సైన్స్‌కు వక్రభాష్యం

– కేంద్ర మంత్రులపై శాస్త్రవేత్తల మండిపాటు
న్యూఢిల్లీ : ఎన్సీఈఆర్టీ పుస్తకాల సమీక్షపై పలువురు శాస్త్రవేత్తలు తమ నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రులు సైన్స్‌కు వక్రభాష్యం చెబుతున్నారని మండిపడ్డారు. పరిశోధన ప్రాజెక్టులకు నిధుల కేటాయింపును తగ్గించడాన్ని తప్పు పట్టారు. దేశంలో వివిధ రంగాలకు చెందిన శాస్త్రవేత్తలు న్యూఢిల్లీలోని కాన్‌స్టిట్యూ షన్‌ క్లబ్‌లో సమావేశమయ్యారు. ప్రస్తుతం అమలవుతున్న సైన్స్‌ విధానం చిన్నారులపై భారం మోపుతోందని ప్రముఖ భాషావేత్త జిఎన్‌ దేవి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పాలకులు అనుసరిస్తున్న రాజకీయ విధానాలు ప్రజలను మత్తు లో ముంచుతున్నాయని, వారు దేనిపైనా స్పందించలేకపోతున్నారని చెప్పారు. కేంద్రప్రభుత్వం, మంత్రులు అబద్ధాలు చెబుతున్నారని తెలిసినప్పటికీ వారు నిద్రా వస్థలో జోగుతున్నారని వాపోయారు. రాజ్యాంగం నిర్మించిన వ్యవస్థ లన్నీ బలహీ నమయ్యాయని చెప్పారు. విద్యార్థులు, పరిశోధకులు, అధ్యాపకులను భయపెడు తున్నారని, అవమానిస్తున్నారని తెలిపారు. పరిశోధన ప్రాజెక్టులకు నిధుల కేటా యింపు ప్రభుత్వ దయా దాక్షిణ్యాలపై ఆధారపడి ఉందని చెప్పారు. ఆదివాసీ గిరి జనుల జాతి స్వచ్ఛతను పరీక్షించేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టుకు కేంద్ర సాంస్కృతిక శాఖ నిధులిచ్చినప్పుడు 150 మంది శాస్త్రవేత్తలు వ్యతిరేకించారని గుర్తు చేశారు. వలస కార్మికులు సంస్కృత భాష నేర్చుకొని దేశాన్ని ‘విశ్వగురు’గా మార్చాలన్న కేంద్ర ప్రతిపాదనను కూడా శాస్త్రవేత్తలు నిరసించారని తెలిపారు. ఇటీవల చార్లెస్‌ డార్విన్‌ సిద్ధాంతాన్ని సైన్స్‌ పుస్తకాల నుంచి తొలగించినప్పుడు కూడా ఇదే విధ మైన వ్యతిరేకత వ్యక్తమైందని అన్నారు. డార్విన్‌ సిద్ధాంతం స్థానంలో మనుస్మృతి, పురాణాలను చేర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ నేపథ్యం లో సైన్స్‌ను రక్షించుకోవాలని, అలా చేస్తే ప్రజాస్వామ్యాన్ని కూడా రక్షించినట్లే అవుతుందని తెలిపారు. శాస్త్రీయ నైపుణ్యం దాడికి గురవుతోందని జవహర్‌లాల్‌ యూనివర్సిటీకి చెందిన ధృవ్‌ రైనా వాపోయారు. సైన్స్‌ అనేది ఏ ఒక్కరికో పరిమితం కాదని, అది అందరి ఉమ్మడి కృషి అని చెప్పారు.
అశాస్త్రీయ పద్ధతులను పాటించడం వల్ల తల్లులు, గర్భస్థ శిశువుల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోందని శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్‌ అంబరీష్‌ సాత్విక్‌ హెచ్చరించారు. జ్యోతిష్యులు నిర్ణయించిన సమయానికి ప్రసవం కావాలంటూ కొందరు తల్లిదండ్రులు వైద్యులపై ఒత్తిడి తెస్తున్నారని ఆయన తెలిపారు. ఇది మూఢనమ్మకమే తప్పించి మరొకటి కాదని అన్నారు. శాస్త్రవేత్తల మధ్య నిరంతరం చర్చలు జరగకపోవడం ప్రస్తుత సంక్షోభానికి ఒక కారణమని ప్రముఖ చరిత్రకారిణి రొమీలా థాపర్‌ చెప్పారు. చరిత్ర, శాస్త్రం మధ్య కొన్ని వైరుధ్యాలు ఉన్నాయని ఆమె అన్నారు.

Spread the love