కాంతారకు అరుదైన గౌరవం

– నేడు ఐక్యరాజ్య సమితిలో ప్రదర్శన
కేవలం 15 కోట్లతో రూపొంది ప్రపంచ వ్యాప్తంగా రూ.400 కోట్లని కొల్లకొట్టిన ‘కాంతార’ చిత్రానికి అరుదైన గౌరవం లభించింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు, విమర్శకులు మెచ్చిన చిత్రంగానే కాకుండా తక్కువ బడ్జెట్‌తో రూపొంది భారీ కలెక్షన్లు సాధించిన సినిమాగా ఘనతకెక్కిన ‘కాంతార’ మరోమారు వార్తల్లో నిలిచి తన సత్తా చాటుకోవడం విశేషం. నేడు (శుక్రవారం) ఈ చిత్రం జెనీవాలోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో ప్రదర్శితం కానుంది. ఈ సినిమా స్క్రీనింగ్‌ కోసం చిత్ర హీరో, దర్శకుడు రిషబ్‌ శెట్టి ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. ఐరాసలో ప్రదర్శితమవుతున్న మొదటి కన్నడ ‘కాంతార’ కావడం విశేషం. ఈ చిత్రం ఈ గౌరవాన్ని పొందడానికి కారణం సినిమాలో ఉన్న కంటెంటే. యూనివర్సల్‌ కంటెంట్‌తో తెరకెక్కిన చిత్రం కావడంతో ఐరాసలో ఈ చిత్రాన్ని స్క్రీనింగ్‌కు ఎంపిక చేశారు. ఐరాస పాథె బలెక్సెర్ట్‌ హాల్‌ నెం.13లో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. ఈ ప్రదర్శనకు ఐరాస ప్రముఖులందరూ హాజరకానున్నారు. వారందరితో కలిసి రిషబ్‌శెట్టి ఈ సినిమాని వీక్షించనున్నారు. అలాగే ఈ సినిమా ప్రదర్శన అనంతరం ఆయన ఈ సినిమాలోని కంటెంట్‌ గురించి, భారతీయ సినిమా గురించి మాట్లాడబోతున్నారు. ముఖ్యంగా ఈ సినిమా చిత్రీకరణ జరిగిన ప్రధాన అంశమైన అడవుల పరిరక్షణ, అటవీ ప్రాంతంపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న గిరిజనుల సమస్యలు, అడవులలో ఉండే వాతావరణం, పర్యావరణానికి సంబంధించిన రక్షణ వంటి విషయాలపై ఆయన చర్చించనున్నట్టు తెలుస్తోంది. విశేష ఆదరణ పొందిన ‘కాంతార’ చిత్రానికి సీక్వెల్‌ని త్వరలోనే ప్రారంభించబోతున్నట్టు దర్శకుడు రిషబ్‌శెట్టి ఇటీవల ప్రకటించిన విషయం విదితమే.

Spread the love