్నీ
పొద్దు పొడిచే నాటికి కత్తులుగా మొలుస్తాయి
ఆశ్చర్యం తీరేలోగా
నిశ్చింతను తుత్తునియలు చేస్తాయి

తప్పదు మిత్రమా,
అజాత శత్రువువైనా
అప్రమత్తం గా ఉండాల్సిందే
యుద్ధం చెయ్యాల్సిందే
మంచి కోసమో, మనుగడ కోసమో
మానవతా నెగడు కోసమో,
చెడుగు ఓటమి కోసమో
జగడమాడాల్సిందే..
– డా. డి.వి.జి.శంకర రావు, 94408 36931

Spread the love