వార్నీ…తోలుతిత్తి రాజకీయం!

కోరి పిల్లనిస్తే..అల్లుడు అదేదో అయ్యిండంట! ఇప్పుడు బీఆర్‌ఎస్‌ పరిస్థితీ అలాగే తయారైంది. నిన్న మొన్నటి వరకు బీజేపీపైనా, కేంద్రంపైనా, గవర్నర్‌పైనా కారాలు మిరియాలు నూరిన బీఆర్‌ఎస్‌ అధినేత తీరా అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల్ని ప్రకటించేసరికి బేలగా మారిపోయారు. దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా చక్రం తిప్పుతానని ఉత్తర ప్రగల్భాలు పలికి, చివరకు ఆపార్టీ చంకెక్కారనే ప్రచారం రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. ‘దొర’ గారు బీజేపీపై రంకెలు వేస్తుంటే, ఆ మతోన్మాదాన్ని దునుమాడేందుకు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావించే కమ్యూనిస్టులు ‘మునుగోడు’ సాక్షిగా తోడుగా నిలిచారు. బీఆర్‌ఎస్‌ అధినేతపై తెలంగాణ ఉద్యమ సమయం నుంచీ ఓ నానుడి ప్రచారంలో ఉంది. ‘ఏరుదాటాక తెప్ప తగలేస్తాడు’ అని…! ఇప్పుడూ అదే జరిగింది. అయితే బీఆర్‌ఎస్‌ అధినేత వ్యవహారశైలిని ముందునుంచీ కమ్యూనిస్టులు అనుమానిస్తూనే ఉన్నారు. బీజేపీతో ఆయన వైఖరి ‘నువ్వు కొట్టినట్టు చెరు…నేను ఏడ్చినట్టు చేస్తా’ అన్నట్టే ఉంటుందని ముందే అంచనా వేశారు. అందుకే మునుగోడు ఉపఎన్నిక అయిపోగానే సీపీఐ(ఎం) రాష్ట్ర అధినేత బస్సుయాత్ర చేపట్టి, ఆపార్టీ ఎమ్మెల్యేలను పక్కన పెట్టుకొని బహిరంగంగానే ‘అవిశ్వాసం’ వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల నుంచి తప్పుకుంటే తోలుతీస్తామని హెచ్చరించారు. బీజేపీని నిలువరించేందుకే బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇచ్చామనీ తేల్చిచెప్పారు. అవకాశవాద రాజకీయంతో బీజేపీతో అంటకాగేందుకు సిద్ధపడిన గులాబీబాస్‌ తనను తాను సమర్థించు కొనేందుకు ‘నన్ను కాదని…మీరు ఇండియా కూటమిలో ఉన్నారు’ అంటూ చమత్కార ‘నమస్తే’లు విసిరారు. దేశంలో చక్రం తిప్పుతానంటూ మహారాష్ట్ర, కర్నాటక, పశ్చిమబెంగాల్‌, కేరళ రాష్ట్రాల్లో పుణ్యక్షేత్రాలు సందర్శించి వచ్చిన ‘పెద్దాయన’ ఇప్పుడు పాహి…పాహి…అంటూ గవర్నర్‌తో గతాన్ని మర్చిపోయి సర్దుకు పోతున్నారు. బీజేపీ అధినేతల్ని ఒక్కమాటంటే ఒట్టు. అంతలోనే ఎంతమార్పు సామీ! నీ అవకాశవాదం కూల…!! అని సామాన్య జనం సణుక్కుంటున్నారు.
– ఎస్‌ఎస్‌ఆర్‌ శాస్త్రి

Spread the love