సమావేశాలు చర్చించడం తప్ప పరిష్కారం లేదు

– డాక్టర్లు లేని హాస్పిటల్‌ ఎందుకు?
– అధికారులు ప్రజా ప్రతినిధులు పూర్తిగా
– హాజరు కాని సమావేశం ఖాళీ కుర్చీలే దర్శనం
నవతెలంగాణ-ఎర్రుపాలెం
మూడు నెలలకు ఒకసారి నిర్వహించే మండల సర్వసభ్య సమావేశంలో ప్రజాప్రతి నిధులు చెప్పిన పనులు కాని, చర్చించిన ప్రజా సమస్యలు పరిష్కారం కానప్పుడు ఈ సమావేశాలు ఎందుకు, శుద్ధ దండగని భీమవరం గ్రామ పంచాయతీ సర్పంచ్‌ శీలం జయలక్ష్మి ఆవేశంగా మాట్లాడారు. ఎర్రుపాలెం మండల ప్రజా పరిషత్‌ కార్యాలయం నందు మంగళ వారం మండల సాధారణ సర్వ సభ్య సమావేశం ఎంపీపీ దేవరకొండ శిరీష అధ్యక్షతన నిర్వహించారు. వర్షం పడటంతో సమావేశాన్ని గంట ఆలస్యంగా ప్రారంభించిన సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు హాజరు కాకపోవడం గమనర్హం. ఈ సందర్భంగా మండల వ్యవసాయ శాఖ అధికారి విజయభాస్కర్‌ రెడ్డి మాట్లాడుతూ రైతులు లైసెన్సు లేని దుకాణాల నుండి విత్త నాలు కొనుగోలు చేయ వద్దని, వ్యాపారస్తుల నుండి మోస పోవద్దని తెలిపారు. ఎంపీడీవో శ్రీనివాసరావు మాట్లాడుతూ జూన్‌ నెల రెండో తారీకు నుండి 22వ తారీకు వరకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని తెలిపారు. వైద్య శాఖ తరపున హెచ్‌ఈఓ సదాశివరావు మాట్లాడుతుండుగా ఎంపీపీ కలుగ చేసుకుని డాక్టర్‌ గారు రాలేదు, ఎక్కడికి వెళ్లారు, మీరు ఎందుకు వచ్చారని అడుగుతూ మూడు నెలలకు ఒకసారి జరిగే మండల సర్వసభ్య సమావేశానికి అధికారులు రాక పోవటం పద్ధతి కాదని మరొకసారి మండల సమావేశానికి అన్ని శాఖల అధికారులు రాక పోతే సహించేది లేదని పై అధికారుల దృష్టికి వారి పైన రిపోర్ట్‌ చేస్తామని ఆవేశంగా మాట్లాడారు. ఈ సందర్భం లో మామునూరు గ్రామ పంచాయతీ సర్పంచ్‌ మోహన్‌ రావు కలగ జేసుకొని హాస్పటల్‌ లో సిబ్బంది ఉండటం లేదని సంతకాలు పెట్టి వెళ్లి పోతున్నారని నేను 14 రోజులు హాస్పిటల్‌ చుట్టూ తిరిగినా ఎవరూ లేరని లక్షల రూపాయలు జీతాలు తీసుకుంటూ ప్రజలకు వైద్య సేవలు అందించడం లేదని విమర్శించారు. కుక్కలు, కోతులు కరుస్తున్నాయి ప్రజలు వ్యాక్సిన్‌ కి వెళ్తే హాస్పటల్‌ నందు వైద్య సిబ్బంది ఉండటం లేదని సమావేశం దృష్టికి తీసుకొని వచ్చారు. జడ్పిటిసి శీలం కవిత మాట్లాడుతూ డాక్టర్స్‌ లేని ఆసుపత్రులు ఎందుకని ప్రశ్నించారు. విద్యా శాఖ అధికారి ప్రభాకర్‌ రావు మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే ప్రతి ఒక్క విద్యార్థులకు పాఠ్య పుస్తకాలతో పాటు నోటు పుస్తకాలు కూడా అందించ నున్నట్లు తెలిపారు. తాసిల్దార్‌ తిరుమల చారి మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాలలో పేదలకు ఇంటి నిర్మాణాలకు ప్రభుత్వ భూములు గుర్తించి ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు తెలిపారు. ఇళ్ల స్థలం ఉన్న వారికి ప్రభుత్వం నిర్మించనున్న ఇంటి నిర్మాణాల్లో ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు సర్పంచు లు ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.

Spread the love