ఏఎల్పీ గని ప్రమాదంలో కార్మికుడు మృతి 

నవతెలంగాణ-రామగిరి
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని సింగరేణి ఏపీఏ పరిధిలోని అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్ట్ (ఏఎల్పీ) గనిలో మంగళవారం రాత్రి జరిగిన ప్రమాదంలో బొర్ల సారయ్య(40) అనే ఎంజేడబ్ల్యూ కార్మికుడు మృతి చెందాడు. ఏఎల్పీ గనిలోని ఎల్సీ-6, ఎల్సీ-7ల మద్య జంబో మిషన్ వద్ద అసిస్టెంట్గా సేవలందిస్తున్న సారయ్య జంబో మిషన్ను ఆపరేటర్ స్టార్ట్ చేస్తుండగా ఆయిల్ ఓస్ పైప్ ఒక్కసారిగా ఊడి అక్కడే ఉన్న సారయ్య చాతిలో బలంగా తాకడంతో అక్కడే పడిపోయాడు. గమనించిన కార్మికులు వెంటనే అధికారులకు సమాచారం అందించగా అతనికి ప్రథమ చికిత్స చేసినా ఫలితం లేక అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలిసిన టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు గౌతం శంకరయ్య, ఫిట్ సెక్రెటరీ దాసరి మల్లేష్, జీఎం కమిటీ సభ్యుడు దేవ శ్రీనివాస్ ఏపీఏ జీఎం వెంకటేశ్వర్లు ఇతర అధికారులు హుటాహుటిన అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించి సారయ్యను గోదావరిఖని ఆసుపత్రికి తరలించగా వైద్యులు మృతి చెందినట్లు దృవీకరించారు. అసలే ప్రమాదాలకు నిలయమైన ఏఎల్పీ గనిలో నిత్యం రూఫ్ ఫాల్ అవుతూ ప్రమాదాలు జరుగుతుండగా చివరకు ఓస్ పైప్ ఊడి కార్మికుడు మృతి చెందడం ప్రమాదాల పరంపరను కొనసాగించనట్లయింది. ఇప్పటికే కొత్తగా ఏఎల్పీకి వచ్చే డిపెండెంట్ ఉద్యోగులు కేజీఎఫ్ లాంటి ఏఎల్పీలో తాము పనిచేయలేమని డిప్యూటేషన్ల కొరకు ప్రయత్నిస్తూ గైర్హాజర్ అవుతుండగా ఇలాంటి ప్రమాదాలు వారిని మరింత భయభ్రాంతులకు గురిచేసే అవకాశం ఉంది.
Spread the love