సమన్వయంలోనూ అశ్వారావుపేటకు దక్కని సముచిత స్థానం…

– వలస పక్షులకే ప్రాధాన్యం…
– సీనియర్‌లకు దొరకని సీటు…
నవతెలంగాణ-అశ్వారావుపేట
రాజకీయంగా, సామాజికంగా, అభివద్ది పరంగా నియోజక వర్గం కేంద్రానికి అంత ప్రాధాన్యత ఇవ్వని గులాబి పార్టీ నేతలు పార్లమెంట్‌ ఎన్నికల నేపధ్యంలో రూపొందిన నియోజక వర్గం సమన్వయ కమిటీలో నూ అశ్వారావుపేట నాయకులకు సముచిత స్థానం దక్కలేదని కారు సమితి కార్యకర్తలు కొందరు గుసగుసలాడుకుంటున్నారు. గతంలోనూ పార్టీలో అసలు నాయకులు కంటే బయట నుండి వచ్చిన కొసరు నాయకులే పెత్తనం చేసినట్లుగా నేడు సమన్వయ కమిటీ లోనూ వలస పక్షులకే అధిక ప్రాధాన్యత ఇచ్చారని ఆరోపణలు వస్తున్నాయి. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు ఆదేశాల మేరకు ఖమ్మం పార్లమెంట్‌ ఎన్నికల నిమిత్తం అశ్వారావుపేట నియోజకవర్గ సమన్వయ కమిటీని పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఖమ్మం ఎమ్మెల్సీ తాతా మధు సూధన్‌ అధికారికంగా గురువారం నియోజక వర్గం కమిటీని ప్రకటించారు. ఇందులో 11 మంది సభ్యులలో ఇరువురు మాజీ ఎమ్మెల్యేలు మెచ్చా నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు, ఇరువురు, చండ్రుగొండ, ములకలపల్లి జెడ్పీటీసీలు, కొనకండ్ల వెంకటరెడ్డి, సున్నం నాగమణి, దమ్మపేట మండలం, దమ్మపేట మాజీ సొసైటీ చైర్మెన్‌ రావు జోగేశ్వరరావు, సోయం వీరభద్రం, పర్వతనేని రామక్రిష్ణ, చండ్రుగొండ మండలంకు చెందిన గాదె లింగయ్యయాదవ్‌, అశ్వారావుపేట మండలం నుండి యూఎస్‌.ప్రకాశరావు, వగ్గెల పూజిత, భూక్యా ప్రసాద్‌లు ఉన్నారు. అయితే ఇందులో దమ్మపేట మండలం నుండి ఇరువురు మాజీ ఎమ్మెల్యేలు మెచ్చా నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు, సున్నం నాగమణి, రావు జోగేశ్వరరావు, సోయం వీరభద్రం, పర్వతనేని రామక్రిష్ణతో మొత్తం ఆరుగురు సభ్యులు ఉన్నారు. అశ్వారావుపేట నుండి యూఎస్‌ ప్రకాశ్‌రావు, భూక్యా ప్రసాద్‌, వగ్గెల పూజితతో ముగ్గురు మాత్రమే. చండ్రుగొండ నుండి కొనకండ్ల వెంకటరెడ్డి, గాదె లింగయ్య యాదవ్‌ ఇరువురికి మాత్రమే ప్రాతినిద్యం ఉంది. ఈ కమిటీలో ప్రాతినిధ్యం పరంగా నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేటకు, భౌగోళికంగా ములకలపల్లి, అన్నపురెడ్డిపల్లి మండలాలకు, రాజకీయంగా బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు వివక్షకు గురైనట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తాటి వెంకటేశ్వర్లు, సున్నం నాగమణి, కొనకొండ్ల వెంకటరెడ్డి, వగ్గెల పూజిత కాంగ్రెస్‌ నుండి, భూక్యా ప్రసాద్‌ బీజేపీ నుండి, సోయం వీరభద్రం వైఎస్‌ ఆర్‌ సీపీ నుండి అసెంబ్లీ పోలింగ్‌కు ముందు రోజు బీఆర్‌ఎస్‌లో చేరిన వారు కావడం గమనార్హం. ఈ క్రమంలో ఎప్పటి నుండో పార్టీలో ఉంటూ వ్యయప్రయాసలకు ఓర్చుకుంటూ ఉన్న నాయకులకు అన్యాయం జరిగిందని పలువురు నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూడాలి ఎన్నికల ముందు ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటాయో…

Spread the love