ఇళ్ల నిర్మాణాలు ప్రారంభిస్తాం: సీఎం జగన్‌

నవతెలంగాణ – అమరావతి: రాజధాని పరిధిలో పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాల్లో నిర్మాణాలకు వారం రోజుల్లోనే బీజం వేయబోతున్నామని సీఎం జగన్‌ చెప్పారు. అమరావతి పరిధిలోని వెంకటపాలెంలో ఇళ్ల పట్టాల పంపిణీ ప్రారంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మౌలిక వసతులన్నీ కల్పిస్తూ లబ్ధిదారులకు ఇంటి పత్రాలు అందజేస్తామన్నారు. ఇవాళ్టి నుంచి ఈ ప్రాంతం సామాజిక అమరావతి అవుతుందని చెప్పారు. ‘‘మహిళల పేరుతో ఇళ్ల పట్టాలన్నీ ఇస్తున్నాం. జులై 8న నాన్న జయంతి రోజు ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తాం. ఇళ్లు ఎలా కట్టుకోవాలనే విషయంపై లబ్ధిదారులకు మూడు ఆప్షన్లు ఇస్తాం. పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం తాపత్రయ పడుతోంది. కొంతమంది దీన్ని అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారు. దేశ చరిత్రలోనే ఈ కార్యక్రమానికి ఓ ప్రత్యేకత ఉంది. పేదల కోసం కోర్టుల్లోనే పోరాడి విజయం సాధించాం. ఇళ్ల స్థలాల పత్రాలు లబ్ధిదారులకు ఇచ్చే హక్కులే కాదు.. సామాజిక, న్యాయ పత్రాలు. ఇవాళ్టి నుంచి ఇదే అమరావతి ఒక సామాజిక అమరావతి, మనందరి అమరావతి అవుతుంది. ప్రతి లేఔట్‌ వద్దకు లబ్ధిదారులను తీసుకెళ్లి అక్కడే ఫొటో తీసుకుంటాం. మరో వారం రోజులు ఈ పండగ కార్యక్రమం కొనసాగుతుంది’’ అని జగన్‌ అన్నారు.

Spread the love