చిచ్చా, మచ్చాల కామెడీ హంగామా

నేను నటించిన ‘ఎటీఎం’ చూసి దర్శకుడు హరీష్‌ శంకర్‌ ప్రశంసించారు. ఆయన ప్రశంస నాలో ఇంకా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఏ పాత్రనైనా చేయగలననే నమ్మకాన్ని ఇచ్చింది. ఆ నమ్మకంతోనే ఇప్పుడు ఏ పాత్ర చేసేందుకైనా సిద్ధంగా ఉన్నాను. అలాగే హీరోగా చేస్తూనే పెద్ద హీరోల సినిమాలో చిన్న క్యారెక్టర్‌ చేయడానికి కూడా రెడీగా ఉన్నాను. ప్రస్తుతం రెండు సినిమాలు జరుగుతున్నాయి. అందులో ఒకటి ఫన్‌, మరొకటి సస్పెన్స్‌ థ్రిల్లర్‌.
‘పిల్లా నువ్వు లేని జీవితం, సీమ శాస్త్రి, ఈడోరకం ఆడోరకం’ వంటి హాస్య ప్రధాన చిత్రాలతో రచయితగా తనదైన ముద్ర వేసుకున్న డైమండ్‌ రత్నబాబు దర్శకత్వంలో రూపొందిన హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌ ‘అన్‌ స్టాపబుల్‌’. ‘అన్‌ లిమిటెడ్‌ ఫన్‌’ అనేది ఉపశీర్షిక. బిగ్‌ బాస్‌ విన్నర్‌ విజె సన్నీ, సప్తగిరి హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో నక్షత్ర, అక్సాఖాన్‌ హీరోయిన్లు.
ఎ2బి ఇండియా ప్రొడక్షన్‌లో రజిత్‌రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈనెల 9న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో హీరో వి జె సన్నీ మీడియాతో ముచ్చటించారు.
”బిగ్‌ బాస్‌’ తర్వాత కొత్త నిర్మాణ సంస్థల నుంచి చాలా మంది సంప్రదించారు. అయితే కథలన్నీ ఎక్కువగా మాస్‌ కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉన్నవే వచ్చాయి. నాకు కామెడీ, థ్రిల్లర్‌, హారర్‌ కామెడీ కథలు చేయాలని ఉండేది. అలాగే పక్కింటి కుర్రాడిలా అనిపించే పాత్రలు చేయాలనీ ఉండేది. ఇలాంటి సమయంలో ‘అన్‌ స్టాపబుల్‌’ లాంటి అన్‌ లిమిటెడ్‌ ఫన్‌ కథ విన్నాను. చాలా నచ్చింది. కథ విన్నంత సేపు నవ్వుతూనే ఉన్నాను. కథని నమ్మి చేసిన చిత్రమిది. ఇందులో చాలా మంది సీనియర్‌ నటీనటులు ఉన్నారు. వాళ్ళతో చాలా ఫ్రెండ్లీగా చేశాం. అందరూ చాలా మంచి కంఫర్ట్‌ జోన్‌ కల్పించారు. నేను నాటకరంగం నుంచి రావడం కూడా ప్లస్‌ అయ్యింది. సప్తగిరితో పని చేయడం ఓ మంచి అనుభూతి. సప్తగిరి చాలా ఎనర్జిటిక్‌. సీన్‌లో ఆయన ఉండే ఇన్వాల్వ్‌మెంట్‌ నెక్స్ట్‌ లెవల్‌లో ఉంటుంది. చాలా స్పోర్టివ్‌ స్పిరిట్‌తో వర్క్‌ చేశాం. ఇందులో చిచ్చా, మచ్చాలుగా కనిపిస్తాం. సినిమా అంతా తను నాతో పాటే ఉంటారు. మేము ఇద్దరం ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటాం?, దాని నుంచి ఎలా బయటకి వచ్చాం? డబ్బు అనేది మా జీవితాలతో ఎలా ఆడుకుందనేది కథ. ఇందులో మంచి స్టొరీ లైన్‌ ఉంది. అలాగే చివరి వరకూ ఫన్‌ రైడూ ఉంది. ప్రతి పాత్ర కామెడీ పంచుతుంది. ఎక్కడా బోర్‌ కొట్టించకూడదనే ఉద్దేశంతో చేసిన చిత్రమిది.
ఇందులో నాకు జంటగా నక్షత్ర నటించింది. ‘బిగ్‌ బాస్‌’ తర్వాత దాదాపు ముఫ్ఫై కథలు విన్నాను. ఇందులో డైమండ్‌ రత్నబాబు చెప్పిన కథ చాలా నచ్చింది. రత్నబాబు కూడా చాలా స్వేచ్ఛ ఇచ్చారు. దర్శకుడు, నిర్మాత, నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరం టీం వర్క్‌గా ఈ సినిమా చేశాం’ అని విజె సన్నీ అన్నారు.

Spread the love