చెత్తకుప్పలో ఆధార్‌కార్డులు, పాన్‌కార్డులు

Aadhar-cardsనవతెలంగాణ – కులకచర్ల: గ్రామాల్లో ప్రజలకు భద్రంగా అందాల్సిన ఆధార్‌, పాన్‌ కార్డులు, పలు ఉత్తరాలు శనివారం గ్రామ పంచాయతీలో చెత్త సేకరణకు వచ్చిన ట్రాక్టర్‌లో దర్శనమిచ్చాయి. వాటిని చూసిన గ్రామస్థులు.. భద్రంగా ప్రజలకు అందజేయాల్సిన పోస్టుమ్యాన్‌ నిర్లక్ష్యంగా ఇలా పడేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన వికారాబాద్‌ జిల్లా కులకచర్ల మండలం చౌడాపూర్‌లో చోటుచేసుకున్నది. మండల పరిధిలోని చౌడాపూర్‌, మందిపల్‌, వీరాపూర్‌, విఠలాపూర్‌, అడవివెంకటాపూర్‌, మక్తవెంకటాపూర్‌ గ్రామాలకు నర్సింలు పోస్టుమ్యాన్‌గా పనిచేస్తున్నాడు. 2011 నుంచి ప్రజలకు ఆధార్‌, పాన్‌ కార్డులు, ఇతర పోస్టు కార్డులు వందల సంఖ్యలో వచ్చాయి. వాటిని ప్రజలకు అందించకుండా ఇంట్లోనే సంచిలో దాచి ఉంచాడు. పోస్టుమ్యాన్‌ కూతురు అనుకోకుండా శనివారం గ్రామ పంచాయతీ ద్వారా చెత్త సేకరణకు వచ్చిన ట్రాక్టర్‌లో ఆ ఉత్తరాల సంచిని పడేసింది. ఈ సంచిని గమనించిన గ్రామస్థులు.. ట్రాక్టర్‌ను ఆపి చెత్తలో నుంచి ఐడీ కార్డులను తీసి చూడగా వందల సంఖ్యలో ఆధార్‌, పాన్‌ కార్డులు దొరికాయి. గ్రామానికి చెందిన చాలా మంది అక్కడికి వచ్చి తమ ఆధార్‌ కార్డులను తీసుకున్నారు. మిగిలిన కార్డులను గ్రామ పంచాయతీ కార్యాలయంలో అప్పగించారు. దీంతో గ్రామస్థులు.. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పోస్టుమ్యాన్‌ను ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నారు. చెత్త ట్రాక్టర్‌లో దొరికిన ఆధార్‌ కార్డులపై నవాబుపేట్‌ పోస్టాఫీసు సిబ్బంది విచారణ చేపట్టారు. తహసీల్దార్‌ నుంచి సమాచారం సేకరించారు. ఈ సంఘటనకు సంబంధించి.. పూర్తి వివరాలను ఉన్నతస్థాయి అధికారులకు పంపిస్తామని పోస్టాఫీసు అధికారులు తెలిపారు.

 

Spread the love