సీజన్ మారింది. అడపాదడపా పడుతున్న చినుకులతో కొందరికి కాలి పగుళ్ళు రావడం ప్రారంభమవుతాయి. ఈ ప్రభావం చలికాలం పోయే వరకు కొనసాగుతుంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు కొన్ని చిట్కాలు పాటిస్తే సరి..
నిమ్మరసంలో కాస్త గ్లిజరిన్, రోజ్ వాటర్ కలిపి పగుళ్లకు అప్లై చేస్తే సమస్య కొంతవరకు తీరుతుంది. ఇందుకు… ఒక బేసిన్‌లో నీళ్లు నింపి.. అందులో ఉప్పు, నిమ్మ రసం, గ్లిజరిన్, చెంచా రోజ్ వాటర్‌ను కలిపి అందులో కాళ్లను నాన బెట్టాలి. ఆ తర్వాత ఫుట్ స్క్రబ్బర్ సాయంతో పాదాలను స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత చెంచా గ్లిజరిన్, చెంచా రోజ్ వాటర్, చెంచా నిమ్మ రసం కలుపుకొని పగిలిన పాదాలకు అప్లై చేసుకోవాలి. కావాలంటే దీన్ని అప్లై చేసుకొని రాత్రంతా అలాగే ఉంచుకోవచ్చు. ఉదయాన్నే గోరు వెచ్చని నీటితో కాళ్లను రుద్ది కడిగేయాలి. ఇలా తరచూ చేస్తుంటే పగుళ్లు మాయమవుతాయి.
తేనె చర్మానికి పోషకాలు అందించడంతో పాటు తేమను పెంచడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. దీన్ని పగుళ్లను తగ్గించేందుకు ఉపయోగించవచ్చు. ముందుగా ఒక సగం కప్పు తేనెను సగం బకెట్ గోరువెచ్చని నీళ్లలో తీసుకుని బాగా కలిపి, అందులో కాళ్లు ముంచి పావుగంట పాటు ఉంచాలి. కాళ్లు బాగా నానిన తర్వాత స్క్రబ్ చేయాలి. ఇలా రెగ్యులర్‌గా చేస్తుంటే పగుళ్లు త్వరగా తగ్గిపోతాయి.
బేకింగ్ సోడాను ప్యాక్‌లా ఉపయోగిస్తే చర్మంపై ఉన్న మతకణాలు తొలగిపోతాయి. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలున్న ఈ ప్యాక్‌ని వారానికి రెండుసార్లు చేస్తే కాళ్ళ పగుళ్లు తగ్గుతాయి. ఇందుకు ఒక బకెట్‌లో సగం నీళ్లు తీసుకొని మూడు చెంచాల బేకింగ్ సోడా వేయాలి. అందులో పావుగంట పాటు కాళ్లు ముంచి తీసి స్క్రబ్బర్‌తో రుద్దాలి. తర్వాత కాళ్లు కడుక్కుంటే సరి పోతుంది.