డోర్నకల్‌- మిర్యాలగూడ రైల్వేలైన్‌ అలైన్మెంట్‌ మార్చండి

– రైల్వే మంత్రికి నామ వినతి
 నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
ఖమ్మం జిల్లాతో సంబంధం లేకుండా ప్రత్యామ్నాయ మార్గంలో ‘డోర్నకల్‌ – మిర్యాలగూడ” రైల్వే లైన్‌ ‘అలైన్మెంట్‌’ ను మార్చాలని బీఆర్‌ఎస్‌ లోక్‌ సభా పక్ష నేత నామ నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ఈమేరకు ఆయన వినతిపత్రాన్ని సమర్పించారు.ప్రస్తుతం అలైనెంట్‌తో ఖమ్మం రూరల్‌, నేలకొండపల్లి, ముదిగొండ మండలాల్లో చాలా మంది రైతులు తమ భూములను కోల్పోతారని వివరించారు. నాలుగు హైవేల వల్ల, నాగార్జున సాగర్‌ కాలువ కింద ఇప్పటికే రైతులు ఆయా మండలాల్లో వందలాది ఎకరాల వ్యవసాయ భూముల కోల్పోయారని గుర్తు చేశారు. ప్రతిపాదిత రైలు మార్గంతో ఆ జిల్లాకు ఒనగూడే ప్రయోజనం లేదని స్పష్టం చేశారు. ఖమ్మం పట్టణానికి దగ్గరలో ఉన్న పలు గ్రామాల్లో రైల్వే లైన్‌ కింద పోయే వ్యవసాయ భూములు ఎంతో విలువైనవని పేర్కొన్నారు. జిల్లాలోని రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు. దీనిపై రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించినట్టు నామా పేర్కొన్నారు.
మణిపూర్‌పై ప్రజలకు వాస్తవాలు చెప్పండి
మణిపూర్‌ అల్లర్లపై ప్రజలకు వాస్తవాలు చెప్పాలంటూ నామా డిమాండ్‌ చేశారు. 80 రోజులుగా మణిపూర్‌ లో జరుగుతున్న హింసపై చర్చించి, ప్రధాని మోడీ నోరు విప్పాలని కోరారు. శుక్రవారం లోక్‌సభలో ఇదే అంశంపై వాయిదా తీర్మానం ఇచ్చారు. దానిపై చర్చ జరపకుండా ప్రభుత్వం సభను వాయిదా వేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మణిపూర్‌ అంశంపై చర్చకు అనుమతించకుండా ఎందుకు కేంద్ర ప్రభుత్వం వెనక్కిపోతుందని విమర్శించారు. ఇందుకు సంబంధించి ఎక్కడ వాస్తవాలు చెప్పాల్సి వస్తుందోననే భయంతోనే కేంద్రం చర్చకు అనుమతి ఇవ్వడం లేదన్నారు. కేవలం బిల్లుల ఆమోదం కోసం కాకుండా సత్వరమే ఈ అంశంపై సభలో చర్చించాలని డిమాండ్‌ చేశారు.

Spread the love