మల్కాజిగిరిపై ఎవరి జెండా ఎగిరేనో..!

Lok Sabha Elections 2024
– గెలుపుపై ఎవరి ధీమా వారిదే
– మూడు పార్టీలకు ప్రతిష్టాత్మకమే
– చెమటోడుస్తున్న నేతలు
– ఓటరు నాడీ పట్టేదేవరో
నవతెలంగాణ-బోడుప్పల్‌

మల్కాజిగిరి పార్లమెంట్‌ నియోజకర్గం దేశంలోనే అత్యధికంగా ఓటర్లు ఉన్న నియోజకవర్గం. అందులోనూ అన్ని రాష్ట్రాల ప్రజలు నివాసం ఉంటుండడంతో మినీ భారత్‌గా పేరొందింది. ఈ ఎన్నికల్లో మల్కాజిగిరి హాట్‌ టాపిక్‌ అయ్యింది. మల్కాజిగిరిలో గెలుపు మూడు ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఎందుకంటే ఇక్కడి నుంచి గత ఎన్నికల్లో ఎంపీగా ఎన్నికైన రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో గెలిచి సీఎం అయ్యారు. ఇప్పుడు సిట్టింగ్‌ స్థానాన్ని ఎలాగైనా నిలుపుకోవడానికి రేవంత్‌ శత విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో తుడిచి పెట్టుకు పోయిన బీఆర్‌ఎస్‌ మల్కాజిగిరిలో అన్ని నియోజకవర్గాలను కైవసం చేసుకుంది. శాసనసభ ఎన్నికల ఒరవడినే మళ్లీ కంటీన్యూ చేయాలని గులాబీ నేతలు ముందుకు సాగుతున్నారు. ఇక బీజేపీ విషయానికి వస్తే హుజురాబాద్‌, గజ్వేల్‌ స్థానాల్లో పోటీ చేసి ఓడిపోయిన ఈటల రాజేందర్‌ మల్కాజిగిరి పార్లమెంట్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మోడీ షరిష్మాతో గెలిచి కేంద్రంలో మంత్రి కావాలనే కతనిశ్చయంతో తీవ్రంగా శ్రమిస్తున్నారు. దీంతో రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలకు మల్కాజిగిరి పార్లమెంటు గెలుపు అత్యంత ప్రతిష్టాత్మకమైంది. మరి ఓటరు నాడీ పట్టేదే వరూ.. ఇక్కడ గెలిచేది ఎవరో వేచి చూడాలి.
కాంగ్రెస్‌కు జీవన్మరణ సమస్య..
2019 మేలో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి మల్కాజిగిరి పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి మూడున్నర లక్షల మెజార్టీ ఉన్న బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మర్రి రాజశేఖర్‌రెడ్డిని ఓడించి మల్కాజిగిరి ఎంపీగా గెలిచారు. అనంతరం టీపీసీసీ అధ్యక్షుడై కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చి సీఎం అయ్యారు. ఇప్పుడు ఆయన సొంత జిల్లా మహబూబ్‌నగర్‌ కంటే కూడా తనకు రాజకీయ పునర్‌:జన్మనిచ్చిన మల్కాజిగిరి స్థానమే ఆయనకు ప్రతిష్టాత్మకమైంది. మల్కాజిగిరిలో గెలుపొందా లంటే బలమైన అభ్యర్థి కావాలని ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో దశాబ్దాల పాటు చక్రం తిప్పిన పట్నం మహేందర్‌రెడ్డి ఫ్యామిలీ నుంచి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు రెండు పర్యాయాలు, వికారాబాద్‌ జిల్లాకు ఒకసారి జడ్పీచైర్‌ పర్సన్‌గా అనుభవం ఉన్న పట్నం సునీతారెడ్డిని రంగంలోకి దింపారు. దానికి తోడు స్థానిక సంస్థలకు చెందిన ప్రజాప్రతినిధులు, మున్సి ల్‌ చైర్మెన్లు, కార్పొరేషన్‌ మేయర్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కాంగ్రెస్‌లో చేరేలా రంగం సిద్ధం చేశారు. పార్లమెంట్‌ గెలుపు బాధ్యతలను సీఎం రేవంత్‌రెడ్డి సమీక్షిస్తండడంతో పాటు గడిచిన ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు ఆయా నియోజకవర్గాల కో ఆర్డినేషన్‌ బాధ్యతలు అప్పగించారు. కుత్బుల్లాపూర్‌ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్‌తో పాటు జీహెచ్‌ఎంసీలో బీఆర్‌ఎస్‌కు చెందిన కార్పొరేటర్లు పార్టీలో చేరుతుండడం తో గెలుపుపై కాంగ్రెస్‌ ధీమాగానే ఉందనే చెప్పాలి.
పట్టుకోసం గులాబీ లీడర్ల పాట్లు..
గత ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో నష్టం జరిగినా గ్రేటర్‌ హైదరాబాదు, శివారు ప్రాంతాల్లో బీఆర్‌ఎస్‌ తన బలాన్ని నిలబెట్టుకుంది. అందులో భాగంగానే మల్కాజిగిరి పార్లమెంట్‌ పరిధిలోని ఏడు ఎమ్మెల్యే స్థానాలను గెలిచింది. ఇక్కడ గెలిచినా రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో గెలిచిన ఎమ్మెల్యేలు, ద్వితీయశ్రేణి నాయ కులు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండడంతో గెలుపుపై మీమాంసలో పడింది. మల్కాజిగిరి నుంచి పోటీ చేసేందుకు ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు, మాజీ మంత్రి మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డిలు పోటీ పడ్డారు. కానీ శాసనసభ ఎన్నికల ముందు కాంగ్రెస్‌ను వీడి బీఆర్‌ఎస్‌లో చేరిన రాగిడి లక్ష్మారెడ్డికి అధిష్టానం టికెట్‌ ఇచ్చింది. ఇక్కడ సుమారు మూడు లక్షలకు పైగా మెజార్టీ ఉన్న పార్లమెంట్‌ స్థానం గెలవకపోతే భవిష్యత్తులో బీఆర్‌ఎస్‌ మనగడే ప్రశ్నార్థకంగా మారుతుందని గులాబీ శ్రేణుల్లో బుగులు మొదలైనట్టు తెలుస్తోంది. దానికి తోడు గత ఎన్నికల్లో పార్టీ కోసం పని చేసిన ఉప్పల్‌ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్‌ రెడ్డి బీజేపీలోకి వెళ్లడం, ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా కాంగ్రెస్‌లో చేరడం, కార్పొరేటర్లు, మేయర్లు పార్టీని వీడు తుండడంతో గులాబీ నేతలు అయోమయంలో పడుతున్నారు.
ఈటలకు ప్రతిష్ఠాత్మకం..
బీఆర్‌ఎస్‌లో ఓ వెలుగు వెలిగిన ఈటల అనివార్య కారణాలతో బీఆర్‌ఎస్‌ను వీడి బీజేపీలో చేరారు. అనంత రం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీ తరఫున హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో గెలుపొందారు. అనంతరం కేసీఆర్‌పై బీఆర్‌ఎస్‌ పార్టీపై విమర్శలు ఎక్కుపెట్టి బీజేపీ జాతీయ నాయకత్వానికి దగ్గరయ్యారు. కొందరి వ్యవహరంతో పార్టీ మారుతారని వార్తలు వచ్చాయి. దీంతో జాతీయ నాయకత్వం కలుగచేసుకుని ఈటలకు చేరికల కమిటీ చైర్మెన్‌ పదవీని కట్టపెట్టింది. అ విధంగా పార్టీ పటిష్టతకు పనిచేసిన ఈటల అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్‌, గజ్వేల్‌ స్థానాల్లో పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేం దుకు టికెట్‌ సాధించారు. ఇక్కడ గెలుపొందక పోతే ఈట ల రాజకీయ భవిష్యత్తు మాత్రం ప్రశ్నార్థకంగా మారుతుందని పలువురు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఎన్ని కల షెడ్యూల్డ్‌ రావడంతోనే మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలో మోడీతో భారీ స్థాయిలో రోడ్డు షోలు నిర్వహిం చారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కీలక నేతలను పార్టీలోకి చేర్చుకోవడం లాంటి కార్యక్రమాలు నిర్వహించారు.
కాంగ్రెస్‌ పార్టీ అనుకూలతలు…
1) రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉండడం
2) అభ్యర్థి అందరికి తెలిసిన వ్యక్తి కావడం
3) ఇతర పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో చేరుతుండడం
వ్యతిరేకతలు…
1) వలస నేతలకు టికెట్‌ ఇచ్చారనే విమర్శలు, సంక్షేమ పథకాల అమలుపై సందిగ్ధత ఉండటం.
2) గతంలో పార్టీని ఇబ్బందులు పెట్టిన వారు పార్టీలో చేరుతుండడం లాంటి వ్యతిరేకతలు ఉన్నాయి.
బీఆర్‌ఎస్‌ పార్టీ అనుకూలతలు
1) పార్లమెంట్‌ సెగ్మెంట్‌లో అన్ని స్థానాల్లో పార్టీ ఎమ్మెల్యేలు ఉండడం.
2) పార్టీకి బలమైన క్యాడర్‌ ఉండడం.
వ్యతిరేకతలు
1) అభ్యర్థి అందరికి పరిచయం లేకపోవడం
2) ఎమ్మెల్యేల సహకారం కొరవడడం
3) రోజుకో నేత ఇతర పార్టీలోకి వెళ్తుండడం
బీజేపీ అనుకూలతలు
1) కేంద్రంలో అధికారంలో ఉండడం.
2) బీసీ అభ్యర్థి, కేసీఆర్‌పై పోరాడిన వ్యక్తిగా గుర్తింపు.
3) దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు ఓటర్లుగా ఉండడం.
వ్యతిరేకతలు..
1) పార్టీకి నిర్మాణం లేకపోవడం.
2) అభ్యర్థి స్థానికుడు కాకపోవడం.
3) గడిచిన పదేండ్లల్లో బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు నిధులు సరైన కేటాయించకపోవడం, నిరుద్యోగం, అధిక ధరలు లాంటి వ్యతిరేకతలు బీజేపీపై ఉన్నాయి.

Spread the love